సోమవారం 21 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 00:40:06

బస్తీల్లోనే సీజనల్‌ నిర్థారణ

బస్తీల్లోనే సీజనల్‌ నిర్థారణ

అక్కడికక్కడే మందుల పంపిణీ    

చర్యలు చేపట్టిన గ్రేటర్‌ వైద్యారోగ్య శాఖ 

సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ: వరుసగా కురుస్తున్న వర్షాలతో సీజనల్‌ వ్యాధులు మొదలయ్యాయి. ప్రస్తుత కరోనా కాలంలో చిన్న జ్వరం వచ్చినా జనం జంకుతున్నారు. జలుబు, ఒంటి నొప్పులు, గొంతు గరగర.. ఇలా ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా గుండె జల్లుమంటున్నది. 80 శాతానికి పైగా లక్షణాలు లేని కరోనా రోగులు ఉండటంతో పాటు.. ఏ దవాఖానకు పోతే ఎక్కడ వైరస్‌ అంటుకుంటుందోనని నగరవాసులు వైద్యశాలలకు వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో వీడియో కాల్‌ కన్సల్టేషన్‌ పద్ధతికే జనం మొగ్గు చూపుతున్నారు.  అయితే మధ్య తరగతి జనాలకు ఇది సాధ్యం కాకపోవడంతో దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రేటర్‌లోని బస్తీ వైద్యశాలల్లో అన్ని రకాల వైద్య సేవలను అందించేందుకు సిద్ధమైంది వైద్యారోగ్య శాఖ. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు ఎక్కడివారికి అక్కడే వైద్యం అందించేందుకు రెండేండ్ల క్రితమే గ్రేటర్‌లో ప్రభుత్వం బస్తీ దవాఖానలను ప్రారంభించిన విషయం విదితమే. అయితే ఈ బస్తీ దవాఖానలు నేటి కరోనా కాలంలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 194 బస్తీ దవాఖానలు రోగులకు సేవలందిస్తున్నాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 95, మేడ్చల్‌ జిల్లా పరిధిలో 79, రంగారెడ్డి పరిధిలో ఉన్న 20 బస్తీ దవాఖానల్లో అధికారులు సేవలను విస్తృతపరిచారు. 

బస్తీ దవాఖానల్లోనే పరీక్షలు..


కరోనా నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు అంటే డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, చికున్‌గున్యా, వైరల్‌ ఫ్లూ, తదితర పరీక్షలను బస్తీ దవాఖానల్లోనే నిర్వహిస్తున్నారు. అంటే బస్తీ దవాఖానల్లో నమూనాలు సేకరించి  తెలంగాణ డయోగ్నోస్టిక్‌ సెంటర్‌లో నిర్ధారణ పరీక్షలు జరుపుతారు. అనంతరం ఫలితాలను సంబంధిత బస్తీ దవాఖానలకు చేరవేస్తారు. వచ్చిన ఫలితాల ఆధారంగా అవసరమైన చికిత్సను అక్కడే అందిస్తారు. దీంతో రోగులు సీజనల్‌ వ్యాధుల చికిత్స కోసం బస్తీలు దాటి బయటకు వెళ్లాల్సిన పనిలేదు. అంతేకాక వ్యాధులు కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రబలకుండా ఎక్కడికక్కడే కట్టడి చేయవచ్చు. పరిస్థితి విషమించి రోగికి అడ్మిషన్‌ అవసరమైతే నల్లకుంట ఫీవర్‌ దవాఖాన, ఉస్మానియా తదితర వైద్యశాలలకు రిఫర్‌ చేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటి తెలిపారు. 

ఇంటి వద్దకే  మందులు..


ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి  ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సర్వేలో ఎంత మంది జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారో గుర్తిస్తున్నారు. ఇలా గుర్తించిన వారికి సర్వే చేస్తున్న ఆశలు, ఏఎన్‌ఎంలు అక్కడికక్కడే మందులు పంపిణీ చేస్తున్నారని  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటి తెలిపారు.  మూడు రోజుల్లో జ్వరం తగ్గకపోయినా,  కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే వారికి పరీక్షలు చేయించి అవసరమైతే వైద్యశాలలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

రోగుల ఇండ్ల వద్దకే వైద్య సేవలు..

డాక్టర్‌ వెంకటి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి

కరోనా కాలంలో సీజనల్‌ వ్యాధులను ఎదుర్కోవడం కత్తిమీద సామే. కరోనా, సీజనల్‌ వ్యాధుల లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉండడంతో అటు ప్రజలకు ఇటు వైద్య సిబ్బందికి అగ్ని పరీక్షగా మారింది. సీజనల్‌ వ్యాధులు ప్రబల కుండా అవగాహన కల్పించడంతో పాటు రోగులకు మెరుగైన చికిత్స అందించేలా జిల్లా పరిధిలోని అన్ని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖానల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ముఖ్యంగా ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడే వారి వివరాలు సేకరించడమే కాకుండా వారికి అవసరమైన మందులను అక్కడికక్కడే అందిస్తున్నారు. అవసరమైన వైద్య పరీక్షలను సైతం బస్తీ దవాఖానలు, యూపీహెచ్‌సీలలోనే నిర్వహిస్తున్నాం. కరోనా అనుమానితులను గుర్తించి వారికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నాం. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు గల వారిని హోం ఐసొలేషన్‌ చేస్తున్నాం. సమస్యలు తీవ్రంగా ఉన్న వారిని గాంధీతో ఇతర దవాఖానలకు తరలిస్తున్నాం. బస్తీ దవాఖానల్లోనే సీజనల్‌కు సంబంధించిన పరీక్షలతో పాటు మందులను కూడా అందిస్తున్నాం. 


logo