శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Aug 08, 2020 , 23:02:39

వర్షాకాలం.. జర జాగ్రత్త

వర్షాకాలం.. జర జాగ్రత్త

ఏమాత్రం అజాగ్రత్త తగదని హితవు 

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన 

జ్వరం, జలుబు, దగ్గు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వర్షాలు ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధులు మొదలయ్యాయి. ముఖ్యంగా డెంగీ, మలేరియా, డయేరియా, వైరల్‌ ఫీవర్‌, చికున్‌గున్యా తదితర వ్యాధులు సీజనల్‌ వర్షాలతో మొదలవుతాయి. సాధారణంగా సీజనల్‌లో వాటర్‌ బాండ్‌ డిసీజస్‌ ఎక్కువగా ప్రబలుతాయి. వీటితో పాటు దోమ కాటు వల్ల కూడా సీజనల్‌ వ్యాధులు సోకుతాయి. వర్షాలు కురిసినప్పుడు భూమిలో ఉన్న బ్యాక్టీరియా ఉపరితలానికి వచ్చి నీటిలో కలుస్తుంది. ఈ క్రమంలో సాధారణంగా వానకాలంలో నీరు కలుషితమవుతుంది. ఈ నీటిని తాగడం మూలంగా డయేరియా, కలరా, వాంతులు, విరేచనాలు, కామర్లు, రకరకాల ఇన్‌ఫెక్షన్లు, స్వైన్‌ ఫ్లూ వంటి వైరస్‌లు వ్యాపిస్తాయి. అంతే కాకుండా వర్షం నీరు నిలవడంతో దోమల వృద్ధి కూడా పెరుగుతుంది. ఫలితంగా డెంగీ, మలేరియా, చికున్‌గున్యా తదితర విషజ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని నల్లకుంట ఫీవర్‌ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. సీజనల్‌ వ్యాధులతో వైరల్‌ ఫీవర్‌, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుత పాండమిక్‌లో సీజనల్‌ వ్యాధులు, కరోనా లక్షణాలను గుర్తించడం కొంత కష్టమేనని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో ప్రతిఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఏ చిన్న సమస్య ఎదురైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్‌ శంకర్‌ సూచించారు. సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు ఉంటే మూడు రోజుల్లో తగ్గుతున్నాయి. అలా తగ్గకుంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

డెంగీ లక్షణాలు..

డెంగీ దోమ కాటుతో వస్తుంది. ఈ దోమలు మురికి నీటిలో కాకుండా స్వచ్ఛమైన నీటిలో వృద్ధి చెందుతాయి. అంటే ఎక్కువగా ఇండ్లు, కార్యాలయాలు, కొబ్బరి పీచు, రబ్బరు టైర్లు, కూలర్లు, కిచెన్‌ సింక్‌ల్లో ఈ దోమలు తిష్ట వేస్తాయి. ఇవి పగలు సమయంలోనే మనుషులను కుడుతాయి. 

డెంగీతో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పడిపోతుంది. ఐదు రోజుల నుంచి వారం వ్యవధిలో ఇది తగ్గుముఖం పడుతుంది. డెంగీ దోమలు వృద్ధి చెందకుండా ఉండాలంటే ఇండ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కూలర్‌లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలి. కనీసం వారానికి ఒక సారైనా ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను శుభ్రంగా కడుగాలి. 

సీజనల్‌ లక్షణాలు.. 

జ్వరం సాధారణం నుంచి తీవ్రంగా ఉంటుంది

మూడు నుంచి ఐదు రోజుల్లో తగ్గుముఖం పడుతుంది

ముక్కు కారుతుంది

కఫంతో కూడిన దగ్గు వస్తుంది

గొంతునొప్పి ఉంటుంది

వాంతులు, విరేచనాలు ఉంటాయి  

తల, ఒళ్లు, కీళ్ల నొప్పులు ఉంటాయి

మలేరియా..

మలేరియా కూడా దోమకాటుతోనే వస్తుంది. ఎక్కువగా రాత్రి సమయంలో జ్వరం తీవ్రంగా ఉండడం, చలి జ్వరంతో వణుకు రావడం మలేరియా ముఖ్య లక్షణం. మూడు నుంచి ఐదు రోజుల్లో ఈ జ్వరం తగ్గుతుంది. దోమలు లేకుండా జాగ్రత పడితే మలేరియా బారిన పడకుండా తప్పించుకోవచ్చు. 

స్వైన్‌ఫ్లూ..

జలుబు, జ్వరం దీని ప్రధాన లక్షణం. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. సకాలంలో చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఈ వైరస్‌ ఎక్కువగా చలికాలంలో వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన మూడు రోజుల్లోపు చికిత్స తీసుకోవాలి. ఐదు నుంచి వారం రోజుల్లో వైరస్‌ తగ్గుముఖం పడుతుంది.