శనివారం 04 జూలై 2020
Hyderabad - Jul 01, 2020 , 01:22:10

కంటికి రెప్పలా కాపాడుతున్నరు..

కంటికి రెప్పలా కాపాడుతున్నరు..

సర్కారు వైద్యులు.. జీవన దాతలు..  గాంధీ సేవలు అద్భుతం

సంతోషం వ్యక్తం చేస్తున్న కరోనా నుంచి కోలుకున్న బాధితులు

ఈ నెల 23 వరకు  గాంధీలో 10,205 మందికి పరీక్షలు

‘కరోనా వ్యాధి సోకినప్పుడు నేనొంతో భయపడ్డా.. ఎలా వచ్చిందో,  ఏమవుతుందో తెలియని అయోమయ పరిస్థితి. గాంధీ దవాఖానలో వైద్యులు కంటికి రెప్పలా కాపాడారు. వైద్యులు, నర్సులు నా వద్దకు వచ్చి యోగ క్షేమాలు తెలుసుకుని నీకేం కాదు మేమున్నామని భరోసా ఇచ్చారు. వారిచ్చిన ధైర్యంతో నేను కరోనాను జయించాను. తెలంగాణ ప్రభుత్వానికి, వైద్యులకు వందనాలు’అంటూ మొదటి కరోనా పాజిటివ్‌ రోగి  రామ్‌తేజ్‌.. ప్రధానితో అన్న మాటలివి.  మన్‌కీ బాత్‌లో గాంధీ దవాఖానలో తనను వైద్యులు ఏ విధంగా  కాపాడారనే విషయాన్ని ప్రధానికి వివరిస్తూ సర్కారుకు వందనాలు.. వైద్యులు పునర్జన్మనిచ్చారని పేర్కొన్నారు. కాగా గాంధీ దవాఖాన వైద్యులు మెరుగైన సేవలందిస్తూ ఎందరో కొవిడ్‌-19 బాధితులను క్షేమంగా ఇంటికి పంపుతున్నారు.

అభయమిస్తున్న

గాంధీ దవాఖాన

నవజాత శిశువు దగ్గర నుంచి  80 ఏండ్ల వయోవృద్ధుల వరకు కరోనా  నుంచి రక్షించిన ఘనత గాంధీ  సర్కార్‌ దవాఖాన వైద్యులది. కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన మార్చి 2 నుంచి  జూన్‌ 23 వరకు మొత్తం 10,205 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపారు గాంధీ వైద్యులు.  4,056 మంది పాజిటివ్‌ రోగులకు ఐపీ సేవలు అందించారు.  వీరిలో 12 ఏండ్లలోపు చిన్నారులు 290 మంది ఉండగా అందులో 35 మంది ఐసీయూలో చికిత్స పొంది ఆరోగ్యంగా కోలుకున్నారు. కొవిడ్‌-19  సోకిన 137 మంది గర్భిణిలకు సేవలందించడంతో  పాటు 37 మంది గర్భిణిలకు పురుడుపోసింది గాంధీ దవాఖాన. జూన్‌ 23 వరకు మొత్తం 3,423 మంది రోగులు కరోనాను జయించి దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. గాంధీలో చికిత్స పొందిన వారిలో 96 శాతానికి పైగా కరోనాను జయించిన వారే కావడం విశేషం. 

కొవిడ్‌-19 మృతుల్లో అత్యధికంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఉంటున్నప్పటికీ అలాంటి క్లిష్టమైన అనారోగ్య బాధితులను సైతం బతికించిన ఘనత గాంధీ దవాఖానదే.

దీర్ఘకాలిక వ్యాధులతో

కోలుకున్న కొవిడ్‌-19 బాధితులు

ఐసీయూలో కోలుకున్న వారు 1,395

 న్యుమోనియా రోగులు 1842

క్యాన్సర్‌ రోగులు 16

 పక్షవాతం 12

 గుండె సంబంధ వ్యాధిగ్రస్తులు 38 

కిడ్నీ రోగులు 54

కాలేయ సంబంధిత వ్యాధిగ్రస్తులు 24

సీవోపీడీ, ఆస్తమా రోగులు 88

అశ్రద్ధ వహించొద్దు

తల్లి జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు. అందుకే వైద్యుడిని దైవంతో సమానమంటారు. డాక్టర్ల సేవలను ప్రభుత్వాలు గుర్తించి వైద్యులకు ప్రత్యేక రోజును  కేటాయించడం అభినందనీయం. ప్రస్తుతం ప్రపంచం కరోనాతో పోరాడుతున్న నేపథ్యంలో వైద్యులు కూడా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నందున ఎవరూ అశ్రద్ధ వహించవద్దు.

