e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home హైదరాబాద్‌ రియల్‌ రారాజు..

రియల్‌ రారాజు..

రియల్‌ రారాజు..
  • హెచ్‌ఎండీఏ భూములు.. హాట్‌ కేకులు..!
  • ఫిదా అవుతున్న బిల్డర్లు.. పోటాపోటీగా కొనుగోళ్లు
  • రికార్డు స్థాయిలో పలుకుతున్న ధరలు
  • అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ ప్రాజెక్టులు
  • ఇతర మెట్రో నగరాల బిల్డర్లకు దీటైన పోటీ
  • అత్యధికంగా సొంతం చేసుకుంటున్నది మనోళ్లే..

ఎవరైనా ఎలాంటి వివాదాలు లేని క్లియర్‌ టైటిల్‌ ఉన్న భూములనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాంటి భూములను అత్యాధునిక మౌలిక వసతులతో లేఅవుట్‌లుగా అభివృద్ధి చేయడంలో హెచ్‌ఎండీఏ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఎక్కడ లేఅవుట్‌ చేసినా విక్రయించినా వాటికి ఉన్న డిమాండ్‌ అంతా.. ఇంతా కాదు. అమ్మకానికి పెడితే హాట్‌ కేకుల్లా సొంతం చేసుకునేందుకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, పెట్టుబడి దారులు పోటీ పడుతుంటారు. అంతేకాకుండా నిర్మాణ రంగంలోనూ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్లు అద్భుతమైన ప్రాజెక్టులను చేపడుతూ కొనుగోలు దారులను ఆకట్టుకుంటున్నారు.

ఉప్పల్‌ భగాయత్‌లో 2019 ఏప్రిల్‌లో హెచ్‌ఎండీఏ గజం కనీస ధరను రూ.28వేలుగా నిర్ణయిస్తే అత్యధికంగా రూ.73,900, అత్యల్పంగా రూ.57వేలు పలికింది. తాజాగా కోకాపేటలో హెచ్‌ఎండీఏ 533 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న నియోపొలిస్‌ లేఅవుట్‌లో 8 ప్లాట్లకు నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో ఎకరం కనీస ధరను రూ.25 కోట్లుగా నిర్ణయిస్తే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పోటీపడి అత్యధికంగా రూ.60.2కోట్లు, అత్యల్పంగా రూ.31.20 కోట్లు వెచ్చించి భూములను కొనుగోలు చేశారు. అదే నమ్మకం కోకాపేటలో సైతం పునరావృతమైంది. 8 ప్లాట్లకు ఒకేసారి 60 మంది బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పోటీపడ్డారు.

ఖానామెట్‌ భూముల కొనుగోలుకు పోటాపోటీ..

- Advertisement -

ఖానామెట్‌ భూములను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టగా.. కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు పోటీ పడ్డాయి. ఎకరాకు అత్యధికంగా రూ.55 కోట్లు, అత్యల్పంగా 43.60 కోట్లు ధర పలికింది. క్లియర్‌ టైటిల్‌ కలిగిన భూములు కావడంతో పాటు టీఎస్‌ఐఐసీ అన్ని రకాల మౌలిక వసతులతో లేఅవుట్‌ను అభివృద్ధి చేయడంతో హైదరాబాద్‌కు చెందిన కొనుగోలు దారులు పోటీపడి భూములను సొంతం చేసుకున్నారు.

రాజీలేకుండా.. మౌలిక వసతులు

ప్రణాళికాబద్దమైన పట్టణీకరణే లక్ష్యంగా హెచ్‌ఎండీఏ మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడటం లేదు. కోకాపేటలో 533 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న నియోపొలిస్‌ లేఅవుట్‌ కోసం ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇందులో రోడ్ల వెడల్పు 150, 120 అడుగులతో నిర్మిస్తుండగా, భూ గర్భంలోనే విద్యుత్‌, మంచినీటి పైపులైన్లను వేస్తున్నారు. వీటికి తోడు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌, మంచినీటి రిజర్వాయర్ల కోసం 5 ఎకరాలకు పైగా భూములను ఆయా సంస్థలకు కేటాయించారు. ఈ లేఅవుట్‌ నుంచి ఔటర్‌ రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తూ ట్రంపెట్‌ను నిర్మిస్తున్నారు. ఇలా అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పిస్తుండటంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మొదలు కొని పలు సంస్థలు హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో భూములను కొనుగోలు చేసేందుకు ధర విషయంలో వెనుకడుగు వేయడం లేదు.

