e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home హైదరాబాద్‌ కేంద్ర ప్రభుత్వం బాకీ రూ.650కోట్లు

కేంద్ర ప్రభుత్వం బాకీ రూ.650కోట్లు

  • రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నెట్టుకొస్తున్న బోర్డు
  • కంటోన్మెంట్‌పై.. కేంద్ర ప్రభుత్వంశీతకన్ను
  • విన్నపాలు వినరు.. బకాయిలు చెల్లించరు.!
  • సహకరించాల్సిన సమయంలో చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
  • బోర్డుకు రావాల్సిన బకాయిలు రూ.650కోట్లు
  • కనీసం రూ.100 కోట్లు అయినా చెల్లించాలని కోరినా.. స్పందన కరువు
  • నిధులు లేక అగమ్యగోచరంగా బోర్డు పరిస్థితి
  • ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించలేని దుస్థితి
  • చొరవ చూపని బోర్డు అధికారులు

దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్‌ బోర్డుగా ఉన్న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌పై కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. కేంద్రం ఆధీనంలో ఉండే బోర్డుకు అన్ని విధాలుగా సహకరించాల్సిన సమయంలో చేతులెత్తేస్తుండటంతో అభివృద్ధిలో పోటీపడలేక బోర్డు చతికలపడుతున్నది. బోర్డు పరిధిలోని ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, మిలటరీ స్థావరాలు, కార్యాలయాల నుంచి బోర్డుకు రావాల్సిన సర్వీస్‌ చార్జీలను చెల్లించడం లేదు.

సర్వీస్‌ చార్జీల రూపేణా కేంద్ర ప్రభుత్వం నుంచి బోర్డుకు సుమారు రూ.650 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. కనీసం వీటిలో రూ.100 కోట్లు అయినా చెల్లించాలని కేంద్రం ముందు బోర్డు సభ్యులు ఎన్నిసార్లు విన్నవించినా కనీసం కనికరించక పోవడం గమనార్హం. ఇప్పటికే నిధులులేక బోర్డు పరిస్థితి అగమ్యగోచరంగా తయారవ్వగా.., కనీసం బోర్డు ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోకపోతుండటం విశేషం. కానీ బకాయిల విషయంలో బోర్డు ఉన్నతాధికారులు చొరవ చూపకపోతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్ర సర్కారు నిధులతోనే మనుగడ

- Advertisement -

కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోయినా రాష్ట్ర సర్కారు మాత్రం బోర్డుకు దశల వారీగా నిధులను విడుదల చేస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నది. కంటోన్మెంట్‌లోని ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ట్రాన్స్‌ ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ ట్యాక్స్‌ (టీపీటీ) నిధులను రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు ఇప్పటికే పలు దఫాలలో విడుదల చేసింది. అదేవిధంగా కేంద్రం ఇచ్చే 13, 14, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో బోర్డుకు చెల్లించాల్సిన వాటాను ప్రభుత్వం ఈ మధ్యనే బోర్డు ఖాతాలో జమచేసింది.

బోర్డు ఆదాయానికి వేరే మార్గాలు లేవని ఇలాంటి గ్రాంట్లు, సర్వీస్‌ చార్జీల ద్వారానే మనుగడ సాగిస్తుందని పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడంతో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ చూపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్‌రెడ్డికి సూచించారు. ఈ క్రమంలోనే సర్కారు బకాయిలను నెల నెలా రూ.10 కోట్లు చెల్లిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా ఇప్పటికే విడతల వారీగా నిధులను బోర్డుకు విడుదల చేస్తుండటంతో బోర్డు పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

బకాయిలపై పోరు సాగిస్తాం..!

రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంది. కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలపై తప్పక నిలదీస్తాం. సుమారు రూ.650 కోట్లకు పైగా బకాయిలు ఉన్నప్పటికీ కేంద్రం చోద్యం చూస్తుంది. ఇటీవల కాలంలో బోర్డు పరిధిలో పర్యటించిన పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ బృందానికి సైతం బకాయిలపై వినతిపత్రం ఇచ్చాం. నానాటికీ కంటోన్మెంట్‌ బోర్డులో నిధులు లేక సతమతమవుతుంటే రాష్ట్ర సర్కారు ఇక్కడ సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నది.

రాష్ట్రవ్యాప్తంగా, జీహెచ్‌ఎంసీలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను కంటోన్మెంట్‌ ప్రజలకు కూడా అందించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. పికెట్‌ నాలా, హస్మత్‌పేట్‌ నాలాలు పొంగి కాలనీలు, బస్తీలను ముంపు బారిన పడకుండా చూస్తున్నాం. రామన్నకుంట చెరువు ప్రక్షాళనకు ప్రత్యేక నిధులు కేటాయించాం. ఈ విషయంలో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ చూపారు. – జక్కుల మహేశ్వర్‌ రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana