e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home హైదరాబాద్‌ ఒక్క క్లిక్‌తో.. ముంగిట్లోకి సేవలు

ఒక్క క్లిక్‌తో.. ముంగిట్లోకి సేవలు

ఒక్క క్లిక్‌తో.. ముంగిట్లోకి సేవలు
 • కార్యాలయానికి వెళ్లకుండానే 17 రకాల సర్వీసులు
 • ‘ఎనీవేర్‌.. ఎనీటైం’కు ఆదరణ.. టీ యాప్‌ ఫోలియోతో సేవలు
 • లాక్‌డౌన్‌లోనూ కొనసాగుతున్న ఆర్టీఏ కార్యకలాపాలు
 • త్వరలో మరిన్ని ఆన్‌లైన్‌లోకి.. సంతోషం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
 • రోజుకు కనీసం గ్రేటర్‌లో 200 మందికిపైగా వినియోగం

“ అతడి పేరు ప్రకాశ్‌. లెర్నర్‌ లైసెన్స్‌ గడువు గత ఏడాది ముగిసింది. తిరిగి రెన్యూవల్‌ చేయించుకోలేదు. ఇటీవల లాక్‌డౌన్‌ కావడంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో పోలీసులు లైసెన్స్‌ చూపించమని అడిగారు. ‘సర్‌ నా లెర్నింగ్‌ లైసెన్స్‌ గడువు పూర్తయింది. రెన్యూవల్‌ చేయించుకుందామంటే లాక్‌డౌన్‌” అని చెప్పాడు. దీంతో పోలీసులు అతడికి ఆన్‌లైన్‌ సర్వీస్‌ గురించి వివరించడంతో ప్రకాశ్‌ తన లెర్నింగ్‌ లైసెన్స్‌ను కార్యాలయానికి వెళ్లకుండానే రెన్యూవల్‌ చేయించుకున్నాడు.

సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): విపత్కర కాలంలోనూ ఆర్టీఏ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్క క్లిక్‌తో వాహనదారులకు కావాల్సిన సేవలన్నీ మన ముంగిళ్లలోకి వస్తున్నాయి. జవాబుదారితనం, పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఆర్టీఏ ఆన్‌లైన్‌ సర్వీసులు “ఎనీవేర్‌-ఎనీ టైం” విధానం ప్రస్తుత లాక్‌డౌన్‌లోనూ వాహనదారులకు చక్కగా ఉపయోగపడుతుంది. కార్యాలయాలకు రాకుండానే ఆర్టీఏ సేవలను వినియోగించుకునే విధానానికి మంచి స్పందన వస్తుంది. ఒక్క క్లిక్‌ చేస్తే కీలక సేవలన్నీ ముంగిట్లో ప్రత్యక్షమవుతున్నాయి.

సుమారు 17 రకాల ఆర్టీఏ సేవలు ఇంట్లో ఉండే పొందొచ్చు. కొవిడ్‌ కట్టడిలో భాగంగా నిర్వహించుకున్న లాక్‌డౌన్‌లో ఆర్టీఓ కార్యాలయాల్లోకి వాహనదారులకు ప్రవేశం లేదు. సాధారణ రోజుల్లో ఒక్క కార్యాలయానికి సుమారు 200 మంది వాహనదారులు వివిధ పనుల కోసం వస్తుంటారు. అయితే, ఇప్పుడు కనీసం 60 అప్లికేషన్లు ప్రతి కార్యాలయానికి ఆన్‌లైన్‌లోనే వస్తున్నాయి. వాటిని పరిశీలించిన అధికారులు వెంట వెంటనే ఓకే చేసేస్తున్నారు. ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే.. వాటిని తిరిగి దరఖాస్తుదారుడికి తెలియజేస్తున్నారు.

సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్‌ సేవలు త్వరతిగతిన పూర్తవుతున్నాయి. ఇతర ఆర్టీఏ కార్యాకలాపాలు కూడా లేకపోవడంతో అధికారులు అంతా ఆన్‌లైన్‌ సేవల పారదర్శకతపై దృష్టి సారించారు. లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ సేవలు తమకు బాగా ఉపయోగపడుతున్నాయని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిగో యాప్‌..

ప్లే స్టోర్‌ నుంచి టీ యాప్‌ ఫోలియోను డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. అందులో ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ -ఆర్‌టీఏపై క్లిక్‌ చేస్తే కావాల్సిన సర్వీసులు ప్రత్యక్షమవుతాయి. ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్‌ – 040 2337 0081 /83 /84 నంబర్‌కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు.
అవినీతికి తావు లేకుండా సేవలందించడమే మా లక్ష్యం

“ఎనీవేర్‌ – ఎనీ టైం” విధానంతో ప్రస్తుతం లాక్‌డౌన్‌లో కూడా వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నాం. సుమారు 17 రకాల సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే ఈ సేవలు పొందొచ్చు. టీ-యాప్‌ ఫోలియోను డౌన్‌లోడ్‌ చేసుకుని మొబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకుని తర్వాత కనిపించే ఆర్టీఏ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే సేవలు కనిపిస్తాయి. ఈ సేవలు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నా.. ప్రస్తుత లాక్‌డౌన్‌లో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా సేవలు ఉపయోగపడుతున్నాయి. ఇంకొన్ని సేవలను కూడా ఆన్‌లైన్‌ చేయాలని భావిస్తున్నాం. అవినీతికి తావు లేకుండా పారదర్శక సేవలందించడమే మా లక్ష్యం. – పువ్వాడ అజయ్‌కుమార్‌, మంత్రి, రవాణా శాఖ

ఇవిగో ఆన్‌లైన్‌ సేవలు..

