శుక్రవారం 03 జూలై 2020
Hyderabad - May 26, 2020 , 00:10:55

112 ఏండ్ల తర్వాత.. సాదాసీదాగా రంజాన్‌ వేడుకలు

112 ఏండ్ల తర్వాత.. సాదాసీదాగా రంజాన్‌ వేడుకలు

కరోనా నేపథ్యంలో రంజాన్‌ వేడుకలు సాదాసీదాగా జరుపుకున్నారు. 1908లో నగరంలో మూసీ వరదల తర్వాత సుమారు 112 ఏండ్లకు సామూహిక ప్రార్థనలకు దూరంగా పండుగ చేసుకున్నారు. సోమవారం చార్మినార్‌ పరిసరాలు నిర్మానుష్యంగా ఇలా కనిపించాయి.     ముస్లింలు పవిత్ర రంజాన్‌ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. సరిగ్గా 112 సంవత్సరాల తర్వాత  హైదరాబాద్‌లో చరిత్ర పునరావృతమైంది. 1908లో మూసీ వరదలు సృష్టించిన ప్రళయం కారణంగా ముస్లింలు రంజాన్‌ పర్వదినాన్ని సాదాసీదాగా నిర్వహించారు. ఇప్పుడు కరోనా వైరస్‌  సృష్టించిన కొవిడ్‌-19 ప్రళయంతో ఎంతో కోలాహాలంగా జరుపుకోవాల్సిన పవిత్ర దినాన్ని ఇంటిపట్టున ఉండి నిర్వహించుకోవాల్సి వచ్చింది. నాడు మూసీ ప్రళయంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, నేడు కరోనా రక్కసి మానవజాతి మొత్తాన్నే గడగడలాడిస్తున్నది. కరోనా వ్యాప్తి చెందకుండా రంజాన్‌ పవిత్ర దినాన్ని ముస్లింలు ఇండ్లలోనే జరుపుకొన్నారు.

  పవిత్ర రంజాన్‌ మాసాన్ని ముస్లింలు అత్యంత సాదాసీదాగా నిర్వహించుకున్నారు. రంజాన్‌ మాసంలో నెల రోజుల ఉపవాస దీక్షలు పూర్తయ్యాక ‘ఈద్‌-ఉల్‌-ఫితర్‌' సామూహిక ప్రార్థనలను  భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ముస్లింలతో కిటకిటలాడే మీర్‌ ఆలం ఈద్గా, మక్కా మసీదులు సాధారణంగా కన్పించాయి.  ఈ పండుగను పురస్కరించుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించటం ఆనవాయితీ. లాక్‌డౌన్‌ నిబంధనలు అమలవుతున్న దృష్ట్యా ముస్లింలు తమ ఇండ్లలోనే నమాజ్‌లు చేసుకున్నారు. 112 ఏండ్ల అనంతరం, రంజాన్‌ను ఇలా జరుపుకొన్నారు. మూసీ వరదలు సంభవించినప్పుడు కూడా ఇలాగే జరుపుకొన్నారు. ఆ తరువాత ఈ వేడుక ఇలా పునరావృతమైంది. కరోనా వ్యాప్తి క్రమంలో సామూహిక ప్రార్థనలకు ముస్లింలు దూరంగా ఉన్నారు. 

రంజాన్‌ మాసంలోని చివరి రోజైన ఈదుల్‌ ఫితర్‌ను ఇళ్లలోనే అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఈద్‌ ముబారక్‌ తెలియజేసుకున్నారు. రంజాన్‌ వేడుకలు సోమవారం నిరాడంబరంగా జరిగాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎక్కడ కూడా సామూహిక ప్రార్థనలు జరుగలేదు. ఎవరి ఇండ్లలో వారే ప్రార్థనలు నిర్వహించుకున్నారు. మసీదులలో కేవలం ఇమామ్‌లు, మౌజన్‌లు, కొద్దిపాటి సంఖ్యలో మత పెద్దలు మాత్రమే నమాజులో పాల్గొన్నారు. గతంలో స్థానికంగా ఉన్న ఈద్గాలలో, మున్సిపల్‌ మైదానాలలో వేల మందితో రంజాన్‌ ప్రార్థనలు జరిగేవి. ఒకరినొకరు అలయ్‌ బలయ్‌ అంటూ ఆలింగనం చేసుకునేవారు. అందుకు భిన్నంగా ఈసారి పండుగ జరిగింది.  ప్రస్తుతం ఫోన్లు, ఆన్‌లైన్‌ మాధ్యమాలలో మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. గతంలో మాదిరిగా ఈ రంజాన్‌ మాసంలో కరోనా వైరస్‌ నేపథ్యంలో చార్మినార్‌ మక్కా మసీదుతో పాటు మీర్‌ అలం ఈద్గా, మాదన్నపేట్‌ ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించకుండా ముస్లిం మత పెద్దల సూచనల మేరకు ఇళ్లల్లోనే ప్రార్థనలు నిర్వహించి దైవానుగ్రహం పొందడానికి ప్రయత్నించారు. ముస్లింలు శ్మశాన వాటికలో తమ పెద్దల సమాధుల వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం సన్నిహితులు, బంధువుల ఇళ్లల్లో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షీర్‌ ఖుర్మాలను అందించారు. 

ఉన్నతాధికారుల పర్యవేక్షణ  : మక్కా మసీదుతోపాటు ఇతర మసీదుల్లో రంజాన్‌ పర్వదినం రోజున నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడానికి ముస్లిం ఎవరూ వీధులుదాటి రాకుండా పోలీస్‌ ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు.  కరోనా వైరస్‌ దృష్ట్యా వారం రోజులుగా పోలీస్‌ ఉన్నతాధికారులు మత పెద్దలతోపాటు స్థానిక ప్రముఖుల ద్వారా ముస్లింలకు సందేశాలను అందించారు.  మక్కా మసీదులో రంజాన్‌ పర్వదినం ప్రత్యేక ప్రార్థనలు ముగిసిన అనంతరం చార్మినార్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు పోలీస్‌ ఉన్నతాధికారులకు షీర్‌ఖుర్మాను అందించి ఈద్‌ ముబారక్‌ తెలియజేశారు.  కార్యక్రమంలో నగర సంయుక్త కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌తోపాటు పోలీసు అధికారులు అనిల్‌కుమార్‌, తరుణ్‌జోషి, బాబురావు బందోబస్తును పర్యవేక్షించారు


logo