రియల్‌ రంగంలో మనోళ్లదే హావా…

భూములు, ప్లాట్ల కొనుగోలులోనే కాదు.. నిర్మాణ రంగంలోనూ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్లు అద్భుతమైన ప్రాజెక్టులను చేపడుతూ కొనుగోలు దారులను ఆకట్టుకుంటున్నారు. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఏ మాత్రం తీసిపోకుండా నగరానికి పడమర దిక్కున ఐటీ కారిడార్‌లో అత్యంత ప్రతిష్టాత్మమైన ప్రాజెక్టులను హైదరాబాద్‌ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న బిల్డర్లు చేపడుతున్నారు. మాదాపూర్‌ హైటెక్‌ సిటీలో సైబర్‌ టవర్స్‌ను ముంబాయికి చెందిన ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మిస్తే ఆ తర్వాత నగరానికి చెందిన బిల్డర్లు అంతకు మించిన ప్రాజెక్టులను ఐటీ కారిడార్‌లో పదుల సంఖ్యలో చేపట్టారు. మాదాపూర్‌, కొండాపూర్‌, రాయిదుర్గం, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లో హైరైజ్‌ భవనాలు 30 నుంచి 58 అంతస్థుల వరకు చేపట్టారు. హైదాబాద్‌ టాప్‌మోస్ట్‌ బిల్డర్లుగా ఉన్న మైహోం, అపర్ణ, రాజపుష్ప, జయభేరి, రాంకీ, అరబిందో వంటి కంపెనీలు దేశంలోని ఇతర మెట్రో నగరాలకు చెందిన బిల్డర్లకు దీటుగా ప్రాజెక్టులను చేపడుతున్నారు. 10 నుంచి 100 ఎకరాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలు, 30 నుంచి 60 అంతస్థుల లోపు భవనాలు నిర్మిస్తున్నారు. బెంగళూరు, ముంబాయి, ఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు హైదరాబాద్‌లోనూ భారీ ప్రాజెక్టులు చేపడుతున్నా, వారితో పోటీపడుతూ కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే ఉన్నాయి.

కోకాపేటలో సింహాభాగం ప్లాట్లన్నీ స్థానిక బిల్డర్లవే..!

కోకాపేట నియోపొలిస్‌ లేఅవుట్‌లో ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచిన 8 ప్లాట్లను సొంతం చేసుకున్న వారిలో బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్‌ సంస్థ మినహాయిస్తే మిగతా వారంతా హైదరాబాద్‌కు చెందిన బిల్డర్లే కావడం గమనార్హం. తాజాగా జరిగిన వేలంలో 60 మంది వివిధ నగరాలకు చెందిన బిల్డర్లు ఉండగా, అందులో పోటా పోటీగా వేలం పాటలో పాల్గొని ప్లాట్లను దక్కించుకున్నది మాత్రం ఇక్కడి బిల్డర్లే. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై ఉన్న నమ్మకానికి తోడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విధానాలతో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. దీనికి నిదర్శనం గత వారం రోజుల్లోనే ఆనరాక్‌ ప్రాపర్టీస్‌, నైట్‌ ఫ్రాంక్‌ వంటి ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అధ్యయన సంస్థలు దేశంలోనే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఎంతో పాజిటివ్‌గా ఉన్నత స్థాయి వృద్ధి రేటుతో ఉందని తమ నివేదికల్లో వెల్లడించాయి. ప్రారంభించిన ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి, గడువులోగా కొనుగోలు దారులకు అందజేయడంలో బిల్డర్లు నిర్మాణ పనులు పక్కాగా చేపడుతున్నారు. ఇదే కొనుగోలుదారులకు నమ్మకాన్ని కలిగిస్తుండటంతో దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వారు ఇక్కడ సొంతంగా ప్లాట్లను, ఇండ్లను కొనుగోలు చేస్తున్నారని రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

మారుతున్న ఉప్పల్‌ భగాయత్‌ రూపురేఖలు

హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్‌భగాయత్‌ లేఅవుట్‌లోనూ అత్యంత మెరుగైన మౌలిక వసతులు కల్పించారు. కనీసం 40 అడుగులు మొదలుకొని 120 అడుగుల వెడల్పు రోడ్లు ఉన్నాయి. దీనికి తోడు మూసీ పొడువునా 3 కి.మీ మేర ల్యాండ్‌ స్కేపింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌లతో పార్కులను అద్భుతంగా నిర్మించారు. వీటికి తోడు భవన నిర్మాణాల అనుమతులు సైతం అత్యంత వేగంగా వస్తుండటంతో బిల్డర్లు ఈ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఉప్పల్‌ భగాయత్‌లో భవన నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. ఒకేసారి పదుల సంఖ్యలో భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండటంతో లేఅవుట్‌ రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. బిల్డర్లు, కొనుగోలు దారులు ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌లో నిర్మాణాలు చేపట్టేందుకు, కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రియల్‌ రారాజు..
రియల్‌ రారాజు..
రియల్‌ రారాజు..

ట్రెండింగ్‌

Advertisement