-డాక్టర్‌ నాగేందర్‌, ఉస్మానియా

దవాఖాన సూపరింటెండెంట్‌ 

జాగ్రత్తలతోనే దూరం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో వైద్యులు కూడా పోరాడాల్సి వస్తుంది. కరోనా సోకకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. రద్దీగా  ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది. వ్యక్తి గత పరిశుభ్రతతో పాటు కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తేనే వైరస్‌ ధరి చేరకుండా ఉంటుంది.

-డాక్టర్‌ మహ్మద్‌ రఫీ, ఆర్‌ఎంవో, ఉస్మానియా దవాఖాన

లక్షణాలు

లేకుండానే..

కరోనా వైరస్‌ ధరిచేరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరినీ కొవిడ్‌-19  వ్యక్తిగానే  భావించి వారితో భౌతికదూరం పాటించాలి.  తుంపర్ల ద్వారా వైరస్‌ ముక్కు నుంచి శ్వాసనాళంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. రోగ నిరోధక శక్తి ఉన్న వారిలో వ్యాధి లక్షణాలు కనిపించవు. ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు ఏ మాత్రం అశ్రద్ధ వహించొద్దు.

 -డాక్టర్‌ రమేశ్‌, హెచ్‌వోడీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ

10 రోజుల్లోనే..

నా పేరు.. శ్రీపతి మల్లికార్జున్‌.. గుడిమల్కాపూర్‌ సత్యనారాయణ నగర్‌ కాలనీకి చెందిన నేను మే 5న అస్వస్థతకు గురయ్యాను. ప్రైవేట్‌ దవాఖానల్లో వ్యాధి నిర్ధారించలేదు. ఇలా 25 రోజులు గడిచాయి. జ్వరం తీవ్రమై ఆయాసం పెరగడంతో  ఫీవర్‌ దవాఖానకు వెళ్లాం. మే 5న కోరంటి  దవాఖానలో కరోనా పరీక్ష చేసి అడ్మిట్‌ చేసుకున్నారు. అదే నెల 7న కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఊపిరి సరిగా ఆడకపోవడంతో వెంటనే అక్కడి వైద్యులు నన్ను గాంధీ దవాఖానకు తరలించారు. ఇక నాకు ఊపిరి తీసుకోవడమే కష్టమైన క్రమంలో నన్ను గాంధీ వైద్యులు  కంటికి రెప్పలా కాపాడారు. ముందు కొన్ని మందులు ఇచ్చి ఐసీయూకు తరలించారు. ఆక్సిజన్‌ వసతిని కల్పించారు.  ఉదయం 7.30 గంటలకు టీ, మరో గంట తర్వాత అల్పాహారం.  పదిన్నర గంటలకు మరో టీ, 12.30 గంటలకు  బలవర్ధకమైన ఆహారంతో పాటు ఒకటి లేదా రెండు ఉడకబెట్టిన గుడ్లు,  సాయంత్రం 4.30 గంటలకు బాదం, పిస్తా, కిస్మిస్‌, ఖర్జూర ఇచ్చారు. రాత్రి 7.30 గంటలకు డిన్నర్‌ రాత్రి 9.30 గంటలకు పాలు అందించారు.  నర్సులు, డాక్టర్‌లు ఎప్పటికప్పుడు చెకప్‌ చేస్తూ భరోసా ఇచ్చారు.  ఆ సమయంలో వారు నా కంటికి దేవుళ్లలా కనిపించారు. పది రోజులు తిరగకముందే నేను మళ్లీ మామూలు మనిషినయ్యాను.

