e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home హైదరాబాద్‌ కరోనా వేళ.. అన్నార్తులకు ఆపన్నహస్తం

కరోనా వేళ.. అన్నార్తులకు ఆపన్నహస్తం

కరోనా వేళ.. అన్నార్తులకు ఆపన్నహస్తం
  • ‘మేమున్నాం..మీకేం కాదని’.. భరోసా
  • ఆపత్కాలంలో పరిమళిస్తున్న మానవత్వం
  • బాధితులకు సేవలందిస్తున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు
  • కొవిడ్‌ రోగులకు అందించేందుకు ఆహారాన్ని సిద్ధం చేసే కార్యక్రమంలో నిమగ్నమైన
  • సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు సిబ్బంది

“మానవసేవే మాధవసేవ.. ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న”.. ఇలాంటి సామెతలను తరచూ పెద్దలు చెబుతుంటారు… సామాజిక మాధ్యమాల్లోనూ షేర్‌ చేస్తూంటారు… కానీ కొందరు ఆచరణలో చూపెడుతారు. వాస్తవంగా సాయం చేయాలంటే.. గొప్ప మనసు ఉండాలి.. ఆ తపన మనసులో నుంచి ఉద్భవించాలి.. అలాంటి వారు అరుదుగానే ఉంటా రు.. సాటి మనిషికి సేవ చేయడం బాధ్యతగా భావించి ముందుకొస్తుంటారు. నిత్యం ఏదో రూపంలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవుతుంటారు. అలా ఈ సంక్షోభ సమయంలోనూ కొందరు మానవతామూర్తులు అన్నార్తులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. కొవిడ్‌ కారణంగా ఛిన్నాభిన్నమైన కుటుంబాలకు అన్నీ..తామై అండగా నిలుస్తున్నారు. అనాథలకు ఆత్మబంధువులవుతున్నారు. ఓ ఐటీ ఉద్యోగిని నెల జీతమంతా అభాగ్యులకు వెచ్చిస్తుంటే.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కరోనా బాధితులకు మందులు, వైద్యం, భోజనాలు, పౌష్టికాహారం అందిస్తున్నా యి.. పేదలకు కడుపునిండా అన్నం పెట్టి ఆకలి తీర్చుతున్నాయి.

ఎల్బీనగర్‌, మే 30 : దక్షిణ షిర్డీగా విరాజిల్లుతున్న దిల్‌సుఖ్‌నగర్‌ శ్రీ షిర్డి సాయిబాబా ఆలయ ట్రస్టు కరోనా క్లిష్ట పరిస్థితుల్లో బాధితుల కడుపు నింపుతోంది. కరోనా సోకి ఎలాంటి వసతి లేకుండా ఇబ్బందిపడే వారికి మూడు పూటలా పౌష్టికాహారం పెడుతూ మన్ననలు అందుకుంటున్నది. ఆలయం వద్ద బాధితులకు సలహాలిచ్చేందుకు డాక్టర్‌ను నియమించడంతోపాటు కరోనా సోకి హోంక్వారంటైన్‌లో ఉన్నవారు, వారి కుటుంబసభ్యులకు ఉచితంగా ఆహారం అందిస్తున్నది. దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు ఆలయానికి సుమారు 4 కిలోమీటర్ల పరిధిలో ఉంటున్న వారికి ఈ ఉచిత ఆహారాన్ని ఇంటికే అందజేస్తున్నారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, సాయంత్రం.. ఇలా మూడు పూటలా నిత్యం వెయ్యిమందికి 3వేల ఆహార బాక్సులను అందజేస్తున్నారు.

పౌష్టికాహారంతో త్వరగా కోలుకునేలా..

ఆలయం వద్ద నిత్య అన్నదానం కొనసాగేది. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ క్రమంలో కొవిడ్‌ బాధితులకు భోజనంపెట్టాలని నిర్ణయించి వారికందించే ఆహారంలో మంచి పోషకాలు ఉండేలా చూస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆహారాన్ని తయారు చేయడంతోపాటు సిబ్బంది మాస్కులు, ఫేస్‌గార్డులు ధరించి భోజనాలను ప్యాకింగ్‌ చేస్తున్నారు. కొవిడ్‌ బాధితుల ఇంటికే ఆహారాన్ని చేరవేసేందుకు ఆలయ ట్రస్టు ప్రత్యేకంగా రెండు కార్లు, రెండు ఆటోలు వినియోగిస్తున్నది.

జీహెచ్‌ఎంసీ అధికారులు, వైద్య సిబ్బందికి కూడా..

కరోనా టీకాలు వేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటున్న వైద్య సిబ్బంది, పారిశుధ్యం, చెత్త తరలింపు ఇతర సేవల్లో పాల్గొనే బల్దియా సిబ్బందికి కూడా నిత్యం ఆహారాన్ని పంపిస్తున్నారు. రోజుకు 100 మంది చొప్పున సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలో సిబ్బందికి ఆహారం అందిస్తున్నారు.

ఆహారం కోసం ఇబ్బంది పడకుండా..

కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉంటూ ఆహారం తయారు చేసుకోలేని వారికి ఈ ఉచిత భోజనం అందిస్తున్నాం. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కోరిక మేరకు బాధితులకు ఆహారం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం వెయ్యిమందికి ఆహారం పంపిస్తున్నాం. -బచ్చు గంగాధర్‌, చైర్మన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా..

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆహారం తయారు చేయిస్తున్నాం. డాక్టర్ల సలహా మేరకు బలవర్థకమైన ఆహారమందిస్తున్నాం. తయారీతోపాటు ప్యాకింగ్‌ విషయంలోనూ తగు జాగ్రత్తలు పాటిస్తున్నాం. డాక్టర్ల సలహాలు, సూచనలు, మందులు కూడా ఇప్పిస్తున్నాం. -నాగేశ్వర శర్మ, ప్రధాన కార్యదర్శి, ఆలయ ట్రస్టు

రాజీ లేకుండా పంపిణీ

మానవసేవే మాధవసేవగా భావించి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఆహారం అందిస్తున్నాం. మూడు పూటలా ఇంటి వద్దకే పంపిస్తున్నాం. ఆహారం క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ లేకుండా తయారు చేయిస్తున్నాం. -గుండ మల్లయ్య, అధ్యక్షుడు, సంస్థాన్‌ ట్రస్టు సలహా కమిటీ

నిత్యం ఆహారం అందించడంలోనే…

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారమందించే పనుల్లో నిమగ్నమయ్యాం. ప్యాకింగ్‌ చేయడం మొదలు, వాటిని వాహనాల్లో బాధితులకు చేర్చే వరకు విరామం లేకుండా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. -శ్యాంకుమార్‌, కోశాధికారి, ఆలయ ట్రస్టు

బాధితులకు బాబా అభయం

సేవా కార్యక్రమాలతో ఎళ్లవేలలా బాబా ఆలయం భక్తులకు అందుబాటులో ఉంటుంది. కొవిడ్‌ బాధితులకు కూడా సాయిబాబా వారి అన్నప్రసాదంతో అభయం లభిస్తోంది. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులమంతా తలమునకలై ఉన్నాం. – ఊర నర్సింహ గుప్తా, ఉపాధ్యక్షుడు, దేవాలయ ట్రస్టు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా వేళ.. అన్నార్తులకు ఆపన్నహస్తం

ట్రెండింగ్‌

Advertisement