ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 27, 2021 , 05:03:02

ఆటకు లేదు లోటు

ఆటకు లేదు లోటు

 • ఒక్కో డివిజన్‌కు రూ.2 లక్షల క్రీడా సామగ్రి  
 • పాత పాలకమండలి ఆమోదం 
 • ఇంతలోనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి 
 • కొత్త పాలకమండలి ఆమోదం తర్వాతే పంపిణీ? 

పిల్లలకు క్రీడల్లో తర్ఫీదు ఇవ్వడంతోపాటు వారి శారీరక ఎదుగుదల కోసం జీహెచ్‌ఎంసీ ప్రతియేటా సమ్మర్‌క్యాంపులు నిర్వహిస్తున్నది. ప్రభుత్వ మైదానాలు, ఇండోర్‌,అవుట్‌డోర్‌ స్టేడియాల్లో శిక్షణ ఇస్తున్నది. ఇప్పటివరకు డివిజన్‌కు రూ.లక్ష చొప్పున క్రీడా సామగ్రి కొనుగోలు చేసే వెసులుబాటు ఉండగా,చాలడం లేదని పాత పాలకమండలి సభ్యులు పట్టుబట్టడంతో రూ.2 లక్షల వరకు కొనేందుకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదించింది. ఇంతలో మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే డివిజన్‌కు రూ.2 లక్షల క్రీడా సామగ్రిని కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు అంగీకరిస్తారా?  లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. అధికారులు మాత్రం కొత్త పాలకమండలి ఆమోదం తర్వాతే పంపిణీ చేస్తామని చెబుతున్నారు.         

సమ్మర్‌ వస్తుంది.. క్రీడలకు సంబంధించి కావాల్సిన పరికరాలను పెంచండి.. లక్ష రూపాయల సామగ్రి సరిపోవడం లేదు.. అదనంగా మరో లక్ష వరకు పెంచండి.. ఇది జీహెచ్‌ఎంసీ పాత పాలకమండలి సభ్యులు పట్టుపట్టి మరీ ఒక్కో డివిజన్‌కు రెండు లక్షల మెటీరియల్‌ను సాధించుకున్నారు. ఇందుకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. అధికారులు సైతం ఈ-టెండర్‌ ద్వారా క్రికెట్‌, షటిల్‌, బ్యాడ్మింటన్‌, క్యారమ్‌, చెస్‌, బాస్కెట్‌ బాల్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, స్కేటింగ్‌, టెన్నీస్‌, టెబుల్‌ టెన్నీస్‌ తదితర క్రీడా సామగ్రిని సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డివిజన్‌కు రెండు లక్షల క్రీడా సామగ్రిని పంపిణీ చేయొచ్చని అనుకునే లోపే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. పాత పాలకమండలి ఆమోదించిన ఈ అంశం త్వరలో ఏర్పాటు కానున్న కొత్త పాలకమండలి పరిధిలోకి వెళ్లింది. దీంతో డివిజన్‌కు రెండు లక్షల క్రీడా సామగ్రిని కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు అంగీకరిస్తారా?  లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. అధికారులు మాత్రం కొత్త పాలకమండలి ఆమోదం తర్వాతనే అందుకు అనుగుణంగా క్రీడా సామగ్రిని దిగుమతి చేస్తామని చెబుతున్నారు.

సమ్మర్‌క్యాంపులపై తర్జనభర్జన 

వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఒకటే సరదా.. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులు సమ్మర్‌లో తెగ ఎంజాయ్‌ చేయాలనుకుంటారు.. పల్లెటూర్లకు వెళ్లే వాళ్లు కొందరైతే స్విమ్మింగ్‌, స్కేటింగ్‌, బ్యాడ్మింటన్‌, క్యారం, చెస్‌, బాస్కెట్‌ బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌ తదితర స్పోర్ట్స్‌లలో ప్రతిభ చాటాలని భావిస్తుంటారు. ఇందుకు జీహెచ్‌ఎంసీ సమ్మర్‌ క్యాంపులను ఎంచుకుంటారు. జీహెచ్‌ఎంసీ కూడా క్రీడలకు పెద్దపీట వేస్తూ ప్రతి సంవత్సరం పిల్లలకు విద్యతో పాటు ఆట పాటలు అవసరం ఉందంటూ ఔట్‌డోర్‌, ఇండోర్‌ స్పోర్ట్స్‌, పెయింటింగ్‌ తదితర మనోవికాసాన్ని పెంచే ఫన్నింగ్‌ గేమ్స్‌లలో శిక్షణ ఇస్తుంటారు. అయితే కొవిడ్‌ మహమ్మారి కారణంగా గతేడాది సమ్మర్‌ క్యాంపులను దూరంగా పెట్టిన జీహెచ్‌ఎంసీ ఈ సారి కూడా దాదాపుగా వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణ కష్టమేనన్న అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ఈ ఏడాది కూడా దాదాపుగా పిల్లలకు సరదా దూరమైనట్లేనని చిన్నారులు దిగులు చెందుతున్న పరిస్థితి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సమ్మర్‌ క్యాంపులను నిర్వహించాలా? లేదా ? అన్నది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

సమ్మర్‌క్యాంపుల లక్ష్యం..

పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా వారికి ప్రోత్సాహం ఉండదు. తల్లిదండ్రులు ప్రోత్సహించినా అందుబాటులో మైదానాలు ఉండవు. అయితే పిల్లలను క్రీడల పట్ల ప్రోత్సహించి ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. క్రీడా మైదానాల అభివృద్ధి, వసతుల కల్పన, కొత్త మైదానాల ఏర్పాటు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణంతో పాటు ప్రతి ఏటా వేసవిలో సమ్మర్‌ క్యాంపులను నిర్వహిస్తూ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నది. 

 • నగరంలోని అన్ని మున్సిపల్‌ సర్కిళ్లలో ప్రతి వేసవిలో జీహెచ్‌ఎంసీ సమ్మర్‌ క్యాంపులను నిర్వహిస్తున్నది. ఏటా ఒకటిన్నర లక్షల మంది పిల్లలు సమ్మర్‌ క్యాంపులకు వస్తుండగా.. మే 30వరకు శిక్షణ ఇచ్చి ప్రతిభ కనబర్చిన చిన్నారులకు ఏడాది పొడవునా శిక్షణ ఇస్తారు. 
 • 51 క్రీడల్లో 1,386 సమ్మర్‌ కోచింగ్‌ కేంద్రాలను ప్రారంభించి 1482మంది కోచ్‌ల ద్వారా 1,16,626 మందికి శిక్షణ ఇస్తూ వస్తున్నారు.
 • 75 క్రీడా మైదానాల్లో వివిధ క్రీడలకు సంబంధించి కావాల్సిన పరికరాలను జీహెచ్‌ఎంసీ సిద్ధంగా ఉంచింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో క్రీడా సదుపాయాలు 

 • ఆట మైదానాలు -521
 • క్రీడా సముదాయాలు- 19 
 • ఈత కొలనులు-7
 • టెన్నీస్‌ కోర్టులు -5 
 • స్కెటింగ్‌ రింక్స్‌-12 
 • అంతర్జాతీయ బ్యాంకింగ్‌ ట్రాక్‌- 1
 • ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి-13 

VIDEOS

logo