e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home హైదరాబాద్‌ వాన ఆగగానే.. బయటకు వెళ్లకండి..

వాన ఆగగానే.. బయటకు వెళ్లకండి..

వాన ఆగగానే.. బయటకు వెళ్లకండి..
  • రహదారులపై కొద్దిసేపే వరద నీరు.. నిమిషాల్లో ఖాళీ
  • కాస్త ఆగి బయలుదేరితే..ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవు
  • గ్రేటర్‌లో 83 వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు

నగరంలో భారీ వర్షాలకు అక్కడక్కడా రహదారులు జలమయమవుతాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అయితే రోడ్లపై కొద్దిసేపు మాత్రమే వరద నీరు నిలుస్తుంది. ఆ సమయంలో బల్దియా, ట్రాఫిక్‌ పోలీసులు వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు. కాసేపటికే నీరంతా వెళ్లిపోతుంది. అందుకే వర్షం పడి తగ్గిన వెంటనే బయటకు వెళ్లకుండా.. కాస్త ఆగి వస్తే… ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉత్పన్నం కావని అధికారులు చెబుతున్నారు.

నగర ట్రాఫిక్‌ పోలీసులు 44 ప్రధానమైన నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి.. వాటి వివరాలను జీహెచ్‌ఎంసీకి అందజేశారు. అలాగే సైబరాబాద్‌ పరిధిలోనూ ఇలాంటి వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు 39 చోట్ల ఉన్నట్లు వెల్లడించారు. నాలాలు, డ్రైనేజీలు, వర్షం నీటి లైన్లు మట్టితో కూరుకుపోయి.. చెత్తాచెదారం, ప్లాస్టిక్‌తో నిండి ఉంటాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలంటూ.. ట్రాఫిక్‌ పోలీసులు జీహెచ్‌ఎంసీని కోరుతుంటారు. బల్దియా కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ..ఎప్పకప్పుడు నీరు నిల్వకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నది.

నీరు నిలిచేది ఎక్కడెక్కడంటే..

- Advertisement -

గోపాలపురం – 1, మహంకాళి -1, మారేడ్‌పల్లి -3, తిరుమలగిరి – 5, పంజాగుట్ట -3, ఎస్‌ఆర్‌నగర్‌ – 3, జూబ్లీహిల్స్‌ – 1, బంజారాహిల్స్‌ – 3, బేగంపేట్‌ – 2, చిక్కడపల్లి -1, అబిడ్స్‌ -1, సైఫాబాద్‌ -3, మలక్‌పేట్‌ – 2, నల్లకుంట – 1, సుల్తాన్‌బజార్‌ – 3, టోలిచౌకీ -3, ఆసీఫ్‌నగర్‌ – 2, మీర్‌చౌక్‌ – 2, ఫలక్‌నుమా – 2, బహుదూర్‌పురా -2, అలాగే సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గచ్చిబౌలి-5, మియాపూర్‌-2, కూకట్‌పల్లి-4, బాలానగర్‌-4, జీడిమెట్ల-6, అల్వాల్‌-8, రాజేంద్రనగర్‌-8, శంషాబాద్‌ ఆర్‌జీఐఏ 2తో పాటు ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రెండు చోట్ల నీరు నిలిచే (వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు) ప్రాంతాలున్నాయి.

వాటికి దూరంగా ఉండండి..

  • స్తంభాలు, తీగలను తాకవద్దు..
  • ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద జర భద్రం
  • వినియోగదారులను అప్రమత్తం చేస్తూ.. మెసేజ్‌లు..
  • భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ శాఖ హై అలర్ట్‌
  • క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలు

సిటీబ్యూరో, జూలై 15(నమస్తేతెలంగాణ): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రేటర్‌ పరిధిలోని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ అప్రమత్తమైంది. అవసరమున్న చోట ప్రత్యేక బృందాలను ఉంచి.. కరెంటు ప్రమాదాలు, సరఫరాలో అంతరాయలు కలుగకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. వర్షాకాలానికి ముందే మాన్‌సూన్‌ ప్లాన్‌తో తీగల కింద కొమ్మలను తొలగించడంతో ప్రస్తుతం చెట్లు కూలడం వంటి ఘటనలు చాలా తక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 11 కేవీ ఫీడర్స్‌ 2250, 33 కేవీ 470 వరకు ఉన్నాయని, ఇప్పటి వరకు ఎలాంటి అంతరాయం లేదని చెబుతున్నారు. అయితే ముంపు ప్రాంతాల్లో మాత్రం ముందస్తు జాగ్రత్తగా ట్రాన్స్‌ఫార్మర్లకు సరఫరా నిలిపివేశామని చెప్పారు. సరూర్‌నగర్‌ డివిజన్‌లోనే ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయన్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయన్న సమాచారం మేరకు గ్రేటర్‌ పరిధిలోని 9 సర్కిళ్లలోని డివిజన్‌, సెక్షన్‌ స్థాయిలో అధికారులను, సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆపరేషన్స్‌ విభాగం ఉన్నతాధికారులు ఆదేశించారు. 14న విద్యుత్‌ శాఖ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 1912కు మొత్తం 3400 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు.

సగటున రోజుకు 43 మంది..

జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం భారత్‌లో 2019లో 22,442 విద్యుత్‌ ప్రమాదాలు చోటు చేసుకోగా, అందులో 13,432 మంది చనిపోయారు. ఇందులో తెలంగాణలో 735 మంది వరకు ఉన్నారు. షార్ట్‌ సర్యూట్‌ వల్ల మరో 1990 మంది మరణించారు. సగటున రోజుకు 43 మంది విద్యుత్‌ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కరెంటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులు ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తడి ఉన్న చోట తీగలను తాకరాదని, అలాంటి ప్రదేశాలకు వెళ్లకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలని, పిల్లలకు ఇలాంటి వాటిపై ఎక్కువగా అవగాహన కల్పించాలని వినియోగదారులకు సందేశాల రూపంలో సూచనలు పంపిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాన ఆగగానే.. బయటకు వెళ్లకండి..
వాన ఆగగానే.. బయటకు వెళ్లకండి..
వాన ఆగగానే.. బయటకు వెళ్లకండి..

ట్రెండింగ్‌

Advertisement