గురువారం 01 అక్టోబర్ 2020
Hyderabad - Aug 06, 2020 , 00:45:57

బాధితురాలినని చెప్పి.. బురిడీ కొట్టించబోయింది

బాధితురాలినని చెప్పి.. బురిడీ కొట్టించబోయింది

వ్యభిచార ముఠా నిర్వాహకురాలిగా తేలింది.. 

పోలీసుల విచారణలో వెలుగు చూసిన నిజం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పోలీసుల కండ్లు కప్పాలని ప్రయత్నించింది. మాయ చేసి బాధితురాలిగా మారి రెస్క్యూ హోంకు వెళ్లింది. చివరాఖరికి రాచకొండ పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేపట్టడంతో బాధితురాలిగా మారిన నిర్వాహకురాలి బండారం బయటపడింది.  ఈ ఘటన రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ మల్కాజిరిగి జోన్‌ పరిధి పీఎస్‌లో జరిగింది.  వివరాలు ఇలా ఉన్నాయి.. పది రోజుల క్రితం మల్కాజిగిరి డీసీపీ జోన్‌లోని ఓ పోలీసు స్టేషన్‌ పరిధిలో స్థానిక పోలీసులు, స్పెషల్‌ ఆపరేషన్‌ టీం సభ్యులు ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందుకుని సోదాలు జరిపారు. ఆ సమయంలో ఆ ఇంట్లో నలుగురు మహిళలు ఉన్నారు. అయితే ఆ నలుగురిలో నిర్వాహకురాలు కూడా ఉంది. అప్రమత్తమైన ఆమె మిగతా ముగ్గురు యువతులను బెదిరించి తనను కూడా ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చారని చెప్పాలని భయపెట్టింది. దీంతో ఆ ముగ్గురు యువతులు నిర్వాహకురాలిని కూడా బాధితురాలని చెప్పడంతో పోలీసులు పునరావాస కేంద్రానికి తరలించారు. దర్యాప్తులో భాగంగా ముఠా ములాలను ఛేదించేందుకు పోలీసులు ఆ యువతులను ప్రశ్నించినప్పుడు వారు అప్పుడు నోరు విప్పి తమతో వచ్చిన నాలుగో మహిళ నిర్వాహకురాలని.. హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొంత మంది ఏజెంట్ల ద్వారా ముంబయి నుంచి తీసుకువచ్చి ఇక్కడ ఇంట్లో బలవంతంగా వ్యభిచార దందాను నిర్వహిస్తున్నదని వివరించారు. అయితే ఆ మహిళ గత కొన్ని ఏండ్లుగా ఈ దందా నడిపిస్తుందని.. పలు మార్లు జైలుకూ వెళ్లి వచ్చిందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో అబద్ధం చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆ మహిళను నిర్వాహకులిగా అరెస్ట్‌ చేయాలా.. లేదా బాధితురాలిగానే భావించాలనే కోణంపై రాచకొండ పోలీసులు న్యాయ నిపుణుల సలహా తీసుకొని తదుపరి చర్యలు చేపట్టనున్నారు. 

తాజావార్తలు


logo