e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home క్రైమ్‌ వేడుక ముగిసింది.. విషాదం మిగిల్చింది..

వేడుక ముగిసింది.. విషాదం మిగిల్చింది..

  • పబ్‌లో పార్టీ చేసుకొని తిరిగి వెళ్తూ.. మద్యం మత్తులో అతివేగంగా డ్రైవింగ్‌
  • అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు..
  • ఎంటెక్‌ విద్యార్థిని మృతి.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరో యువతి
  • స్వల్ప గాయాలతో బయటపడ్డ యువకులు
  • కొండాపూర్‌లో అర్ధరాత్రి ప్రమాదం.. శోకం నింపిన స్నేహితుల దినోత్సవం

ఒకరి దూకుడు మరొకరి ప్రాణాన్ని బలిగొంది. మద్యం మత్తు లో చూపిన నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదానికి దారి తీసింది. అతివేగం ఓ వేడుకను చివరికి విషాదంగా మిగిల్చింది. కొండాపూర్‌లో ఓ యువకుడు అత్యంత వేగంగా కారు నడపడంతో అదే కారులో ప్రయాణిస్తున్న యువతి ప్రాణాలు కోల్పోయింది. మరో యువతి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నది. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి.

ఫ్రెండ్‌షిప్‌ డే చేసుకుందామని..

మియాపూర్‌లోని మదీనాగూడలోని మై హోం జువెల్‌ అపార్టుమెంట్‌లో నివాసముంటున్న అభిషేక్‌ (21) శంకర్‌పల్లిలోని ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్‌లో బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు కెనడాలో ఉండగా.. అభిషేక్‌ మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాడు. అదే కళాశాలలో బీబీఏ పూర్తి చేసుకున్న తెల్లాపూర్‌లోని బోన్సాయ్‌ అపార్టుమెంట్‌కు చెందిన అశ్రిత(23) కెనడాలో ఎంటెక్‌ చేస్తున్నది. తనకు ఇటీవల సెలవులివ్వడంతో నగరానికి వచ్చింది. తిరిగి సెప్టెంబర్‌లో కెనడా వెళ్లాల్సి ఉంది. మరో స్నేహితురాలైన తరుణి(23) కూడా బీబీఏ పూర్తి చేసి రాయదుర్గంలోని వెల్ఫ్‌ఫార్గో కంపెనీలో పనిచేస్తున్నది. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా బయటకు వెళ్లి వేడుకలు జరుపుకోవాలని అనుకున్నారు.

హైటెక్స్‌ వద్ద స్నాట్‌ పబ్‌లో…

- Advertisement -

ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఆశ్రిత, తరుణిలతో పాటు మరో స్నేహితుడైన సాయి ప్రకాశ్‌లను ఎక్కించుకొని మైహోం జువెల్‌ అపార్టుమెంట్‌ నుంచి అభిషేక్‌ మాదాపూర్‌ హైటెక్స్‌ వద్ద ఉన్న స్నాట్‌ పబ్‌కు వెళ్లారు. అదే అపార్టుమెంట్‌కు చెందిన మరో ఇద్దరు మిత్రులైన చిన్మయ్‌, వివేక్‌ మరో కారులో అక్కడికి చేరుకున్నారు. వీరంతా రాత్రి పది నుంచి 11 వరకు అక్కడ గడిపి తిరిగి బయలుదేరారు. అభిషేక్‌, సాయి ప్రకాశ్‌ పబ్‌లో మద్యం సేవించారు. కారు ముందు భాగంలో అభిషేక్‌, సాయి ప్రకాశ్‌ కూర్చోగా, వెనక సీట్లో ఆశ్రిత, తరుణి కూర్చున్నారు. కొండాపూర్‌లోని మై హోం మంగళ అపార్టుమెంట్ల వద్దకు చేరుకోగానే అతివేగంగా వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మట్టి దిబ్బలను ఢీకొని నాలుగు పల్టీలు కొట్టింది. ముందు కూర్చున్న అభిషేక్‌, సాయి ప్రకాశ్‌ సీటు బెల్టు పెట్టుకోవడంతో ఎయిర్‌ బెలూన్లు తెరుచుకొని స్వల్పగాయాలపాలయ్యారు.

కారు వెనకసీట్లో కూర్చున్న ఆశ్రిత డోరులోంచి బయటపడి తీవ్ర గాయాలపాలైంది. వీరి వెనకనే వస్తున్న చిన్మయ్‌, వివేక్‌ కారు ప్రమాదాన్ని గుర్తించి ఆ నలుగురిని హుటాహుటిన సమీపంలో ఉన్న కిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆశ్రిత ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు వెల్లడించారు. తరుణి మాత్రం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నది. సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలంతో పాటు హైటెక్స్‌ రోడ్డులోని స్నాట్‌ పబ్‌లో సీసీటీవీ ఫుటేజీలు సేకరించి ప్రమాద వివరాలు సేకరిస్తున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌తో వీరికి పరీక్షలు నిర్వహించగా అభిషేక్‌ మద్యం తాగినట్టు రుజువైంది. అయితే, వెనక కూర్చున్న ఆశ్రిత, తరుణిలు కూడా సీటు బెల్టు పెట్టుకొని ఉంటే స్వల్ప గాయాలతో బయటపడి ఉండేవారని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు.

తాగి ప్రమాదం చేస్తే.. పదేండ్ల జైలు

తమ పిల్లలు ఎక్కడికి వెళుతున్నారో, ఎప్పుడు తిరిగి ఇంటికి చేరుతున్నారో తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. మద్యం తాగి వాహనాలు నడపొద్దని నచ్చజెప్పాలి. ఒకవేళ తాగితే… ఆ కారును లేదా బైకును అక్కడే ఉంచి క్యాబ్‌లో ఇంటికి రమ్మని చెప్పాలి. కానీ, మందు తాగి నడిపే వారంతా టెర్రరిస్టులతో సమానం. మత్తులో ఎవరి మీదికి ఆ బండిని తోలుతారో వారికే తెలియదు. తాగి ప్రమాదానికి కారణమయ్యారని తేలితే 304 పార్ట్‌-2 కింద 10 ఏండ్ల జైలు శిక్ష తప్పదు. కొండాపూర్‌ ప్రమాదం కేసులో ఆధారాలు సేకరిస్తున్నాం. కారులో ప్రయాణించే సమయంలో ముందు కూర్చున్న వారే కాకుండా వెనక కూర్చున్న వారు కూడా సీటు బెల్టును ధరిస్తే క్షేమం.- సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌

మద్యం తాగే అలవాటు ఉంటే డ్రైవర్‌ను పెట్టుకోండి

మద్యం తాగే అలవాటు ఉంటే సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి తప్పకుండా డ్రైవర్‌ను పెట్టుకోండి. లేదా ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించండి. అంతేగాని మద్యం సేవించి వాహనం నడిపితే జైలు ఖాయం. ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే డయల్‌ 100, రాచకొండ వాట్సాప్‌-9490617111, హాక్‌-ఐలో ని సిటిజన్‌ పోలీసింగ్‌ ఆప్షన్‌ను సంప్రదించండి. కారులో ప్రయాణించే సమయంలో అందరూ సీటు బెల్టు ధరించాలి. ఇది ప్రమాద సమయంలో కాపాడుతుంది.-మహేశ్‌ భగవత్‌, రాచకొండ పోలీసు కమిషనర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana