బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 26, 2020 , 00:31:02

‘శేరిలింగంపల్లి’కి సింగూరు జలాలు

‘శేరిలింగంపల్లి’కి సింగూరు జలాలు

మియాపూర్‌: శేరిలింగంపల్లి  నియోజకవర్గానికి నిరాటంకంగా తాగునీటి సరఫరాకు ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చింది. నియోజకవర్గంలోని తాగునీటి అవసరాలను ఎమ్మెల్యే గాంధీ  గురువారం సీఎంతో జరిగిన సమావేశంలో ప్రస్తావించగా....తక్షణ స్పంద న లభించింది. ఆయన వినతితో తక్షణమే నియోజకవర్గానికి సింగూరు జలాలను తాగునీటి అవసరాలకు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికే గోదావరి జలాలు నియోజకవర్గవ్యాప్తంగా తాగునీటి అవసరాలకు సరఫరా అవుతున్నప్పటికీ...రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన శేరిలింగంపల్లి నానాటికీ విస్తరిస్తుండటంతో ప్రజల దాహార్తిని  తీర్చేందుకు అదనపు జలాలు అవసరం అయ్యాయి.ఈ అవసరాన్ని అప్పటికే గుర్తించి, జలమండలి శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి డివిజన్‌ల అధికారుల ద్వారా సాంకేతికంగా వివరాలను పక్కాగా సేకరించిన ఎమ్మెల్యే సకాలం లో సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదనపు జలాల అవసరాన్ని తక్షణ ప్రాధాన్యతగా భావించిన సీఎం కేసీఆర్‌ తక్షణమే సింగూరు జలాలను సరఫరా చేస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఈ హామీ నేపథ్యంలో ఇప్పటికే జలమండలి ప్రధాన కార్యాలయం నుంచి ఇక్కడి శేరిలింగంపల్లి జలమండలి డివిజన్‌ అధికారులతో శుక్రవారం పలు దఫాలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగాయి. వీలైనంత త్వరగా అధికారిక అనుమతులు పూర్తి చేసుకుని నియోజకవర్గ ప్రజలకు సింగూరు జలాలు సరఫరా అయ్యే అవకాశం ఉన్నది. తమ వినతితో తక్షణమే స్పందించి నియోజకవర్గానికి సింగూరు జలాలను సరఫరా చేస్తామని సీఎం హామీ పట్ల నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


logo