మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Sep 26, 2020 , 00:44:05

రోడ్డెక్కినయి

రోడ్డెక్కినయి

కదిలిన సిటీ బస్సులు.. 39 రూట్లలో సర్వీసులు

తొలి విడతలో 25 శాతమే.. నగరవాసులకు అందుబాటులోకి వచ్చిన 731 బస్సులు

సిటీబ్యూరో: సిటీ బస్సుల్లో ప్రయాణమంటే.. ఆ మజానే వేరంటారు..అంతలా నగరవాసుల జీవనంలో భాగమైన ఈ సర్వీసులు.. కరోనా కారణంగా సుమారు ఆరు నెలల పాటు డిపోలకే పరిమితమయ్యాయి. లాక్‌డౌన్‌ ముగిసి.. అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతుండగా,  సిటీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, శుక్రవారం నుంచి 29 డిపోలకు చెందిన 731 బస్సులు కొవిడ్‌ జాగ్రత్తలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. తొలిరోజు తక్కువలో తక్కువగా మూడు నిమిషాల వ్యవధి నుంచి 44 నిమిషాల వ్యవధిలో ఫ్రీక్వెన్సీని కొనసాగించారు. ప్రస్తుతం 25 శాతం మాత్రమే సర్వీసులు నడిపిస్తున్నారు.

ఈ రూట్‌లలో సర్వీసులు.. 

పఠాన్‌ చెరు - ఫరూక్‌నగర్‌, పఠాన్‌చెరు - హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం - జేబీఎస్‌, ఇబ్రహీంపట్నం - ఎంజీబీఎస్‌, ఈసీఐఎల్‌ - అఫ్జల్‌గంజ్‌ (లాలాపేట), ఈసీఐఎల్‌ - అఫ్జల్‌గంజ్‌ (నాచారం), పఠాన్‌చెరు - సికింద్రాబాద్‌, ఉప్పల్‌ - కొండాపూర్‌, హకీంపేట - సికింద్రాబాద్‌, ఉప్పల్‌ - లింగంపల్లి, జీడిమెట్ల - సికింద్రాబాద్‌, కోఠి - గండి మైసమ్మ, కోఠి - జగద్గిరిగుట్ట, సికింద్రాబాద్‌ - బాలాజీనగర్‌, మేడ్చల్‌ - సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ - దిల్‌సుఖ్‌నగర్‌ (107వీ/ఆర్‌), ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌ - మెహిదీపట్నం, మేడ్చల్‌ - ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌ - మెహిదీపట్నం, సికింద్రాబాద్‌ - అఫ్జల్‌గంజ్‌ (8 రూట్‌), సికింద్రాబాద్‌ - అఫ్జల్‌గంజ్‌ (7 రూట్‌), సికింద్రాబాద్‌ - జియాగూడ (2జే), కోఠి - మెహిదీపట్నం, కోఠి - మెహిదీపట్నం (49 ఎం),  సికింద్రాబాద్‌ - ఈసీఐఎల్‌ (మల్కాజిగిరి), సికింద్రాబాద్‌ - ఈసీఐఎల్‌ (17 రూట్‌), రాజేంద్రనగర్‌ - కోఠి (95), సుచిత్రా - అఫ్జల్‌గంజ్‌ (25ఎస్‌), కోఠి - లింగంపల్లి (216), అఫ్జల్‌గంజ్‌ - ఆరాంఘర్‌ (72 రూట్‌), ఎంజీబీఎస్‌ - బోరబండ (9ఎఫ్‌), సికింద్రాబాద్‌ - బోరబండ (10 ఎఫ్‌), సికింద్రాబాద్‌ - అఫ్జల్‌గంజ్‌ (రూట్‌ 1),  సికింద్రాబాద్‌ - హైటెక్‌ సిటీ,  కొండాపూర్‌ (10 హెచ్‌), మేడ్చల్‌ - పఠాన్‌చెరు, కోఠి - కొండాపూర్‌ (127), కోఠి - సికింద్రాబాద్‌ (40), సికింద్రాబాద్‌ - నాంపల్లి (20పీ), జేఎన్టీయూ - వేవ్‌రాక్‌ (195 డ) మార్గాల్లో  కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సులు నడిచాయి.

అందుబాటులోకి 15 బస్‌పాస్‌ కౌంటర్లు

సిటీ బస్సులు ప్రారంభమైన నేపథ్యంలో శనివారం నుంచి 15 బస్‌ పాస్‌ కౌంటర్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వి.వెంకటేశ్వర్లు తెలిపారు. ‘రెతిఫైల్‌, ఈసీఐఎల్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదీపట్నం, సీబీఎస్‌ టెర్మినల్‌, పటాన్‌చెరు, ఇబ్రహీంపట్నం, కేపీహెచ్‌బీ, షాపూర్‌నగర్‌, మేడ్చల్‌, శంషాబాద్‌, అఫ్జల్‌గంజ్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ కేంద్రాల్లో బస్‌ పాసులు, ఇతర సమాచారం తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు.

నియమాలు పాటించకపోతే సీజ్‌

కరోనా నియమాలు పాటించకపోతే బార్‌ అండ్‌ రెస్టారెంట్లను సీజ్‌ చేయడమే కాకుండా వాటి లైసెన్స్‌లను రద్దు చేస్తాం. ప్రతి బార్‌ ప్రవేశ ద్వారంలో విధిగా వినియోగదారులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి, బార్‌ లోపల భౌతికదూరం పాటించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి.  మాస్క్‌ లేనిదే లోనికి అనుమతించవద్దు. మూత్రశాలల్లో పరిశుభత్రపై తప్పనిసరిగా శ్రద్ధ పెట్టాలి.  మద్యం దుకాణాల వద్ద సిట్టింగ్‌ రూమ్‌లకు అనుమతి లేదు.

-ఈఎస్‌ సీలం శ్రీనివాస్‌

పార్కులు రీ ఓపెన్‌ 

పార్కులు సైతం నేటి నుంచి తెరుచుకోనున్నాయి. బల్దియా, అటవీ శాఖ, హెచ్‌ఎండీఏ అన్నీ కలిపి 1000కిపైగా పార్కులున్నాయి. అన్‌లాన్‌ సడలింపులో భాగంగా పార్కులు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో ఆహ్లాదం పంచేందుకు ఉద్యానవనాలు సిద్ధమవుతున్నాయి.


logo