మంగళవారం 11 ఆగస్టు 2020
Hyderabad - Jul 13, 2020 , 00:28:15

ఆత్మైస్థెర్యమే.. ఆయుధమై...

ఆత్మైస్థెర్యమే.. ఆయుధమై...

కొండంత ధైర్యంతో మహమ్మారిని జయించిన తల్లీకొడుకులు 

తొలుత కుమారులకు  పాజిటివ్‌.. ఆ తర్వాత తల్లికి...

బంధువులు, స్నేహితుల భరోసాతో రెట్టింపైన మనోనిబ్బరం

చికిత్స పొంది.. క్షేమంగా ఇంటికొచ్చిన కుటుంబం

 బిడ్డ కొంత అలసటగా కనిపిస్తేనే.. తల్లి తట్టుకోలేదు. ఏమైందోనని తల్లడిల్లుతుంది. అది అమ్మ మనసు. అలాంటిది బిడ్డలిద్దరికీ కరోనా వచ్చిందంటే.. ఆ తల్లి హృదయం బరువెక్కక ఉంటుందా?  తన బిడ్డలను ఆ మహమ్మారి బారి నుంచి కాపాడుకోవడం ఓ సవాల్‌ అయితే.. తనను కబలించాలని చూసిన వైరస్‌ను జయించడం ఇంకో సవాల్‌. కాచిగూడకు చెందిన ఓ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులకు పాజిటివ్‌ వచ్చింది. తనకు ఏమైనా పరవాలేదు. కానీ బిడ్డలు క్షేమంగా బయటపడాలనే ఆశ తల్లిది. మాకు ఏమైనా.. పరవాలేదు...అమ్మ క్షేమంగా బయటపడాలనే ఆకాంక్ష కొడుకులది. తల్లి సంపత్‌బాయి కొఠారి, కొడుకులు మనోజ్‌ కొఠారి, అనిల్‌ కొఠారిల ప్రేమ, ధైర్యం ముందు విధి తలవంచింది. కంటికి కనిపించని వైరస్‌ అంతమైంది.  ఇలా కొవిడ్‌ నుంచి కోలుకున్న వీరు ‘నమస్తేతెలంగాణ’తో తమ   అనుభవాన్ని  పంచుకున్నారు. ‘భయమే సగం చంపుతుంది...ధైర్యం ప్రాణం పోస్తుంది’ అని చెప్పారు.  -సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ

ఇంకా ఏమన్నారో వారి  మాటల్లోనే...

జ్వరం తగ్గలేదు.. టెస్ట్‌ చేయించుకున్నాం..

నాపేరు మనోజ్‌ కొఠారి. మాది జాయింట్‌ ఫ్యామిలీ. 12 మంది ఉంటాం. కాచిగూడలో మాకు ఆటోమొబైల్స్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఉంది. రోజూ ఆఫీసులో కస్టమర్లతో మాట్లాడటం.. తదితర కార్యకలాపాలు ఉంటాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నాం. కానీ జూన్‌ 11న కొంత జ్వరంగా అనిపించింది. కుటుంబ సభ్యులకు చెప్పాను. నేను ప్రత్యేకమైన గదిలో ఉన్నాను. తమ్ముడికి కూడా కొంత జ్వరంగా ఉందని చెప్పాడు.  19న కరోనా టెస్ట్‌ చేయించుకున్నాం. ఇద్దరికీ పాజిటివ్‌ అని తేలింది. ఆ సమయంలో మాకు చాలా భయం వేసింది. మా కుటుంబసభ్యులకు వస్తుందేమోనని భయపడ్డాం. విషయం ఇంట్లో చెప్పి వెంటనే సోమాజిగూడలోని ఓ వైద్యశాలలో అడ్మిట్‌ అయ్యాము. మూడు రోజుల తర్వాత అమ్మ కొంత జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని తెలిసింది. ఆలస్యం చేయకుండా ఆమెకు పరీక్షలు చేయించడంతో పాజిటివ్‌ వచ్చింది. ఆమెను కూడా మేం ఉంటున్న ఆస్పత్రిలోనే అడ్మిట్‌ చేయించాం. ఒకే సమయంలో ముగ్గురికి రావడం మా కుటుంబాన్ని చాలా బాధించింది. 

