శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 02, 2020 , 23:37:32

గూడ్స్‌ రైలు సిబ్బందికి రౌండ్‌ ట్రిప్స్‌

గూడ్స్‌ రైలు సిబ్బందికి రౌండ్‌ ట్రిప్స్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రతిరోజు నడిపిస్తున్న గూడ్స్‌రైలు, స్టేషన్‌ సిబ్బందికి ఇబ్బందులు రాకుండా రౌండ్‌ ట్రిప్స్‌ పేరుతో సరికొత్త విధానాన్ని దక్షిణమధ్య రైల్వే అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా గూడ్స్‌ రైళ్లను నడిపే లోకోపైలట్లు, గార్డులు, స్టేషన్‌ మాస్టర్లు తదితర వర్గాలకు మేలు చేకూరేలా చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 

దీనిలో భాగంగా గూడ్స్‌ రైలు కోసం పనిచేసే డ్రైవర్లు, గార్డులు రైలును గమ్యస్థానాలకు చేరేవరకు డ్యూటీ చేయకుండా మధ్యలో వచ్చే జంక్షన్‌ వరకు మాత్రమే తీసుకువెళ్ళి అక్కడ ఇతర డ్రైవర్లు, గార్డుకు అప్పగించి అక్కడే ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిలో బస చేస్తారు. తిరుగు ప్రయాణంలో ఉన్న రైలును తీసుకుని మళ్లీ ఎక్కడి నుండి వెళ్లారో అక్కడికి చేరుకుంటారు. ప్రతి ఉద్యోగికి డెటాల్‌ సబ్బు, శానిటైజర్‌తో కూడిన కిట్లు ఇస్తున్నారు. అంతేకాకుండా డ్రైవర్లు, గార్డులు రైలులో ఉండే ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు.

40 ఐసోలేషన్‌ బోగీలు 

కాచిగూడ : కరోనా వైరస్‌ బాధితులకు వైద్య సదుపాయాలను అందించడానికి కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సీఅండ్‌డబ్ల్యూ డిపోలో 40 ఐసోలేషన్‌ బోగీలను తయారు చేస్తున్నట్లు హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఎన్‌.సీతారామప్రసాద్‌ తెలిపారు. స్వీపర్‌ క్లాస్‌కు చెందిన 4 బోగీలను ఇప్పటికే ఐసోలేషన్‌ వార్డులుగా మార్చామని గురువారం మరో 3 బోగీలను ఐసోలేషన్‌ వార్డులుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.


logo