బుధవారం 20 జనవరి 2021
Hyderabad - Aug 03, 2020 , 00:44:10

మనోధైర్యమే.. కొండంత బలమై...

మనోధైర్యమే.. కొండంత బలమై...

కరోనా బారినపడిన పోలీసులు 

సడలని ఆత్మవిశ్వాసంతో వైరస్‌పై పోరాటం 

వైద్యుల సూచనలు పాటిస్తూ.. కొవిడ్‌పై విజయం 

కరోనా కట్టడికి అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకూ వైరస్‌ సోకుతున్నది. అలా ముగ్గురు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చింది. విషయం తెలియగానే  వారు భయంతో కుంగిపోలేదు కదా...ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకున్నారు.  వైద్యుల సూచనలు చక్కగా పాటించి... తొందరగానే మహమ్మారిని జయించారు. కొవిడ్‌ వస్తే ఎవరూ భయపడవద్దని, మనోధైర్యానికి మించిన మందులేదని చెబుతున్న వీరు.. ‘నమస్తేతెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ అనుభవాలను పంచుకున్నారు. ఏ విధంగా  కోలుకున్నారో చెప్పారు. అవేమింటో వారి మాటల్లోనే తెలుసుకుందాం..      -కంటోన్మెంట్‌ 

భయపడవద్దు...

పాజిటివ్‌ అనగానే ఒక్కసారిగా భయమేసింది. దీంతో బీపీ కూడా పెరిగింది. క్వారంటైన్‌లో డాక్టర్లు ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పారు. మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. వారు చెప్పినట్లు చేశా. కొన్ని రోజులకు కోలుకొని ఇంటికి వచ్చా.   కరోనా నుంచి ఇంత త్వరగా కోలుకోవడానికి కారణం..మనోధైర్యమేనని నమ్ముతున్నా. మనోధైర్యాన్ని మించిన వైద్యం లేదు. కరోనా వచ్చిందని ఎవరూ భయపడవద్దు.                  - ఆరేపల్లి ఫీబా డేవిడ్‌, మహిళా కానిస్టేబుల్‌

కుంగిపోకండి..

నాకు పాజిటివ్‌ అని తెలిసిన వెంటనే భయపడలేదు. నేనే స్వయంగా వైద్య సిబ్బందికి విషయం చెప్పడంతో వారు  హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు.  మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వైద్యుల సలహాలు పాటించి..  త్వరగా కోలుకున్నా. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. పాజిటివ్‌ వ్యక్తులు ఎవరూ భయంతో కుంగిపోవాల్సిన అవసరం లేదు.  

                           - యు. సురేశ్‌రాజ్‌, కానిస్టేబుల్‌

నిత్యం ధ్యానం...

దగ్గు, జ్వరం ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నా..పాజిటివ్‌ అని రిపోర్టు వచ్చింది. తొలుత కంగారు పడ్డా. వైద్యులు సూచించిన మేరకు హోం ఐసొలేషన్‌లో ఉంటూ..తగిన జాగ్రత్తలు పాటించాను.  మొదట్లో ఏమవుతుందోనని నాతో పాటు నా కుటుంబసభ్యులు భయపడ్డారు. పౌష్టికాహారం తీసుకుంటూ.. రోజూ ఉదయం, సాయంత్రం ధ్యానం చేయడం వల్ల కరోనా నుంచి ఎనిమిది రోజులకే కోలుకున్నాను.  ధ్యానం చేయడంతో మనసు ప్రశాంతంగా ఉండేది. అందుకే త్వరగా కోలుకోగలిగాను.                                                      - కె. ప్రియాంక, మహిళా కానిస్టేబుల్‌


logo