శనివారం 31 అక్టోబర్ 2020
Hyderabad - Oct 01, 2020 , 07:03:05

కమ్యూనిటీ హాల్‌కు రూ. కోటి విడుదల

కమ్యూనిటీ హాల్‌కు రూ. కోటి విడుదల

కంటోన్మెంట్‌ : రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌ బోర్డు అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపుతూ అడిగిన వెంటనే నిధుల విడుదల చేస్తూ అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా బోయిన్‌పల్లిలోని సంజీవయ్యనగర్‌ బస్తీలో ఖాళీగా ఉన్న స్థలంలో ఓ పాఠశాల నడిపించేందుకు బోర్డు లీజుకు ఇవ్వడం జరిగింది. ఇదే అదనుగా భావించిన సదరు పాఠశాలకు చెందిన వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్లాన్‌ వేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి మండల తహసీల్దార్‌కు సదరు స్థల విషయమై ఫిర్యాదు చేయడంతో ఆ స్థలాన్ని టేకోవర్‌ చేసుకునే విధంగా చర్యలకు ఉపక్రమించారు. అనంతరం బస్తీవాసుల కోసం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం చేపడితే అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో నిధులకు సంబంధించి వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా మంత్రి మల్లారెడ్డి సైతం గతేడాది ఆగస్టులో సంజీవయ్యనగర్‌ బస్తీలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి సంబంధించి ఎస్సీ డెవలప్‌మెంట్‌ అధికారికి లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్సీ డెవలప్‌మెంట్‌ నుంచి కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ. కోటి నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి నిధుల మంజూరు ఎల్వోసీ మంత్రి హరీశ్‌రావు, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మర్రి రాజశేఖర్‌రెడ్డిల చేతుల మీదుగా బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి అందుకున్నారు. దీనిపై స్థానిక బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి రాష్ట్ర  ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.