శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Jul 25, 2020 , 01:22:29

సేమ్‌ టూ సేమ్‌.. స్పానిష్‌ ఫ్లూ లెక్కనే కరోనా!

సేమ్‌ టూ సేమ్‌.. స్పానిష్‌ ఫ్లూ లెక్కనే కరోనా!

  ఫ్లూ.. నెలకే మాయం

  హైదరాబాద్‌ను వణికించిన స్పానిష్‌ ఫ్లూ

  మొదట్లో ప్రవేశం.. అక్టోబర్‌లో ఉచ్ఛస్థితికి

  మాయం.. అదేరీతిలో కరోనా వైరస్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : స్పానిష్‌ ఫ్లూ.. శతాబ్దం కిందట ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. హైదరాబాద్‌ నగరాన్ని సైతం అతలాకుతలం చేసింది. వైరస్‌వ్యాప్తి నెమ్మదిగా మొదలై చాపకిందనీరులా.. విస్తరించింది. వేలాదిమందిని బలిగొన్నది. ఆ తర్వాత అంతే వేగంగా మాయమైంది. ఇప్పుడు కరోనా మహమ్మారి సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

మూడుదశల్లో.. 

1921 జనాభా లెక్కల ప్రకారం 1918 ప్రారంభంలో స్పానిష్‌ ఫ్లూ హైదరాబాద్‌ నగరానికి వ్యాపించింది. మహమ్మారి గమన క్రమాన్ని పరిశీలిస్తే మూడుదశలు కనిపిస్తాయి. కరోనా సైతం 2020 ప్రారంభంలో మన రాష్ట్రంలోకి వ్యాప్తిచెందింది. ఈ వైరస్‌ ప్రయాణం కూడా అదేవిధంగా సాగుతున్నట్టు కనిపిస్తున్నది. 

ప్రారంభంలో నెమ్మదిగా:- స్పానిష్‌ ఫ్లూ బాధితుల సంఖ్య ప్రారంభంలో నామమాత్రంగా ఉండేది. ప్రస్తుతం కరోనా కేసులు మొదట్లో ఒకటి రెండు మాత్రమే బయటపడ్డాయి. 

నెమ్మదిగా విస్తరణ:- భాగ్యనగరంలో స్పానిష్‌ ఫ్లూ చాపకింద నీరులా విస్తరించింది. వ్యాప్తి ఆందోళనకరస్థాయికి చేరేందుకు కొన్ని నెలలు పట్టింది. సెప్టెంబర్‌ చివరినాటికి కేసుల సంఖ్య భారీగా పెరుగడం మొదలైంది. నెల రోజులకు అంటే.. అక్టోబర్‌ చివరినాటికి వైరస్‌ ప్రభావం ఉచ్ఛస్థాయికి చేరింది. నగరాన్ని అతలాకుతలంచేసింది. సగం జనాభా వైరస్‌ బారిన పడింది. 

కరోనా మహమ్మారి సైతం హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరించింది. మూడునెలల లాక్‌డౌన్‌తో కొంత నిలువరించగలిగినా.. ప్రస్తుతం కేసులు ఆందోళనకరస్థాయిలో నమోదవుతున్నాయి.

వేగంగా మాయం:- ఉచ్ఛస్థితికి చేరిన నెలరోజుల తర్వాత స్పానిష్‌ ఫ్లూ వేగంగా మాయమైంది. నవంబర్‌ చివరినాటికి వైరస్‌ దాదాపు కనుమరుగైంది. 

ప్రస్తుతం కరోనా సైతం ఇదే పద్ధతిని అవలంభిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆందోళనకరస్థాయిలో కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేస్తున్నారు. కాబట్టి.. మరో నెల లేదా రెండునెలల్లో వైరస్‌ ప్రభావం తగ్గిపోతుందని విశ్లేషిస్తున్నారు. 

మరణాల రేటు తక్కువే

స్పానిష్‌ ఫ్లూతో పోల్చితే ప్రస్తుతం కరోనా మరణాల రేటు నామమాత్రంగానే ఉన్నది. అప్పటి లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది బాధితుల్లో దాదాపు 50 మంది మరణించారు. అంటే.. మరణాల రేటు 5 శాతానికిపైగానే ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 1.5 శాతానికి మించలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వానికి సహకరిస్తేనే వైరస్‌ కట్టడి సాధ్యమవుతుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.