భరోసాతో బడికి

అతి త్వరలో బడి గంటలు మోగనున్నాయి. ఒక వైపు విద్యాసంస్థలు, మరోవైపు తల్లిదండ్రులు, విద్యార్థులు అంతా సన్నద్ధమవుతున్నారు. పుస్తకాలు, యూనిఫాం, బ్యాగుల గలగలలు వినిపించనున్నాయి. యేటా జూన్‌లో పునఃప్రారంభం కావాల్సిన విద్యాసంస్థలు కరోనా కారణంగా ఫిబ్రవరిలో తెరుచుకోనున్నాయి. అయితే ఈసారి కొంగొత్త అనుభూతిని తీసుకురానున్నాయి. పుస్తకాలతోపాటు శానిటైజర్, మాస్కులు తప్పనిసరి కానున్నాయి. గతంలో పక్కనే కూర్చున్న తోటి విద్యార్థులంతా భౌతిక దూరం పాటించనున్నారు.
కరోనా వైరస్ 11 నెలలుగా విద్యార్థులకు చదువును దూరం చేసింది. విషజడలను విప్పుకొని విద్యాసంస్థలను మూసివేసేలా శాసించింది. 2020 విద్యాసంవత్సరాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఆన్లైన్ క్లాస్‌లతో అభ్యసించే విధానం కొంత వరకు సత్ఫలితాలిచ్చినా.. ఆ విధానాన్ని కొనసాగించే ప్రక్రియ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, యాజమాన్యాలకు కష్టంగా మారింది. తాజాగా ప్రభుత్వం విద్యాసంస్థలు తెరుచుకోవడానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో విద్యాలయాలన్నీ కొవిడ్ జాగ్రత్తలపై దృష్టి పెట్టాయి. 9, 10 తరగతుల విద్యార్థులతోపాటు కాలేజీ విద్యార్థులు మాత్రమే హాజరవ్వాల్సి ఉంటుండగా విద్యార్థుల ఆరోగ్యమే పరమావధిగా బోధన సాగించడానికి విద్యాలయాలు సిద్ధమవుతున్నాయి.
కాలేజీ కుర్రోళ్లు..
పదో తరగతి పూర్తయి.. కాలేజీలో అడుగుపెట్టాలనుకున్న విద్యార్థులకు కరోనా చేదు అనుభూతిని మిగిల్చింది. ఎప్పుడెప్పుడు కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేద్దామా అని ఎదురుచూసిన వారికి నెలల తరబడి నిరాశే ఎదురైంది. దీంతో చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ చదువులకే పరిమితమయ్యారు. ఏడాదంతా ఇంతేనా అని బోసిపోయిన విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ రావడం.. పరిస్థితులు కుదుటపడటంతో ఫిబ్రవరి నుంచి కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఏడు నెలలుగా ఆన్లైన్ చదువులు చదవలేక ఇబ్బందిపడ్డ వారికి ప్రత్యక్షంగా స్నేహితులతోపాటు పాఠాలు వినే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా జాగ్రత్తలు వారి కాలేజీ లైఫ్‌లో భాగం కానున్నాయి.
ప్రభుత్వం సూచించిన నిబంధనల్లో కొన్ని..
- దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడే వారు హాజరుకావొద్దు.
- పాఠశాల, కాలేజీలో కేవలం 70 శాతం మాత్రమే సిలబస్‌ను బోధిస్తారు. మిగిలిన 30శాతం ప్రాజెక్టు వర్క్‌గా అసైన్మెంట్ ఇస్తారు.
- విద్యాసంస్థలు వైద్యసాయం కోసం వైద్య సంస్థలతో సమన్వయం చేసుకోవాలి.
- 300కన్నా ఎక్కువ విద్యార్థులు ఉంటే రెండు షిఫ్టులు పద్ధతిని అనుసరించాలి.
- వార్షిక పరీక్షలు 70 శాతం సిలబస్‌తోనే నిర్వహిస్తారు.
- కొవిడ్ దృష్ట్యా విద్యాసంస్థల్లో కనీసం రెండు ఐసొలేషన్ గదులను ఏర్పాటు చేసుకోవాలి. వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.
కాలేజీకి హాజరుకాబోతున్నాం
పదో తరగతి పూర్తయ్యాక కాలేజీ లైఫ్‌లో అడుగుపెట్టడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కాలేజీ లైఫ్‌ను అనుభూతి చెందేలా ప్లాన్ చేసుకున్నాం. కానీ కరోనా మా ఆశలన్నింటినీ నాశనం చేసింది. ఇంటర్ రెండేండ్లలో ఒక ఏడాదిని మా నుంచి దూరం చేసింది. చాలా బాధగా ఉంది. అయితే ఫిబ్రవరి నుంచి కాలేజీలు తెరుచుకోబోతున్నాయి. కొంత సంతోషంగా ఉంది. ఆన్లైన్ కాకుండా నేరుగా హాజరై పాఠాలు వినడమే సులభంగా ఉంటుంది. - ప్రమోద్ రెడ్డి, ఇంటర్ విద్యార్థి.
కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటే పంపిస్తాం
జీవితంలో పదో తరగతి కీలకం. ఆ విద్యార్థులకు ఇన్ని నెలలు ఆన్లైన్ క్లాసులే దిక్కయ్యాయి. కరోనా పదో తరగతి విద్యార్థులకు కష్టకాలాన్ని తెచ్చింది. ప్రభుత్వం వారికి ఫిబ్రవరి నుంచి నేరుగా క్లాసులు వినే అవకాశం ఇచ్చింది. మంచి నిర్ణయం. విద్యార్థులను పంపించడానికి తల్లిదండ్రులు సిద్ధంగానే ఉన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ రావడంతో భరోసా వచ్చింది. ఏం కాదనే నమ్మకం ఏర్పడింది. విద్యా సంస్థలు కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి.- సరోజన, పేరెంట్.
తల్లిదండ్రులదే బాధ్యత..!
పిల్లలను స్కూల్, కాలేజీలకు పంపించాలా? వద్దా? అనేది తల్లిదండ్రులదే అంతిమ నిర్ణయం. తమ పిల్లలను ఇష్టపూర్వకంగా స్కూళ్లకు పంపిస్తున్నట్లు సమ్మతి తెలిపే లేఖలు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ స్కూల్ యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడానికి వీలు లేదు. ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు పిల్లలను తప్పనిసరిగా హాజరవ్వాలని హెచ్చరికలు చేస్తాయి. అయితే అలాంటి కాలేజీలు, పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. తరగతులకు హాజరుకాని విద్యార్థుల కోసం డిజిటల్ విధానంలో పాఠాలను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
- బైక్‌పై ముగ్గురు.. ఆపమన్మందుకు కానిస్టేబుల్‌పై కాల్పులు
- అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు లేఖ రాలేదు..
- భార్యతో గొడవ.. గొంతు కోసుకున్న భర్త
- ఖలిస్తాన్ గ్రూపుల బెదిరింపు : కెనడాలో హిందువులపై దాడుల పట్ల ఆందోళన
- పేదల కోసం ఎంజీఆర్ ఎంతో చేశారు : ప్రధాని మోదీ
- గర్భిణి చితిలో బంగారం కోసం సెర్చ్.. నలుగురు నిందితులు అరెస్ట్
- కోచింగ్ సెంటర్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు తప్పనిసరి
- మరో హాస్పిటల్‌కు టైగర్ వుడ్స్ తరలింపు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి