ఆదివారం 07 మార్చి 2021
Hyderabad - Jan 23, 2021 , 04:43:27

ట్రేడ్‌ లైసెన్స్‌ ఇక తప్పనిసరి

ట్రేడ్‌ లైసెన్స్‌ ఇక తప్పనిసరి

కంటోన్మెంట్‌, జనవరి 22:  చట్టబద్ధంగా ఏ వ్యాపారం నిర్వహించాలన్న ట్రేడ్‌లైసెన్స్‌ తప్పనిసరి. ప్రతియేటా క్రమం తప్పకుండా వ్యాపార లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేసుకోవాలి. కానీ, కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో అనేకమంది వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకుని, తిరిగి రెన్యూవల్‌ చేయించుకోకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. బోర్డుకు ప్రతియేటా ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజును చెల్లించకుండా ఎగనామం పెడుతున్నారు. కొన్నేండ్లుగా లైసెన్స్‌ ఫీజు బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోయిఉన్నాయి. ప్రస్తుతం వీటి వసూళ్లపై కంటోన్మెంట్‌ బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ట్రెడ్‌ లైసెన్స్‌ తీసుకునే వారికి గడువు ఇవ్వాలని, గడువు ఇచ్చినా కట్టని వారిపై కఠినంగా వ్యవహరించి, లైసెన్స్‌ రద్దు చేయాలని బోర్డు అధికారులకు పలు మార్లు సూచించారు.  

బోర్డు పరిధిలో 4వేలకుపైగా  దుకాణాలు..

కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో ఎనిమిది వార్డులుండగా.. ఆయా వార్డులో 4,100పైగానే వ్యాపార సముదాయాలున్నట్లు బోర్డు అధికారులు గుర్తించారు. అత్యధికంగా తిరుమలగిరి, కార్ఖానా, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, ఆర్టీసీకాలనీ, విక్రంపురి, రసూల్‌పురా, డైమండ్‌ పాయింట్‌తో పాటు పలు ప్రాంతాల్లో వాణిజ్య, వర్తక సముదాయాలున్నాయి. ఇందులో కేవలం వెయ్యి వరకు మాత్రమే ట్రేడ్‌ లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేయించుకుంటున్నారు. మరికొందరైతే అసలు ట్రేడ్‌లైసెన్స్‌ తీసుకోకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

రెన్యూవల్‌లో నిర్లక్ష్యం..

ట్రేడ్‌ లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేయించుకోవడంలో వ్యాపారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు దశాబ్దకాలంగా లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసుకోక వ్యాపారాలు చేస్తున్నారు.  రాజకీయ నాయకులు కొందరు వ్యాపారులకు మద్దతుగా నిలుస్తూ ..వారిని ఇబ్బందులకు గురిచేయవద్దంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఎవరు చెప్పినా ట్రేడ్‌ లైసెన్స్‌ విషయంలో అలసత్వం వహించవద్దని, కచ్చితంగా లైసెన్స్‌, రెన్యూవల్‌ చేసుకునేలా చర్యలు చేపట్టాలని బోర్డు  సీఈఓ అజిత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసే గడువుకు ఒకనెల ముందుగానే రెన్యూవల్‌ చేసుకోవాలి. కానీ, వ్యాపారస్తులు బోర్డు  అధికారుల ఉత్తర్వులను బేఖాతారు చేస్తున్నారు. బోర్డు అధికారులు దుకాణాలను తనిఖీ చేస్తున్న సమయంలోనే లైసెన్స్‌ ఫీజు చెల్లిస్తున్నారు.

రూ.అరకోటికిపైగా  బకాయిలు..

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు బకాయిలు రూ.అరకోటికి పైగా పేరుకుపోయాయి. కొన్నేండ్ల్ల నుంచి సరిగ్గా ఫీజు వసూలు చేయడం లేదు. 15 రోజులుగా వ్యాపారులను బోర్డు అధికారులు నిత్యం  ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకోవాలని, లేదంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.  దీంతో కొందరిలో కదలిక రాగా.. మరికొందరు ఎప్పటిలాగే నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.   కఠినంగా వ్యవహరిస్తేనే ఫలితాలొస్తాయని అధికారులంటున్నారు.

ట్రేడ్‌ లైసెన్స్‌ను తీసుకుని వ్యాపారాలు చేసుకోవాలి..

ట్రైడ్‌ లైసెన్స్‌లు లేకుండా వ్యాపారాలు చేయడం మంచిదికాదు.  ప్రతిఒక్కరూ ట్రేడ్‌ లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేసుకోవాలి. గత పదిహేను రోజులుగా  వ్యాపారులకు సమాచారం చేరవేస్తున్నాం. ఇప్పటికే ఓమారు ఇచ్చిన గడువు పూర్తయ్యింది.  బోర్డు పరిధిలో 4,100 ట్రేడ్‌లైసెన్స్‌ దుకాణాలుండగా,  కేవలం 1,000 లోపు మాత్రమే లైసెన్స్‌లను రెన్యూవల్‌ చేసుకుంటున్నారు. హెచ్చరికలు పెడచెవిన పెడితే కఠినంగా వ్యవహరిస్తాం.  వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  - దేవేందర్‌, పారిశుధ్య ఉన్నతాధికారి, కంటోన్మెంట్‌

VIDEOS

logo