e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home హైదరాబాద్‌ ఒక్క ఐడియా.. 1400 మందికి ఊపిరినిచ్చింది

ఒక్క ఐడియా.. 1400 మందికి ఊపిరినిచ్చింది

ఒక్క ఐడియా.. 1400 మందికి ఊపిరినిచ్చింది
  • కొవిడ్‌ బాధితులకు వార్‌రూమ్‌ ఏర్పాటు చేసిన టెకీ
  • ఒక్కడితో మొదలై 500 మందికి చేరిన వలంటీర్లు
  • 45 రోజుల్లో రూ.47లక్షలు సమీకరణ

హైదరాబాద్‌, జూన్‌ 15 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితుల కోసం ఒక వార్‌రూమ్‌ ఏర్పాటుచేయాలన్న ఆలోచన ఇప్పటికి 1400 కుటుంబాల్లో వెలుగులు నింపింది. కరోనా రక్కసి కోరల్లో చిక్కుకొని ఆర్థికంగా చితికిపోయి, ఏం చేయాలో దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్న వారికి కొండంత అండగా నిలుస్తున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఓ టెకీ. కొవిడ్‌ బాధితుల కోసమే ప్రత్యేక వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసి ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలన్నా, కాన్సన్‌ట్రేటర్లు, దవాఖానల్లో బెడ్స్‌ కావాలన్నా ఏర్పాటు చేస్తున్నాడు. ఇలా ఇప్పటివరకు 1400 మందికి తనవంతు సాయం చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. అతని పేరు శ్రీహర్ష. అతడు మొదలు పెట్టిన పని అతని మాటల్లోనే..

ఒక్కడితో మొదలై..

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మొదలయ్యాక సామాజిక మాధ్యమాలలో బాధితుల రిక్వెస్ట్‌లు చూసి చలించిపోయా. వారి అవసరాలను ఆన్‌లైన్‌లో వెతికి హాస్పిటల్‌ బెడ్లు, ఆక్సిజన్‌, మెడిసిన్‌ వంటివి సమకూర్చే ప్రయత్నం చేశా. మొదటి మూడు రోజుల్లో 20 మంది అవసరాలు తీర్చా. తరువాత మేం కూడా సాయం చేయొచ్చా అని చాలామంది అడిగారు. అలా నాలుగైదు రోజుల్లోనే 40 మందితో ఓ గ్రూప్‌ తయారైంది. అనంతరం నా కాలేజీ ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ గ్రూప్‌లో ఒక పోస్ట్‌ పెట్టాను రోజుకు గంట, రెండు గంటల సమయం కేటాయించి ఆపదలో ఉన్నవారికి సాయపడొచ్చు. ఇక్కడికి వచ్చి ఆన్‌లైన్‌లో వెతికి ఫోన్‌కాల్స్‌ చేసి వెరిఫై చేయాలని చెప్పాను. ఓ 20 నుంచి 30 మంది వస్తారనుకుంటే 250 మంది ముందుకు వచ్చారు. ప్రస్తుతం 500 మంది వలంటీర్లు ఉన్నారు. దీంతో మా పని ఇంకా సులభమైపోయింది. చాలామంది అమెరికా నుంచి మా కోసం పనిచేస్తున్నారు. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలకు రీచ్‌ అవ్వడం కోసం కొవిడ్‌ వార్‌ రూం ఏర్పాటు చేశాం.

ఇప్పటివరకు అందించిన సాయం..

  • పోచంపల్లిలో 50 మంది కూలీలు, 740 అణగారిన కుటుంబాలు, 125 మంది కమర్షియల్‌ సెక్స్‌ వర్కర్లు, హెచ్‌ఐవీ బాధిత కుటుంబాలు, 50 మంది గర్భిణులు, బాలింతలు ఉన్న కుటుంబాలకు రేషన్‌ కిట్లు పంపిణీ చేశాం.
  • తుర్కయంజల్‌ గ్రామంలో 20వేల మందికి వ్యాక్సినేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేయించాం.
  • ఇప్పటివరకు 18 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు ఉచితంగా పంపిణీ చేశాం.
  • కూకట్‌పల్లిలో 45 ఆక్సిజన్‌ పడకలు, 15 ఐసీయూ పడకలను కొవిడ్‌ బాధితుల కోసం ఏర్పాటు చేశాం. ఇందుకోసం రూ.5.5 లక్షలు ఖర్చు చేశాం.
  • ఆగ్రాలో రిక్షా కార్మికులకు 250 నిత్యావసరాలతో కూడిన కిట్లు పంపిణీ చేశాం’ అని వివరించారు.

క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధుల సమీకరణ

- Advertisement -

వలంటీర్‌ గ్రూప్‌ పెరిగిన తరువాత ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు తెప్పించి ఇవ్వొచ్చని, మెడికల్‌ ఎమర్జెన్సీలో ఉన్నవారికి స్వల్పంగా ఆర్థిక సాయం అందించవచ్చనే ఉద్దేశంతో నిధుల సమీకరణ మొదలుపెట్టాం. గుడ్‌క్లాప్‌ అనే ఫండ్‌ రైజింగ్‌ కంపెనీ ఇందుకోసం ముందుకు వచ్చింది. ఇలా ఏప్రిల్‌ 29 నుంచి ఇప్పటివరకు రూ.47లక్షలు విరాళాల రూపంలో సమీకరించాం. ఆ డబ్బుతో ఆగ్రా, అజ్మీర్‌, భోపాల్‌, ఢిల్లీ, బెంగళూరుతో పాటు వైజాగ్‌, కాకినాడ, హైదరాబాద్‌లో 1400 మంది కొవిడ్‌ బాధితుల అవసరాలు తీర్చాం. తెలంగాణ, ఇతర రాష్ర్టాల్లో కలిపి ఇప్పటివరకు 800 మందికి రేషన్‌ కిట్లు అందజేశాం.

సాయం కోసం

దవాఖానల్లో బెడ్లు, మెడిసిన్‌, ఆక్సిజన్‌ సపోర్ట్‌ కావాలనుకునేవారు వార్‌రూమ్‌ నంబరు 6304296587లో సంప్రదించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో https://www. instagram.com/sriharshakaramchati/, ట్విటర్‌లో https:// twitter.com/Harshakaramchati లో సంప్రదించవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఒక్క ఐడియా.. 1400 మందికి ఊపిరినిచ్చింది
ఒక్క ఐడియా.. 1400 మందికి ఊపిరినిచ్చింది
ఒక్క ఐడియా.. 1400 మందికి ఊపిరినిచ్చింది

ట్రెండింగ్‌

Advertisement