శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 24, 2020 , 06:52:17

సద్దుల బతుకమ్మకు అంతటా ఏర్పాట్లు

సద్దుల బతుకమ్మకు అంతటా ఏర్పాట్లు

  • కాస్త ఆలస్యంగా నగరంలో దసరా సందడి
  • ముంపు నుంచి తేరుకున్న ప్రాంతాల్లోనూ పూల పండుగ
  • మాల్స్‌, దుకాణాల్లో 40 శాతం పెరిగిన గిరాకీ 

దసరా పండుగ అంటేనే జోష్‌. ఎంగిపూల బతుకమ్మ మొదలు విజయ దశమి వరకు పది రోజులపాటు సిటీలో ఉండే సందడి అంతాఇంతా కాదు. పూల మార్కెట్లు, వ్యాపార సముదాయాలు కిటకిటలాడుతుంటాయి. ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా పండుగ హడావుడి కొంత ఆలస్యంగా మొదలైనా, సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధమవుతున్నది. రెండ్రోజుల నుంచి నగర మార్కెట్లలో షాపింగ్‌ జోరుందుకున్నది. ఈ రెండ్రోజుల్లో 40 శాతం గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు. వరద ముంపు నుంచి తేరుకున్న ప్రాంతాల్లోనూ సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా మా తల్లి బతుకమ్మను వదుకోలేమంటున్నారు ఆడబిడ్డలు.

జిల్లాలకు 3వేల బస్సులు

సొంతూళ్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పండుగ జరుపుకొనేందుకు పిల్లాపాపలతో పలువురు పల్లె బాట పడుతున్నారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌తోపాటు శివారు ప్రాంతాల్లోని పాయింట్లు శుక్రవారం కిటకిటలాడాయి. నగరం నుంచి జిల్లాలకు 3వేల బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు తెలిపారు. చాలామంది సొంత, ప్రైవేట్‌ వాహనాల్లోనూ వెళ్తున్నారు. 

పండుగ పూట పైలం

ఇయ్యాల బతుకమ్మ, రేపు దసరా. ఆ పండుగల సంతోషం మనతోనే ఉండాలంటే జనం అప్రమత్తం ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి పొంచి ఉన్నందు వల్ల వల్ల రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇటీవల కేరళలో ఓనమ్‌ పండుగతో వైరస్‌ వ్యాప్తి మళ్లీ పెరిగిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.