గురువారం 28 మే 2020
Hyderabad - May 24, 2020 , 01:12:11

వాణిజ్య సంస్థలకు సిల్ట్‌ చాంబర్లు తప్పనిసరి..

వాణిజ్య సంస్థలకు సిల్ట్‌ చాంబర్లు తప్పనిసరి..

హైదరాబాద్  :  రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఏ మాత్రం చెడు వాసన వచ్చినా జేబులోంచి రుమాలు తీసుకుని ముక్కుకు అడ్డంగా పెట్టుకుంటాం.  మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయని జలమండలిని నిందిస్తుంటాం.. అయితే  కొందరు వ్యాపారస్తులు (కమర్షియల్‌ ఆపరేషన్‌ చేసే వారు) నిబంధనలను ఉల్లంఘించి ఘన వ్యర్థాలను మురుగు కాల్వల్లో పడేస్తున్నారు.  ముక్కుపుటలదిరే దుర్వాసనతో దుష్పరిణామాలు ఉద్భవిస్తున్నాయి..

వీళ్ల నుంచే అసలు సమస్య..

 జలమండలి పరిధిలోని మల్టీస్టోరేజ్‌ కనెక్షన్‌ తీసుకున్న వారంతా కమర్షియల్‌ ఆపరేషన్స్‌ (ఎంఎస్‌బీ) కిందకు వస్తారు.. హోటల్స్‌ ,లాడ్జి, మెస్‌లు, టిఫిన్‌ సెంటర్లు, ఫంక్షన్‌హాల్స్‌, సినిమాహాళ్లు, దవాఖానలు, పరిశ్రమలు, డెయిరీ ఫాంలు, ఇతర వాణిజ్య సంస్థల నిర్వాహకులు సీవరేజీ నిర్వహణలో నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.  కానీ కొందరి నిర్లక్ష్యం కారణంగా మ్యాన్‌హోళ్లలో ఘన వ్యర్థాలు (సాలిడ్‌వేస్ట్‌) వచ్చి చేరుతున్నాయి. ఫలితంగా పైపులైన్‌ డ్యామేజ్‌ కావడమే కాదు తరుచూ డ్రైనేజీ ఓవర్‌ ఫ్లోసమస్య తలెత్తుతున్నది. అంతేకాదు డ్రైనేజీ పైపులైన్‌లో ఘనవ్యర్థాలు ఒకే చోట గట్టిపడి పైపులైన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. లిక్విడ్‌ గ్యాస్‌ కంటే ఘన వ్యర్థాల నుంచి వెలువడే గ్యాస్‌ ప్రమాదకరంగా మారుతుంది.  

పూడికతీతలో బయటపడుతున్న వ్యర్థాలు  

 కొబ్బరి బోండాలు, గ్లూకోజ్‌ డబ్బాలు, గంటెలు, స్పూన్లు, చట్నీ గిన్నెలు, ఇసుక,   చిన్న చిన్న బండరాళ్లు, కాటన్‌ ముద్దలు, చికెన్‌, మటన్‌ బొక్కలు,  అన్నం పొట్లాల ప్యాకెట్లు, ప్లాస్టిక్‌ డబ్బాలు, కండోమ్‌ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి.  డ్రైనేజీ ఓవర్‌ఫ్లో సమస్య తరుచూ ఉత్పన్నమయ్యేందుకు హాస్టళ్లు, హోటళ్లు, మెస్‌లు, దవాఖానలు వదిలే ఆహార బయాలాజికల్‌ వ్యర్థాలే కారణమని అధికారులు తేల్చారు.

  సిల్ట్‌ చాంబర్లు లేకుంటే జరిమానాలే..

   గ్రేటర్‌లోని వ్యర్థాలను పైపులైన్లలోకి వదిలి తరుచూ డ్రైనేజీ పొంగిపొర్లేందుకు కారణమవుతున్న సంస్థలపై జలమండలి చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా సిల్ట్‌ చాంబర్లు (వ్యర్థాలు పైపులైన్లలోకి వెళ్లకుండా ఆపే జాలీలు)  ఏర్పాటు తప్పనిసరి అని సూచించారు. ఆయా సంస్థలు తమకు ఇచ్చిన గడువులోగా సిల్ట్‌ చాంబర్లను నిర్మించుకోవాల్సి ఉంటుందని, లేదంటే ఒక్కో సంస్థపై రూ. వెయ్యి చొప్పున, ఆపైన రోజుకు రూ. వంద వరకు జరిమానా విధిస్తామని నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. 

ఏం చేయాలి ? 

డ్రైనేజీ పైపులైన్లలో ఇష్టానుసారంగా వ్యర్థాలను, చెత్తను వేయడం.. మిగిలిపోయిన ఆహార పదార్థాలను డ్రైనేజీ పైపులైన్లలో వేస్తుండడంతో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు పొంగిపొర్లుతుందని తేల్చారు. ఈ సమయంలో హోటళ్లు, హాస్టళ్లు, మెస్‌లు, దవాఖానలు, డెయిరీ ఫాంలు, ఫంక్షన్‌హాళ్ల, ఇతర వాణిజ్య సంస్థలు సిల్ట్‌ చాంబర్లు ఏర్పాటు చేసుకోవాలి. గతంలో మాదిరిగానే భారీ జరిమానాలు, నోటీసులు పరంపర కొనసాగించాలి. ఒక అడుగు ముందుకేసి విదేశాల అమలు తరహాలో నిబంధనలను పాటించని వారి సీవరేజీ కనెక్షన్‌ను తొలగించేలా చర్యలు చేపట్టాలి. logo