సోమవారం 03 ఆగస్టు 2020
Hyderabad - Jul 15, 2020 , 22:59:46

ఇసుక ‘స్లాట్‌' దందా!!

ఇసుక ‘స్లాట్‌' దందా!!

 ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఇష్టారాజ్యంగా బుకింగ్‌ 

 రూ. 5 వేలు ఎక్కువకు విక్రయం

 ఇద్దరిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఆన్‌లైన్‌ ఇసుక స్లాట్‌ బుకింగ్‌ చేస్తూ లక్షలు కొల్లగొడుతున్న ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు. బుకింగ్‌ రశీదును రూ.500 నుంచి 5 వేల ఎక్కువకు విక్రయిస్తున్న ఇద్దరిని రాచకొండ ఎస్‌ఓటీ, సైబర్‌ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా అయ్యప్పనగర్‌ ప్రాంతానికి చెందిన సిసోడియా ఆదేశ్‌ జైన్‌, సిసోడియా అరిహంత్‌ జైన్‌ సోదరులు. వీరి తండ్రి ఇసుక సరఫరా వ్యాపారం చేస్తున్నాడు. ఇసుక కోసం ప్రభుత్వ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ శాండ్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టం ద్వారా నమోదు చేసుకునేవారు. ఈ-బుకింగ్‌ 15 నిమిషాలే అందుబాటులో ఉంటుంది. బుకింగ్‌లు తెరవగానే రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంకేతిక సర్వీసుల నుంచి అందరూ ప్రయత్నిస్తుండటంతో రద్దీ ఏర్పడి వెబ్‌సైట్‌ జామ్‌ అవుతున్నది. చాలామంది ఇసుక వ్యాపారులు ఇంటర్నెట్‌ కేంద్రాలు, ఇతర బ్రోకర్‌లపై ఆధారపడి వారికి అదనంగా చెల్లించి బుకింగ్‌లను పొందేవారు. ఒక్కో స్లాట్‌ బుక్‌ చేస్తున్నందుకు ఇంటర్నెట్‌ కేంద్రాల నిర్వాహకులు రూ.500 నుంచి రూ.1500 తీసుకునేవారు. ఇసుక స్లాట్‌ బుకింగ్‌తో సంపాదించాలని ఆదేశ్‌, అరిహంత్‌ నిర్ణయించారు. నిపుణులను సంప్రదించి ప్రత్యేకంగా ఆటోఫిల్‌ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించారు. దాన్ని ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ సాయంతో స్నేహితులు, బంధువుల పేరిట ఇసుక బుకింగ్‌లను చేస్తున్నారు. ఆ రశీదులను రూ.500 నుంచి 5 వేలు అధికంగా వసూలు చేసి ఇతరులకు అమ్ముకుంటున్నారు. ఏడాదిపాటు అక్రమంగా స్లాట్‌ బుకింగ్‌ దందాను నడిపించారు. ఆ తర్వాత ఆటోఫిల్‌ సాఫ్ట్‌వేర్‌ వేగం తగ్గడంతో ఆడ్‌ఆన్స్‌ డొమెయిన్‌ వెబ్‌సైట్‌ రూపకర్తను సంప్రదించి వేగం పెరిగేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయాలని కోరారు. అలాచేస్తే లాభాల్లో 40 నుంచి 60 శాతం ఆదాయాన్ని ఇస్తామని చెప్పారు. ఆడ్‌ఆన్స్‌ డొమెయిన్‌ రూపకర్త అనురాగ్‌ తెలంగాణ శ్యాండ్‌ ప్రొడక్టవిటీ టూల్‌ను తయారుచేసి ఇచ్చాడు. దీనిద్వారా ఆదేశ్‌, అరిహంత్‌ ఇసుక స్లాట్‌లను బుకింగ్‌ చేయడంతోపాటు ఆటోఫిల్‌ సాఫ్ట్‌వేర్‌ను దాదాపు 500 మందికి ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున విక్రయించారు. అక్రమ దందాతో దాదాపు 50 లక్షల వరకు సంపాదించారని పోలీసుల విచారణలో బయటపడింది. ఆదేశ్‌ నాలుగు ఖాతాలు, అరిహంత్‌ రెండు ఖాతాలను నిర్వహిస్తుండటంతోపాటు స్నేహితుల బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ ఖాతాల బ్రాంచిలన్నీ కామారెడ్డి జిల్లాకు చెందినవిగా పోలీసులు నిర్ధారించారు.


logo