మంగళవారం 07 జూలై 2020
Hyderabad - May 29, 2020 , 03:29:31

నీటి వనరులను సంరక్షించాల్సిన ప్రతిఒక్కరి బాధ్యత

నీటి వనరులను సంరక్షించాల్సిన ప్రతిఒక్కరి బాధ్యత

మెహిదీపట్నం :  జలాన్ని పొదుపుగా వాడకపోతే భవిష్యత్‌ తరాలకు నీటి సంక్షోభం తలెత్తుతుంది. నీటి వనరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. అందుకోసం  ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన పెంచడానికి జలయండలి అధికారులు నడుంబింగించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి సంరక్షణే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.  దీని కోసం ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజల్లో అవగాహన పెంచి ఆయా ప్రాంతాల్లో ఎక్కువ మంది ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా కింది స్థాయి సిబ్బందితో ప్రచారం ప్రారంభించారు.

వర్షం నీటిని ఒడిసి పట్టుకుని వాడుకుంటే భూగర్భ జలాల మట్టాలు పెరుగుతాయని, తద్వారా నీటి నిలువలకు కొదవ ఉండదని  సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.   వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తాయని, వీటి మరమ్మతుల కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.  జలమండలి ఎండీ ఆదేశానుసారం డివిజన్‌ -3లో డ్రైనేజీ ఎక్కువ పొంగి పొర్లే ప్రాంతాలను గుర్తించి అక్కడ వెంటనే మరమ్మతులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వేసవిలో నీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జీఎం తిప్పన్న తెలిపారు.

కాలనీలు, బస్తీల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలి

  ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.  భూగర్భ జలాల మట్టాలు పెరగాలంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. ఇందుకు గాను  వర్షాకాలంలో తమ ఇంటి పరిసరాల్లో  ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే వర్షం నీరు ఇంకుడు గుంతల ద్వారా భూగర్భంలోకి వెళ్లి నీటి మట్టం పెరుగుతుంది.

ప్రజలకు సహకరిస్తాం

 ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే జలమండలి తరుపున వారికి పూర్తి సహాయ సహకారాలను అందచేస్తాం. ప్రజలు నీటి ప్రాధాన్యతను గుర్తించి , నీటిని వాడాలి. అనవసరంగా నీటిని పారబోయకుండా వడ కాచి తిరిగి వాడుకోవాలి. నీటి వినియోగంపై వర్షాకాలంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటాం.

-జీఎం తిప్పన్న
logo