ధైర్యమే విరుగుడు..

బంధువులు, స్నేహితులు ఇచ్చిన మనోధైర్యమే మమ్మల్ని కాపాడింది. ‘మీకేం కాదు..మేమున్నాం’ అంటూ.. వారు భరోసానివ్వడం కొండంత బలం ఇచ్చింది. వైద్యులు మంచి చికిత్స అందించారు. వేడినీళ్లు, పారాసెటమల్‌, మల్టీవిటమిన్‌, సీ విటమిన్‌,  జింక్‌ మాత్రలు తీసుకున్నాం. వేడివేడి ఆహారం తిన్నాం. కషాయం కూడా తాగాం. నాకు, అమ్మకు షుగర్‌ ఉంది. ఇందుకు సంబంధించిన చికిత్స వైద్యులు అందించారు. 28న వైద్యులు మళ్లీ కరోనా టెస్ట్‌ చేశారు. నెగెటివ్‌ అని తేలింది. రెండు రోజుల తర్వాత తమ్ముడు, అమ్మకు నెగెటివ్‌ అని వచ్చింది. డిశ్చార్జ్‌ అయ్యాము. ఇంటికి తిరిగొచ్చాం. 

ప్రభుత్వ దవాఖానలే బెస్ట్‌..

మేము ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాం. కానీ సర్కారు దవాఖానలే బెస్ట్‌ అని చెప్పగలం. మేము వైద్యశాలలో చేరే ముందు  ప్రభుత్వ దవాఖానలోఎలాంటి చికిత్స అందిస్తారోనని ఆరా తీశాం. ప్రైవేటు, సర్కారు వైద్యశాలల్లో చికిత్స అందించడంలో పెద్దగా తేడా అనిపించలేదు. అనవసరంగా భయపడి లక్షలు ఖర్చు పెట్టుకోకండి. భయపడాల్సినవసరం లేదు. ఇంటికొచ్చాక 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నాం.

        - మనోజ్‌ కొఠారి

అప్రమత్తంగా ఉన్నాం..

ఇంట్లో ముగ్గురం ప్రత్యేక గదుల్లో ఉన్నాం. మా దుస్తులు మేమే ఉతుక్కున్నాం. కుటుంబ సభ్యులు మాకు ఆహారాన్ని అందించే సమయంలో వారు పీపీఈ కిట్లు ధరించి అందించేవాళ్లు. వారు కింద పెట్టేసి వెళ్తే తీసుకునేవాన్ని. ముందే జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనిపించేది. భౌతికదూరం తప్పనిసరిగా పాటిస్తున్నా.  మాస్కు ధరిస్తున్నా. ఆఫీసు పనులకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను.కరెన్సీ శానిటైజ్‌ చేసే యంత్రాలను ఉపయోగించాలనుకుంటున్నాం. 

- అనిల్‌ కొఠారి

 క్షేమంగా..

నా బిడ్డలిద్దరికీ కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలియగానే నోట మాట రాలేదు. కాళ్ల కింద భూమి కంపించినట్టుగా అనిపించింది. చాలా ఏడ్చాను. వాళ్లు క్షేమంగా బయటపడాలని ఆ భగవంతుడిని ప్రార్థించాను. మూడు రోజులకే నాకు పాజిటివ్‌ అని తేలింది. ఆస్పత్రిలో చేరాను. నా ధ్యాసంతా బిడ్డలపైనే. ఏం జరుగుతుందో తెలియని భయానక దుస్థితి అది. కరోనా వస్తే భయపడాల్సినవసరం లేదు. 

          -సంపత్‌బాయి కొఠారిlogo