గురువారం 04 మార్చి 2021
Hyderabad - Jul 15, 2020 , 00:03:38

క్షేమంగా ఇంటికి చేరుకోండి

క్షేమంగా ఇంటికి చేరుకోండి

ఆరు నెలల్లో అతివేగంతో 90 మంది మృత్యువు పాలు

మూడింతలు పెరిగిన ప్రమాదకర డ్రైవింగ్‌ కేసులు

25 శాతం పెరిగిన ఉల్లంఘనలు

మరణాలను కట్టడి చేసేందుకు సమన్వయంతో పనిచేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో కొద్ది మంది చేస్తున్న పొరపాట్లు మిగతావారికి అశనిపాతంలా మారుతున్నాయి. మృత్యువును కొనితెస్తున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలపై నగరవాసుల్లో అవగాహన పెరిగి వారు ఆచరణలో పెడుతున్నప్పటికీ డేంజరస్‌ డ్రైవింగ్‌ కేసుల నమోదు మాత్రం ఆందోళనపరుస్తున్నది. 2019 మొదటి 6 నెలల్లో కేవలం 25,852 డేంజరస్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదైతే ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు అవి 89,871 కి పెరిగాయి. ఓ వైపు హైదరాబాద్‌లో ప్రమాదాల సంఖ్య తగ్గినప్పటికీ ఉల్లంఘనల సంఖ్య గత ఏడాది కంటే ఈ సారి భారీ స్థాయిలో ఉండడం కలవర పెడుతున్నది.

ప్రాణాలు తీస్తున్నది అతివేగమే

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాలు కొద్దిగా తగ్గాయి. గత ఏడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాద మరణాలు 23  శాతం తగ్గాయి. అందులో పాదచారులకు సంబంధించి 38 శాతం తగ్గాయి. జనవరి నుంచి జూన్‌ వరకు రోడ్డు ప్రమాద గణాంకాలను మంగళవారం నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ మీడియాకు విడుదల చేశారు.  ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాలు పూర్తిస్థాయిలో తగ్గించగలమని, ఈ విషయాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలని సూచించారు. గత ఆరు నెలలుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 106  మంది మృత్యువాత పడ్డారు. వారిలో 90 మంది మరణానికి అతివేగమే కారణం. 

పాదచారులు క్షేమం

రోడ్డు ప్రమాదాలలో పాదచారుల మరణాలు 38 శాతం తగ్గుముఖం పట్టినట్టు నివేదికలో వెల్లడైంది. వాటిని మరింత తగ్గిస్తే ప్రమాదాల సంఖ్య గణనీయంగా పడిపోతుందని పోలీసులు భావిస్తున్నారు.

రెండున్నర లక్షల మంది విద్యార్థులకు అవగాహన 

నగరంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే 60 ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్‌లుగా ట్రాఫిక్‌ విభాగం గుర్తించింది. ఆయా చోట్లలో ఎలాంటి చర్యలు తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చనే విషయమై పలు ప్రభుత్వ శాఖలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నది. విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగించే ప్రత్యేక ప్రణాళికలో భాగంగా 2019-20 విద్యా సంవత్సరంలో 578  విద్యా సంస్థలకు చెందిన 2,52,739  మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. 

కట్టడి కోసం నిరంతర యత్నం

నగరాన్ని రోడ్డు ప్రమాద రహితంగా తీర్చి దిద్దాలని ట్రాఫిక్‌ విభాగం తీవ్రంగా కృషిచేస్తున్నది. ఇందుకు గాను జీహెచ్‌ఎంసీ, జలమండలి సహా అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాలకు కారణాలను విశ్లేషిస్తూ వాటిని పరిష్కరించేందుకు నిరంతర కసరత్తు చేస్తున్నది. ఓ వైపు ట్రాఫిక్‌ నిబంధనలు, ఉల్లంఘనలపై అవగాహన కలిగిస్తూనే సీసీ కెమెరాల ద్వారా, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కెమెరాల ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. 

జనవరి నుంచి జూన్‌-రోడ్డు ప్రమాదాలు

సంవత్సరం 2018 2019 2020 శాతం

మొత్తం మరణాలు 150 137 106 23

పాదచారుల మరణాలు 63 53 33 38

జనవరి నుంచి జూన్‌ వరకు ఉల్లంఘనలు 

ఉల్లంఘనలు 2019 2020

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా 7612 10514

ముగ్గురు ప్రయాణం 43759 44098

రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ 105346 87691

నంబర్‌ప్లేట్‌లేని, సరిగ్గా లేని 63235 69536

రాంగ్‌ పార్కింగ్‌ 123460 153207

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ 10684 12019

మైనర్‌ డ్రైవింగ్‌ 2732 1049

డేంజరస్‌ డ్రైవింగ్‌ 25852 89871

సిగ్నల్‌ జంపింగ్‌ 19540 16373

హెల్మెట్‌ లేకుండా 1812198 2226625

మొత్తం 22,14,418 2710983

VIDEOS

తాజావార్తలు


logo