e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home హైదరాబాద్‌ తక్కువ ధరకే ఇండ్లు..

తక్కువ ధరకే ఇండ్లు..

  • భారీగా కొత్త ప్రాజెక్టులు
  • చదరపు అడుగు ధర రూ.4,240 మాత్రమే..
  • అమ్మకాల్లో హై-ఎండ్‌ సెగ్మెంట్‌ వాటా 42 శాతం
  • కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ మార్కెట్‌ జోరు. .
  • అనరాక్‌ అధ్యయన నివేదికలో వెల్లడి..

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): దేశీయ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార రంగంలో హైదరాబాద్‌ మరోసారి తిరుగులేని రారాజులా నిలిచింది. కొవిడ్‌ వల్ల ఎన్నో ప్రతికూలతలు ఎదురైనప్పటికీ హైదరాబాద్‌ మార్కెట్‌లో వృద్ధి కొనసాగడమే ఇందుకు కారణమని ప్రముఖ అధ్యయన సంస్థ అనరాక్‌ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నై, కోల్‌కతా కంటే హైదరాబాద్‌లోనే కొత్త ప్రాజెక్టులు అధికంగా ప్రారంభమయ్యాయని వెల్లడించింది.

హైదరాబాద్‌లో 8,850, ముంబైలో 6,880, బెంగళూరులో 6,690, పుణెలో 4,920, ఢిల్లీలో 3,820 కొత్త ప్రాజెక్టులు ప్రారంభమైనట్టు తెలిపింది. ఇండ్ల ధరలు కూడా తక్కువగా ఉండటంతో ప్రజలు తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు హైదరాబాద్‌ ఎంతో అనువుగా ఉన్నదని పేర్కొన్నది. చదరపు అడుగు సగటు ధర ముంబైలో రూ.10,750, పుణెలో రూ.5,580, బెంగళూరులో రూ.5,060, చెన్నైలో రూ.4,990, కోల్‌కతాలో రూ.4,400 పలుకుతోందని, కానీ హైదరాబాద్‌లో రూ.4,240 మాత్రమే ఉన్నదని వివరించింది.

అమ్మకాల్లోనూ హైదరాబాదే టాప్‌

- Advertisement -

ఇండ్ల అమ్మకాల్లో కూడా హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచినట్లు అనరాక్‌ స్పష్టం చేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 10,550 యూనిట్లు, రెండో త్రైమాసికంలో 3,790 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌లో ఇండ్ల అమ్మకాలు క్యూ1 తో పోల్చితే క్యూ2లో 26 శాతం తగ్గినప్పటికీ ఇది చాలా తక్కువేనని పేర్కొంది. ఇదే సమయంలో ఇండ్ల అమ్మకాలు ముంబైలో 64%, పుణెలో 64%, ఢిల్లీలో 61%, బెంగళూరులో 59%, చెన్నైలో 44%, కోల్‌కతాలో 43% తగ్గినట్లు వివరించింది.

భారీ అపార్ట్‌మెంట్లకే డిమాండ్‌

దేశంలోని ఏడు ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోని ఇన్వెంటరీలో రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్‌ కలిగిన యూనిట్లే 78 శాతం మేరకు ఉన్నట్లు అనరాక్‌ తేల్చింది. భారీ అపార్ట్‌మెంట్లకు అధిక డిమాండ్‌ ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. వర్క్‌ ఫ్రమ్‌ హోం వల్ల చాలా మంది ఉద్యోగులు ఎక్కువ సమయం ఇండ్లలోనే గడపాల్సి వస్తుండటంతో అధిక విస్తీర్ణం కలిగిన ఇండ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. దీంతో మొత్తం అమ్మకాల్లో హై-ఎండ్‌ సెగ్మెంట్‌ వాటా 42 శాతానికి పెరిగినట్లు స్పష్టం చేసింది.

మౌలిక వసతులు అద్బుతం

హైదరాబాద్‌లో మౌలికవసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌ క్షేత్రస్థాయిలో మౌలికవసతుల కల్పనను పర్యవేక్షిస్తున్నారు. ఫలితంగా చాలా మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తుండటంతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ వృద్ధిరేటు క్రమంగా పెరుగుతున్నది. కోకాపేట హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో జరుగనున్న భూముల అమ్మకాలు ఇక్కడి మార్కెట్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్తాయి. ఐటీ ఉద్యోగులు సొంతింటి కోసం ఆసక్తి చూపుతుండటంతో హైదరాబాద్‌లోని రియల్‌ మార్కెట్‌ పుంజుకుంటున్నది. తాజాగా భూముల విలువను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచిదే అయినప్పటికీ రిజిస్ట్రేషన్‌ ఫీజులను పెంచకుండా ఉంటే బాగుంటుంది. – ముప్పా వెంకయ్య చౌదరి, డైరెక్టర్‌, ముప్పా ప్రాపర్టీస్‌

ప్రభుత్వ ప్రోత్సాహకాలతో మరింత ఊతం

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పురోభివృద్ధికి ప్రభుత్వం విధానాలు ఇతోధికంగా దోహదం చేస్తున్నాయి. అనుమతుల విధానాన్ని సరళీకృతం చేయడం, ఫీజులను వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు వీలుకల్పించడంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు బిల్డర్లు భారీగా ముందుకొస్తున్నారు. నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగినా ప్రభుత్వం బిల్డర్లను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతోంది. దీంతో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్‌లోనే తక్కువ ధరకు ఇండ్లు, అపార్టుమెంట్లు లభిస్తున్నాయి. ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మరింత జోరందుకొంటుంది. – చెరుకు రామచంద్రారెడ్డి, డైరెక్టర్‌, ఆర్వీ నిర్మాణ్‌

హైదరాబాద్‌లో మార్కెట్‌ బాగుంది

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ చాలా బాగుంది. కరోనా వల్ల దేశవ్యాప్తంగా రకరకాల ఇబ్బందులున్నప్పటికీ ఇక్కడి మార్కెట్‌లో వృద్ధిరేటు పెరుగుతూనే ఉంది. మేము బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో ప్రాజెక్టులు చేస్తున్నాం. మా ప్రాజెక్టులు బెంగళూరులో కంటే హైదరాబాద్‌లోనే చాలా వేగంగా సాగుతున్నాయి. చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నప్పటికీ డిమాండ్‌ బాగానే ఉండడంతో కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు బిల్డర్లు ముందుకొస్తూనే ఉన్నారు. – కేవీ రామారావు, వైస్‌ చైర్మన్‌, సుమధుర గ్రూప్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana