మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 04, 2020 , 23:58:04

రూ. 11.77 లక్షల సైబర్‌ దోపిడీ

రూ. 11.77 లక్షల సైబర్‌ దోపిడీ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబర్‌ నేరగాళ్లు చేసిన మోసంలో డబ్బులు పోగొట్టుకున్న పలువురు బాధితులు మంగళవారం సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై మదన్‌ కథనం ప్రకారం.. లంగర్‌హౌస్‌కు చెందిన ముస్తాఫా రిటైర్డు ఉద్యోగి. బ్యాంకు అధికారుల పేరుతో ఆయనకు ఫోన్‌చేసిన సైబర్‌ నేరగాళ్లు.. మీ కార్డు బ్లాక్‌ అవుతుందని హెచ్చరించారు. వోటీపీతో పాటు అన్ని వివరాలు తెలుసుకున్న నేరగాళ్లు.. అతడి ఖాతాలో నుంచి రూ. మూడు లక్షలు స్వాహా చేశారు.  బేగంబజార్‌కు చెందిన అభిలాష్‌కు లాటరీ వచ్చిందంటూ నమ్మించిన సైబర్‌నేరగాళ్లు దఫ దఫాలుగా రూ. 2.6 లక్షలు కాజేశారు. ఆన్‌లైన్‌ ప్లేస్‌ మార్కెటింగ్‌లో డ్రెస్‌ మెటీరియల్‌ కొనేందుకు ప్రయత్నించిన ఓ మహిళ, సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 1.3 లక్షలు పోగొట్టుకుంది. ఆన్‌లైన్‌లో లక్ష రూపాయల లోన్‌ కోసం ప్రయత్నించిన పురానాపూల్‌కు చెందిన నారాయణరావుకు సైబర్‌నేరగాళ్లు రుణం ఇస్తామంటూ నమ్మించి.. లక్ష రూపాయలు టోకరా వేశారు. గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌ సర్చ్‌ చేసిన చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తి సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 2.67 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇదే కోవలో వోఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకు యాక్టివా 5జీ వస్తుందని ఆశపెట్టిన సైబర్‌నేరగాళ్లు.. శాంతిలాల్‌కు రూ. 1.2 లక్షలు బురిడీ కొట్టించారు.

శాలిబండలో చైన్‌స్నాచింగ్‌

చాంద్రాయణగుట్ట: అలియాబాద్‌ కల్వగడ్డ శివాలయం ప్రాంతంలో  ఆండాలు(60) జనరల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నది. మంగళవారం ఉదయం ఓ యువకుడు, యువతి కలిసి ఆమె దుకాణం వద్దకు వచ్చారు. వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి ఆండాలు మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తెంచారు. ఆండాలు ప్రతిఘటించి గొలుసును బిగ్గరగా పట్టుకుని కేకలు వేసింది. చేతికి చిక్కిన చిన్న గొలుసుతో దుండగులు పారిపోయారు. ఆరు తులాల బంగారు గొలుసు నుంచి అరతులం బంగారు గొలుసు దుండగుల చేతికి చిక్కిందని. దీంతో వారు పారిపోయారంటూ బాధితురాలు శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


logo