బుధవారం 03 మార్చి 2021
Hyderabad - Jan 24, 2021 , 08:45:39

తరగతులు.. 16 వారాలే...

తరగతులు.. 16 వారాలే...

  • అదీ 9, 10 తరగతుల విద్యార్థులకే..
  • ఉదయం 8.45 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు..
  • జంట నగరాల్లోని 182 స్కూళ్లలో 1.25 లక్షల మంది విద్యార్థులు
  • ఇప్పటి వరకు 24,700 మంది విద్యార్థుల నమోదు..
  • 2020-21 విద్యా సంవత్సరం ప్రణాళిక విడుదల
  • మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

కొవిడ్‌ వైరస్‌, ప్రత్యేక పరిస్థితుల కారణంగా సుదీర్ఘ విరామం తీసుకున్న విద్యార్థులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి బడి బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో 9,10 తరగతుల విద్యార్థులకు ఫిబ్రవరి నుంచి మే వరకు 16 వారాలు మాత్రమే ఆఫ్‌లైన్‌ తరగతులు జరుగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ఇప్పటివరకు 24,700 మంది విద్యార్థులు తమ పేర్లను ఎన్‌రోల్‌ చేసుకున్నారు.

సిటీబ్యూరో, జనవరి 23(నమస్తే తెలంగాణ): కొవిడ్‌-19 నేపథ్యంలో సుదీర్ఘ విరామం తరువాత బడిగంటలు మోగనున్నాయి. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి స్కూళ్లు తెరచుకోనున్నా యి. అయితే, కేవలం 9, 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే విద్యాబోధన ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతిలో కొనసాగనుంది. అం దుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరం పాఠ్యప్రణాళికను ప్రకటించింది. మొత్తంగా ఫిబ్రవరి ఒకటిన ప్రారంభమై మే 26వ తేదీతో ముగియనుండగా, 16 వారాల పాటే తరగతులు కొనసాగనున్నాయి.   

జంట నగరాల్లో 1.25 లక్షల మంది విద్యార్థులు..

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో 9, 10వ తరగతులకు సంబంధించి మొత్తంగా 182 హైస్కూల్స్‌ ఉండగా, ఈ ఏడాది నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 24,700 మంది విద్యార్థులు ఎన్‌రోల్‌మెంట్‌ చేయించుకున్నారు. 1125 ప్రైవేట్‌ పాఠశాలల్లో సుమారు లక్ష మంది వరకు విద్యార్థులు అడ్మిషన్‌ తీసుకున్నారు. అదే విధంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మొత్తంగా 40201 మంది విద్యార్థులు ప్రవేశాలను పొందారు. వారందరికీ ఇప్పటికే 2020 సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుంచే వర్చువల్‌ పద్ధతిలో పాఠ్యాంశాల బోధన కొనసాగుతున్నది. అదీగాక టీ సాట్‌ ద్వారా తరగతులను నిర్వహిస్తున్నారు. తాజాగా, ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఆన్‌లైన్‌తో పాటుగా ముఖాముఖిగా పాఠ్యాంశాల బోధన కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు పదో తరగతి విద్యార్థులకు రెండు పిరియడ్‌లను ఆన్‌లైన్‌ పద్ధతిలో బోధించనున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదింటి వరకు 9వ తరగతికి రెండు పిరియడ్‌లను వర్చవల్‌గా బోధించనున్నారు.  ఉదయం 8.45 గంటలకే..

జంట నగరాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో పాఠశాల నిర్వహణ వేళల్లో ఎప్పటిలాగానే మార్పులను చేశారు. నగరంలో నెలకొనే ట్రాఫిక్‌ సమస్యల దృష్ట్యా జంట నగర స్కూళ్ల నిర్వహణ సమయాలను ముందుగానే ప్రారంభించి, ముందుగానే ముగిస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంట ల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. రోడ్లపై రద్దీలేని సమ యమంటే ఉదయం 8.45 గంటలకు పాఠశాలలను ప్రారంభించి, సాయంత్రం నాలుగు గం టలకే ముగిస్తారు. ఈ ఏడా ది కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

  • కోడ్‌ ఉంటేనే.. బస్‌పాస్‌
  • ఒకటి నుంచి పాస్‌లు జారీ: టీఎస్‌ ఆర్టీసీ

సిటీబ్యూరో, జనవరి 23(నమస్తే తెలంగాణ): కోడ్‌ ఉంటేనే విద్యార్థులకు బస్‌ పాస్‌లను జారీ చేస్తామని, అందుకు సంబంధించి పాఠశాలలు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌ ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్‌ రావు శనివారం పేర్కొన్నారు. అందుకు సంబంధించిన దరఖాస్తులను ఈనెల 28వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నామని, ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి విద్యార్థులకు పాస్‌లను జారీ చేస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్‌ పరిధిలో చదువుకునే కళాశాలల, పాఠశాలల విద్యార్థులు సబ్సిడీపై టీఎస్‌ఆర్టీసీ బస్‌పాస్‌లను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. విద్యా సంస్థలు టీఎస్‌ ఆర్టీసీ నుంచి కనీస ఛార్జీలను చెల్లించి బస్‌పాస్‌ కోడ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం, ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్‌పాసుల మంజూరుకు సంబంధించిన చర్యలను చేపట్టింది. 

28 నుంచి దరఖాస్తుల స్వీకరణ..

పాఠశాలలు, కళాశాలలన్నీ బస్‌పాస్‌ కోడ్‌ను తీసుకోవాలని టీఎస్‌ ఆర్టీసీ వెల్లడించింది. అం దుకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 28 నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నామని, విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాస్‌లను జారీ చేస్తామని వెల్లడించింది. ప్రైవేట్‌ విద్యా సం స్థలు అడ్మినిస్ట్రేటివ్‌ చార్జిలను డీడీ రూపంలో చెల్లించి కార్యాలయంలో అందజేయాలని, నిర్దేశిత పత్రాలను సమర్పించి బస్‌పాస్‌ కోడ్‌ను పొందాలని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన వివరాలకు ‘ఆన్‌లైన్‌.టీఎస్‌ఆర్టీసీపాస్‌.ఇన్‌' వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.


VIDEOS

logo