ఈ ఎండకాలంలో దాహార్తిని తీర్చే వాటిలో పుచ్చకాయ ఒకటి. కేవలం దాహాన్ని మాత్రమే కాదు ఒంటికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ఈ పుచ్చకాయ తింటే ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చాలామంది పుచ్చకాయ తినేటప్పుడు గింజలను తీసి పక్కనపెడతారు. పొరపాటున పిల్లలు ఆ గింజలను మింగేస్తే ఇక ఆ రోజంతా టెన్షన్ పడతారు. పుచ్చకాయ గింజలను తింటే ఏమవుతుంది అమ్మ అని పిల్లలు అడిగినా సరైన సమాధానం మీ దగ్గర ఉండదు. ఇంతకీ పుచ్చకాయ గింజలను తినొచ్చా లేదా అంటే హ్యాపీగా తినేయమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పుచ్చకాయ గింజలలో మనకి తెలియని చాలా పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే పుచ్చకాయ తినేటప్పుడు గింజలను పారేయకుండా వాటిని ఎండబెట్టండి. ఆ తర్వాత అందులోని తేమ పోయేవరకు కాస్తంత వేడి చేయండి. గాలి ఆడని కంటైనర్ లో వేసి మూతపెట్టండి . ఇలా దాచుకున్న పుచ్చకాయ గింజలను మీరు ఎప్పుడైనా స్నాక్ గా తినొచ్చు. లేదా సలాడ్లలో చల్లుకోవచ్చు. పొడిలా చేసుకొని… కూరల్లో కూడా వాడుకోవచ్చు.
పుచ్చకాయ గింజల్లో గ్లోబులిన్, అల్బుమిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉంటాయి. అలాగే విటమిన్ సీ, బీ కాంప్లెక్స్, అమైనా యాసిడ్స్ ఉంటాయి. వీటివల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. హైబీపీ ని కంట్రోల్లో ఉంచుతుంది. డయాబెటిక్ రోగులు వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. పుచ్చకాయ గింజల్లో L-ఆర్గినిన్ అనే అమైనా యాసిడ్ ఉంది. ఇది నైట్రిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగేలా చేస్తుంది. ఫలితంగా గాయాలు మానిపోతాయి. జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఉండవు. చర్మం ముడతలు తగ్గుతాయి. ఇన్ని ప్రయోజాలున్న పుచ్చకాయ గింజలను పారేయడం మంచిది కాదు కదా.