e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home హైదరాబాద్‌ కొత్త రూపానికి చర్మనిధి

కొత్త రూపానికి చర్మనిధి

కొత్త రూపానికి చర్మనిధి
  • ఉస్మానియా దవాఖానలో స్కిన్‌ బ్యాంక్‌
  • రూ.60 లక్షల వ్యయం, ఆధునిక వసతులు
  • తెలుగు రాష్ట్రాల్లో నగరంలోనే తొలిసారి అందుబాటులోకి..
  • హెటిరో డ్రగ్స్‌, రోటరీక్లబ్‌ సాయంతో ఏర్పాటు
  • ఉచితంగా లక్షలు విలువ చేసే చర్మ మార్పిడి, ఇతర సేవలు
  • 28న ప్రారంభించనున్న హోంమంత్రి

ఖైరతాబాద్‌, జూన్‌ 24 : చర్మ మార్పిడి.. ఇది అతి ఖరీదైన వైద్యం..పైగా మనవద్ద పెద్దగా అందుబాటులో లేదు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇతర ప్రాంతాల్లో చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంతటి ఖరీదైన వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందజేసేందుకు సిద్ధమైంది. పేదల దవాఖానగా పేరొందిన ఉస్మానియాలో స్కిన్‌బ్యాంక్‌ ఏర్పాటు కాగా, ఈనెల 28న లాంఛనంగా ప్రారంభం కానుంది. రాష్ట్రంలో తొలిసారిగా స్కిన్‌ బ్యాంకు అందుబాటులోకి రానుండగా, తెలుగు రాష్ర్టాల్లో ఇదే ప్రథమం. ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్‌, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఈస్ట్‌ సహకారంతో ఈ స్కిన్‌ బ్యాంకు పురుడు పోసుకున్నది. ఉస్మానియా దవాఖాన రెండో అంతస్తు ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో రూ.60 లక్షల వ్యయంతో, సుమారు 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బ్యాంకు ఏర్పాటు చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉస్మానియా దవాఖాన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ మధుసూదన్‌ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు.

ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో..

ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల్లో స్కిన్‌ బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 28న ఉస్మానియా దవాఖానలో ప్రారంభించనున్నారు. ఈ స్కిన్‌ బ్యాంకులో ఒకసారి వలిచి సేకరించిన చర్మాన్ని ఐదేండ్లపాటు నిల్వ ఉంచవచ్చు. విదేశాల్లో మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో భద్రపరుస్తారు. ఉస్మానియా దవాఖానలో ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఈ స్కిన్‌ బ్యాంకులో కేవలం 4 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయవచ్చు.

చర్మ సేకరణ ఎలా..

- Advertisement -

వివిధ కారాణాల వల్ల చర్మాన్ని కోల్పోయిన వారు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ముంబై, చెన్నై లాంటి నగరాల నుంచి చర్మాన్ని కొనుగోలు చేసి చికిత్స తీసుకుంటున్నారు. బ్రెయిన్‌డెడ్‌ అయినవారితోపాటు సాధారణ మరణం సంభవించిన వారి నుంచి చర్మాన్ని సేకరించవచ్చు. కాళ్లు, చేతులు, వీపు తదితర భాగాల నుంచి చర్మాన్ని తీసుకుంటారు. అది పాడుకాకుండా ప్రత్యేకంగా గ్లిసరాల్‌తోపాటు ఇతర రసాయనాలను వినియోగిస్తారు. తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన కోల్డ్‌ స్టోరేజీ, ఇంక్యూబేటర్లలో భద్రపరుస్తారు. కాలిన గాయాలైన వారికి వారం రోజల్లో ఈ చర్మాన్ని గ్రాఫ్టింగ్‌ చేసి చికిత్స అందిస్తే ఆ పుండు మానిపోయి కొద్దిరోజుల్లో యథాస్థితికి వస్తుంది. మూడువారాల తర్వాత ప్రస్తుతం అతికించిన చర్మం ఊడిపోయి దాని స్థానంలో కొత్తది పుట్టుకువస్తుంది.

కాలిన గాయాల రోగులకు కొత్త జీవితం

అగ్నిప్రమాదాలు, పరిశ్రమల్లో కాలిన గాయాలతో వచ్చేవారికి ఉస్మానియాలో ప్రత్యేకంగా బర్నింగ్‌ వార్డు ఉన్నది. 50 శాతం కంటే ఎక్కువ గాయాలైతే ప్రాణాలు దక్కడం కష్టతరమే. ఫ్లూయిడ్స్‌, ప్రొటీన్‌ లాస్‌తోపాటు శరీరం సెప్టిక్‌ అవుతుంది. అయితే రెండు, మూడు డిగ్రీల్లో చర్మం కాలినా, 50 శాతం పైగా గాయాలైనా స్కిన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ (వైద్య పరిభాషలో అల్లో గ్రాఫ్టింగ్‌) ద్వారా రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

28న హోంమంత్రిచే ప్రారంభోత్సవం

హెటిరో డ్రగ్స్‌ లిమిటెడ్‌, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఈస్ట్‌ సహకారంతో ఉస్మానియా దవాఖానలో ఏర్పాటు చేసిన ఈ స్కిన్‌ బ్యాంకును ఈనెల 28న హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, హెటిరో డ్రగ్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ బీ. పార్థసారథిరెడ్డి, రోటరీ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌-3150 గవర్నర్‌ ఎన్వీ హన్మంతరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీతో కలిసి ప్రారంభించనున్నారు.

ఖరీదైన చికిత్స ఉచితమే

స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ ద్వారా 50 శాతానికి పైగా కాలిన గాయాలున్నా వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దవచ్చు. నిత్యం డ్రెస్సింగ్‌ చేసే పరిస్థితులు ఉండవు. ఇతర అవయవాల మాదిరిగానే జీవన్‌దాన్‌లో చర్మ సేకరణ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్లాస్టిక్‌ సర్జరీ సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నాగప్రసాద్‌ ఆలోచనతోనే ఈ స్కిన్‌ బ్యాంకు అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం బర్నింగ్‌ వార్డులో 50 ఐసీయూ పడకలు ఉన్నాయి. తగిన వైద్య నిపుణులు ఉన్నారు. స్కిన్‌ బ్యాంకును సమర్థవంతంగా నిర్వహించే వనరులు ఉన్నాయి. -డాక్టర్‌ మధుసూదన్‌, ప్లాస్టిక్‌ సర్జన్‌, ఉస్మానియా దవాఖాన

ఏడాదిన్నర కిందటే ఆలోచన

స్కిన్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఏడాదిన్నర కిందటే వచ్చింది. అది ఆచరణలోకి తీసుకొచ్చేందుకు హెటిరో డ్రగ్స్‌ ఆర్థిక సాయం ఎంతో దోహదపడింది. ఉస్మానియా దవాఖానలో అన్ని ఆధునిక హంగులతో ఈ స్కిన్‌ బ్యాంకును ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ర్టాల్లో తొలిసారి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉంది. – వైవీ గిరి, అధ్యక్షుడు, రోటరీక్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఈస్ట్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొత్త రూపానికి చర్మనిధి
కొత్త రూపానికి చర్మనిధి
కొత్త రూపానికి చర్మనిధి

ట్రెండింగ్‌

Advertisement