e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home హైదరాబాద్‌ ఒడిసిపడదాం..ఒక్కో బొట్టునీ..

ఒడిసిపడదాం..ఒక్కో బొట్టునీ..

ఒడిసిపడదాం..ఒక్కో బొట్టునీ..
 • నీటి సంరక్షణకు వానకాలమే మంచి తరుణం
 • ఇంకనిద్దాం..భవిష్యత్‌నిద్దాం..
 • జలమండలి ఆధ్వర్యంలో 2వేల ఇంకుడు గుంతల నిర్వహణ

సిటీబ్యూరో, జూన్‌ 16 (నమస్తే తెలంగాణ) : జలం ప్రాణాధారం.. మనం సంరక్షించే ఒక్కో బొట్టు భవిష్యత్‌ అవసరాలను తీరుస్తుంది. భూగర్భ సంపద పెరుగుతుంది. కానీ.. నీటి బిందువులను ఒడిసిపట్టకుండా వదిలేస్తున్నాం. ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నాం. కోటికిపైగా జనాభా ఉన్న ఈ మహానగరంలో ఒకప్పుడు 550-600 చెరువులు, కుంటులు ఉండేవి. కొన్ని కనుమరుగవ్వగా, మరికొన్ని కబ్జాలతో కుంచించుకుపోయాయి. దీనికితోడు నగరీకరణ పుణ్యమా అని హైదరాబాద్‌ కాంక్రీట్‌ జంగిల్‌గా మారింది. ఫలితంగా వాననీరు భూమిలోకి సరిగా ఇంకడం లేదు. దీంతో ఏటా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం సాధారణమైంది. వాననీటి సంరక్షణపై జలమండలి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ప్రజలు నీటి పొదుపుపై దృష్టి సారించడం లేదు. ‘ఇకనైనా నిర్లక్ష్యం వీడుదాం.. వర్షాకాలం..ఇదే మంచి తరుణం.. వాన చుక్కను ఎంచక్కా.. కాపాడుకొని.. భూగర్భ జలసిరులు పెంచుకుందాం’ అని అధికారులు, పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.

భూగర్భ జలమట్టం తగ్గడానికి కారణాలివే

 • విచ్చలవిడిగా బోరు బావుల తవ్వకం.
 • నిల్వ కంటే అధికంగా నీటి వాడకం.
 • భవంతులు, ఫుట్‌పాత్‌లు, రోడ్లు మొదలైన వాటి నిర్మాణాలతో తరుగుతున్న నీటి నిల్వ ప్రాంతాలు
 • ఉపరితల నీటి వనరుల తరుగుదల.
 • వర్షం నీటిని సంరక్షించడంపై ప్రజలు శ్రద్ధ వహించకపోవడం.

ఇలా చేయాలి..

 • భవంతుల పరిసరాలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రహదారులకు ఇరువైపులా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి.
 • ఎండిపోయిన బావులను నీటి నిల్వలుగా మార్చడం.
 • బహిరంగ ప్రాంతాలు, పార్కులు, ఉపరితల నీటి వనరులను పెంచి సంరక్షించడం.
 • సాధారణంగా ఇంటి పైకప్పుల నుంచి పారే నీరు కాలువలు/నాలాల్లోకి వెళ్తుంది. అలా కాకుండా ఆ నీటిని ఇంకుడుగుంతులు, బహిరంగ బావులు, బోరుబావులకు మళ్లించడం చేస్తే.. భూగర్భ జలాలు సమృద్ధిగా వృద్ధి చెందుతాయి.

ఇలా చేయాలి…

 • ప్రహరీ పొడవునా 0.5మీ ల వెడల్పు గల కందకాలను 2 నుంచి 3 మీటర్ల లోతు వరకు తవ్వాలి.
 • 2 నుంచి 3 మీటర్ల లోతు వరకు మీటర్‌ వ్యాసం గల గుంటను తీయాలి.
 • 100 చదరపు మీటర్ల విస్తీర్ణం గల పైకప్పు నుంచి సేకరించే వర్షపు నీటిని ఒడిపట్టేందుకు ఆరు ఘన మీటర్ల కందకం లేదా గుంటను నిర్మించుకోవాలి. ప్రతి ఘణ మీటర్‌కు రూ.2,516 ఖర్చు అవుతుంది.

వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు/ చిట్కాలు…

 • సూచిక బోర్డుల ద్వారా ఇంకుడు గుంతలను సులభంగా గుర్తించేలా నిర్మించాలి. మలమూత్రాలతో పాటు చెత్త పేరుకు పోకుండా వాటికి కంచెవేసి సంరక్షించాలి.
 • ఎప్పటికప్పుడు ఇంకుడు గుంతలోని పైపొరను తీసివేసి శుభ్రపర్చాలి.
 • స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు ఇంకుడు గుంతల ప్రాధాన్యతను తెలియజేయాలి.
 • వర్షాకాలం ప్రారంభానికి ముందే వర్షపు నీటి నిల్వ ట్యాంకు పూర్తిగా ఖాళీ చేసి లోపలి వైపు నుంచి శుభ్రపర్చుకోవాలి.
 • వర్షం ఉధృతిని బట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని వదలిపెట్టాలి.

2వేల ఇంకుడు గుంతలు

జలమండలి పరిధిలో సుమారు 2వేల ఇంకుడు గుంతలను నిర్మించాం. నిర్వహణలో భాగంగా వీటిని ఇప్పటికే శుభ్రం చేశాం. నగరంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వాళ్ల దగ్గరకు నేనే స్వయంగా వెళ్లి సాంకేతిక సలహాలను అందిస్తున్నాను. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఇంటి వద్ద ఇంకుడు గుంతను నిర్మించుకుంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేయాలి. కానీ కొందరు క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంకుడుగుంతల నిర్మాణాలు లేని ఇండ్లకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ప్రజలు భవిష్యత్‌ అవసరాలను గుర్తించి ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలి. -సత్యనారాయణ, జలమండలి ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి

ఒక్కొ ఇంటి వద్ద లక్షల లీటర్లను పొదుపు చేయవచ్చు…

- Advertisement -

హైదరాబాద్‌లో 500 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతంలోని ప్రతి ఇంటి పైకప్పు మీద వర్షపు నీటిని సంరక్షిస్తే ఒక్కో ఇంటి వద్ద ఇంటి విస్తీర్ణాన్ని బట్టి 25వేల లీటర్ల నుంచి 2.5లక్షల లీటర్ల వరకు పొదుపు చేయవచ్చని జలమండలి ఇంజినీర్లు పేర్కొంటున్నారు.

ఫిల్టర్‌ యూనిట్‌ వివరాలు..

బహుళ అంతస్తుల్లో నివసిస్తున్న వారు సురక్షితంగా వర్షపునీటిని శుభ్రపరిచి వడపోసి సంపులల్లో నిల్వ ఉంచుకొని ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు. సివిల్‌ ఇంజినీర్ల అంచనా ప్రకారం ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ గుంటను నిర్మించేందుకు గృహ నిర్మాణానికి అయ్యే ఖర్చుతో సుమారు 0.5 శాతం కూడా ఉండదు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఒడిసిపడదాం..ఒక్కో బొట్టునీ..
ఒడిసిపడదాం..ఒక్కో బొట్టునీ..
ఒడిసిపడదాం..ఒక్కో బొట్టునీ..

ట్రెండింగ్‌

Advertisement