రెన్యూవల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌..
లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసుకోవడం ప్రస్తుతం చాలా ముఖ్యం. లాక్‌డౌన్‌లో ఈ సేవకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో నుంచే ఈ సేవను పొందొచ్చు.

చేంజ్‌ ఆఫ్‌ అడ్రస్‌..

డ్రైవింగ్‌ లైసెన్స్‌లో చిరునామా మార్చేందుకు ఏ కార్యాలయానికి వెళ్లాల్సినవసరం లేదు. ఒక్క క్లిక్‌తో వాహనదారులు వారికి కావాల్సిన మార్పులను చేసుకుని సబ్మిట్‌ బటన్‌ నొక్కితే సరిపోతుంది. అధికారులు పరిశీలించి సంబంధిత ఫైల్‌ను యాక్సెప్ట్‌ చేస్తారు.

లైసెన్స్‌ హిస్టరీ..

లైసెన్స్‌ జారీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎప్పటి నుంచి డ్రైవింగ్‌ చేస్తున్నామో హిస్టరీ అంతా పొందేందుకు లైసెన్స్‌ హిస్టరీ పత్రం జారీ చేస్తారు. మల్టీ నేషనల్‌ కంపెనీల్లో డ్రైవర్‌ వృత్తిలో అనుభవం సర్టిఫికెట్‌ అడుగుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ లైసెన్స్‌ హిస్టరీ అవసరం పడుతుంది. ఒక్క క్లిక్‌తో ఇంట్లో నుంచే ఈ సేవను పొందొచ్చు.

పర్మిట్‌పత్రం..

కమర్షియల్‌ వాహనాలు రోడ్ల మీద తిరగాలంటే వాహనాలకు పర్మిట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. అందుకోసం వాహనాలకు ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, ఫిట్‌నెస్‌ కచ్ఛితంగా ఉండాలి. న్యూ పర్మిట్‌, డూప్లికేట్‌ పర్మిట్‌, రెన్యూవల్‌ పర్మిట్‌, టెంపరరీ స్పెషల్‌ పర్మిట్ల సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

డూప్లికేట్‌ లైసెన్స్‌..

లైసెన్స్‌ పోవడం, పాడవడం జరిగితే మళ్లీ తిరిగి పొందడానికి ఆన్‌లైన్‌ సేవలు ఉపయోగించుకోవచ్చు. నిర్దేశించిన ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. లెర్నింగ్‌ లైసెన్స్‌ గడువు ముగియడం జరిగితే.., దాని స్థానంలో మళ్లీ.. తీసుకునే అవకాశం ఆన్‌లైన్‌ సర్వీస్‌ కల్పించింది.

మరికొన్ని ఆన్‌లైన్‌ సేవలు..

 • లెర్నర్‌ లైసెన్స్‌ ఫర్‌ అడిషనల్‌ ఆఫ్‌ క్లాస్‌ ఆఫ్‌ వెహికిల్‌
 • డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిస్తే లెర్నర్‌ లైసెన్స్‌ పొందడం
 • రిజిస్ట్రేషన్‌సర్టిఫికెట్‌(ఆర్‌సీ)లోచిరునామా మార్చుకోవడం
 • క్లియరెన్సీ సర్టిఫికెట్‌ జారీ..
 • హజార్డస్‌ లైసెన్స్‌ తదితర సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి

లాక్‌డౌన్‌ కుదింపుతో ఆర్టీఏలో రెండు రకాల సేవలు ప్రారంభం

 • వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇంటర్నేషనల్‌ లైసెన్స్‌
 • కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే.. నిలిపివేత
 • జేటీసీ పాండురంగనాయక్‌

లాక్‌డౌన్‌ కుదింపుతో ఆర్టీఏ సేవలు ప్రారంభమయ్యాయి. వాహనాల రిజిస్ట్రేషన్‌, అంతర్జాతీయ లైసెన్స్‌ ప్రక్రియ సోమవారం నుంచి షురూ అయ్యాయి. సంబంధిత సేవలకు స్లాట్స్‌ బుక్‌ చేసుకోవచ్చని జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పాండురంగ నాయక్‌ తెలిపారు. మిగిలిన సేవలు ప్రస్తుతానికి ప్రారంభం కాలేదని.. ఉన్నతాధికారుల ఆదేశాలు రావాల్సి ఉన్నాయని పేర్కొన్నారు. కాగా ఆన్‌లైన్‌ సర్వీసులు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయని వాహనదారులు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వివరించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించపోతే సేవలను నిలిపివేస్తామని జేటీసీ హెచ్చరించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఒక్క క్లిక్‌తో.. ముంగిట్లోకి సేవలు

ట్రెండింగ్‌

Advertisement