మంగళవారం 07 జూలై 2020
Hyderabad - Jun 01, 2020 , 00:25:26

నగరంలో వర్ష బీభత్సం

నగరంలో వర్ష బీభత్సం

నగరంలోని పలు ప్రాంతాల్లో  భారీవర్షం కురిసింది. 

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో గ్రేటర్‌లో

మరో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం గ్రేటర్‌ పరిధిలోని రామచంద్రాపురంలో అత్యధికంగా 7.0 సెం.మీ., హయత్‌నగర్‌లో 6.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలను అప్రమత్తం చేసింది.  267 మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్‌లు, 16 డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచినట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. నగర పరిధిలోని ప్రతి మ్యాన్‌హోల్‌కూ ఒక జీహెచ్‌ఎంసీ బాధ్యుడిని నియమించామన్నారు. ఎక్కువగా నీరు నిలిచే 30 లోతట్టు ప్రాంతాల్లో మోటార్లను ఏర్పాటు చేశామన్నారు. 70 జేసీబీలను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కేబీఆర్‌ పార్కు వద్ద చేపట్టిన సహాయక చర్యలను మేయర్‌ పరిశీలించారు. 

హైదరాబాద్ : వాన దంచికొట్టింది. ఆదివారం ఉదయం నుంచే మేఘావృతమై ఉన్న నగరంలో మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి లక్షదీవుల వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక, కేరళ మీదుగా 0.9 కి.మీల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌లో వాన కురువగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని రామచంద్రాపురంలో అత్యధికంగా 7 సెం.మీలు, హయత్‌నగర్‌లో 6.6 సెం.మీలు, శివరాంపల్లిలో అత్యల్పంగా 1.0 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ అధికారులు తెలిపారు. 

రాగల 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా, మరో 24 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉండటంతో మరో మూడు రోజులు గ్రేటర్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. వర్షం కారణంగా గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదివారం నగరంలో గరిష్ఠం 37.3 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠం 29.6 డిగ్రీలు, గాలిలో తేమ 95 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 


logo