సోమవారం 13 జూలై 2020
Hyderabad - May 29, 2020 , 05:09:38

కరోనా వైరస్ నిద్రాణస్థితిలోకి జారి సైలెంట్‌ కిల్లర్‌గా..

కరోనా వైరస్ నిద్రాణస్థితిలోకి జారి సైలెంట్‌ కిల్లర్‌గా..

హైదరాబాద్ : కరోనా వైరస్‌ సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్నది. ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే కరోనా తన ప్రభావాన్ని చూపిస్తున్నది. గత కొన్ని రోజులుగా నగరంలో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే కరోనా మహమ్మారి చాపకింద నీరులా నలువైపులా విస్తరిస్తున్నదనే విషయం స్పష్టమవుతోంది. లక్షణాలు లేని వారికి సైతం పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ రావడం వైద్యులను కొంత విస్మయానికి గురిచేస్తున్నది.   కొన్ని కేసుల్లో రోగి మృతిచెందే వరకు పాజిటివ్‌ ఉన్నట్లు తెలియడం లేదని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.    అమెరికా, చైనా తదితర దేశాల్లో ఈ తరహా కేసుల గురించి మొన్నటి వరకు మనం విన్నాం. కానీ.. ఇప్పుడు ఆ తరహా కేసులు గ్రేటర్‌లోనే నమోదుకావడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మరికొన్ని కేసుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ లక్షణాలను ఏమాత్రం కరోనా లక్షణాలుగా భావించే అనుమానం రాకపోవడం,కనిపించని లక్షణాలతో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు రకాల కేసులు ప్రమాదకరం కానప్పటికీ వీటి వల్ల వైరస్‌ వ్యాప్తి మాత్రం భయంకరంగా ఉంటుందని నమోదవుతున్న కేసుల ద్వారా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే జియాగూడ, ధూల్‌పేట, మంగళ్‌హాట్‌, మాదన్నపేట, వనస్థలిపురం, రంగారెడ్డి జిల్లా పరిధిలోని పహడీషరీఫ్‌, శంకర్‌పల్లి, షాద్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇక్కడి కేసుల్లో చాలా మందికి లక్షణాలు కనిపించలేదు.  పరీక్షల ద్వారానే వారికి పాజిటివ్‌ అని తేలినట్లు వైద్యులు తెలిపారు.

తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్‌నగర్‌లో నమోదైన ఎనిమిది కేసుల్లో ఏ ఒక్కరికీ పాజిటివ్‌ లక్షణాలు కనిపించలేదు.   పది రోజుల కిందట షాద్‌నగర్‌కు చెందిన దంపతులతో పాటు ఒక ఆస్తమా బాధితుడు జియాగూడలో జరిగిన వారి బంధువు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియలకు హాజరైన వారిలో ఎవరికీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కానీ ఆస్తమా బాధితుడికి మాత్రం కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతడితో కలిసి వెళ్లిన దంపతులకు పరీక్షలు చేయగా.. వారికి కూడా పాజిటివ్‌ అని తేలింది. వీరికి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న మొత్తం 25 మందికి పరీక్షలు చేయగా వారిలో ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఏ ఒక్కరికి కూడా కరోనా లక్షణాలు కనిపించలేదు. వీరు యథేచ్ఛగా అందరితో కలియతిరిగారు. 

నిద్రాణస్థితిలో వైరస్‌.. ? 

ఇదిలా ఉండగా.. కొవిడ్‌-19 వైరస్‌ నిద్రాణ స్థితిలోకి వెళ్లింది.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే జరిగితే వైరస్‌   ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్లేనని వైద్యనిపుణులు భావిస్తున్నారు. ఎసింప్టమాటిక్‌ కేసుల్లో వైరల్‌ లోడ్‌ తక్కువగా ఉన్నప్పటికీ వ్యాప్తి చెందించే స్వభావం మాత్రం అధికంగానే ఉంటుందనీ, ఇది రోగి శరీర ధర్మం ఆధారంగా వైరస్‌ తీవ్రత హెచ్చుతగ్గులపై ఆధారపడుతుందని వైద్యులు చెబుతున్నారు. నిద్రాణ స్థితిలోకి వెళ్లడం వల్ల సామాజిక వ్యాప్తి పెరిగే అవకాశాలు లేకపోలేదనీ,   వైరస్‌ ఉన్న వ్యక్తికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో సదరు రోగి తనకు తెలియకుండానే తన కుటుంబ సభ్యులతో పాటు ఇతరులకు వైరస్‌ను వ్యాప్తిచేసే ప్రమాదమున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

25శాతం లక్షణాలు లేకుండానే ..

 ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 25 శాతం  ఎసింప్టమాటిక్‌ కేసులే. అంటే ఈ రోగుల్లో వైరస్‌కు సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీంతో వీరు వారికి తెలియకుండానే ఇతరులకు వైరస్‌ను వ్యాప్తి చేస్తారు. మరో 55 శాతం కేసుల్లో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. అదికూడా సాధారణ జలుబు, దగ్గు, జ్వరంలా ఉంటుంది. వీరు కూడా వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యే అవకాశాలున్నాయి. అయితే ఎసింప్టమాటిక్‌ కేసుల్లో వైరల్‌లోడ్‌ తక్కువ. రోగులకు పెద్ద ప్రమాదం ఉండదు. కానీ, వారి ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం అధికంగా ఉంది.-డా. పరంజ్యోతి (పల్మనాలజీ విభాగం అధిపతి, నిమ్స్‌ దవాఖాన)logo