-శ్రీపతి మల్లికార్జున్‌

    ప్రేమగా పలకరించేవారు..

నేను గాంధీ దవాఖానలో 20 రోజులు చికిత్స పొందాను.  ఇంట్లో ఉన్నట్టుగానే ఫీలయ్యాను. తొలుత ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం ఏడో  అంతస్తులోకి మార్చారు. డాక్టర్లు మా వద్దకు వచ్చి ప్రేమగా పలకరించేవారు. ధైర్యం అందిస్తూ మా సమస్యలు తెలుసుకుని వాటికి మందులు ఇచ్చేవారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రికి భోజనం అందించారు. సాయంత్రం డ్రై ఫ్రూట్స్‌ ఇచ్చేవారు. రోజుకు రెండు సార్లు టాయిలెట్లు శుభ్రం చేసేవారు. మాకు కొత్త టవల్‌, టూత్‌ బ్రష్‌, సబ్బులను అందించారు. మా ఇంట్లో ఇద్దరం కరోనా నుంచి విజయవంతంగా కోలుకున్నాం.

-దేవదాస్‌, రిటైర్డ్‌ రైల్వే ఇంజినీర్‌, న్యూ బోయిగూడ

ఇంట్లోనే చికిత్స

కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత 15 రోజుల్లో సాధారణ స్థితికి చేరుకున్నాం. నాకు గత నెలలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రభుత్వం, కాలనీవాసుల నుంచి సంపూర్ణ సహకారం లభించింది. నాతో పాటు మా కుటుంబంలోని నలుగురికి కరోనా వచ్చినా అధైర్య పడలేదు. అందరం కోలుకున్నాం. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాం. హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకున్న మాకు స్థానిక ప్రభుత్వ దవాఖాన సిబ్బంది ఉదయం, సాయంత్రం మందులు అందిస్తూ పర్యవేక్షించారు. మా కాలనీని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించడం కొంత బాధకలిగించింది. కరోనాపై ఆందోళన అవసరం లేదు. వైద్యుల సూచనలు పాటిస్తూ..మాస్కులు ధరించి, శానిటేషన్‌ చేసుకోవాలి.  భౌతికదూరం పాటించాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.

-వై.గోపాల్‌ యాదవ్‌, హెడ్‌కానిస్టేబుల్‌, బోడుప్పల్‌

66 ఏండ్ల వయసులో..

కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలియగానే ఎంతో భయపడ్డాను.  66 ఏండ్ల వయసులో ఎలా  కోలుకుంటానోనని ఆందోళన చెందాను. 14 రోజులు  గాంధీ దవాఖానలో చికిత్స పొందాను.  ప్రభుత్వ వైద్యుల దయతో కోలుకుని పిల్లల వద్దకు చేరుకున్నాను. ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటంతో పాటు పిల్లలను కాపాడుకుంటున్నా. కొందరు  జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతుండటం బాధగా ఉంది. 

 - తీగుళ్ల మల్లయ్య, రసూల్‌పుర

ఆందోళన చెందొద్దు..

గత నెల 20న అతిగా దగ్గు, జ్వరం రావడంతో అనుమానం వచ్చి కరోనా పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే గాంధీ దవాఖానలో చేరాను. వైద్యుల సూచనల మేరకు మానసికంగా  ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాను. 14 రోజుల పాటు  క్రమం తప్పకుండా నిత్యం టిఫిన్‌, పాలు, వివిధ రకాల ఆకుకూరలు, పప్పు, కూరగాయల భోజనంతో పాటు  డ్రై ఫ్రూట్స్‌ అందించారు. వైద్యులు సమయానికి మందులు ఇచ్చారు. 14 రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. అనంతరం 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ప్రస్తుతం ఆరోగ్యం బాగుంది.  కరోనా వచ్చిందని ఎవరూ ఆందోళన చెంది భయపడొద్దు.

- సుధీర్‌కృష్ణ, బాలాపూర్‌ డీఐ

ప్రతి రోజూ చెకప్‌..

కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు. కొవిడ్‌-19 వచ్చిన వారిని అంటరానివారిగానో, తప్పు చేసిన వారిగానో చూడొద్దు. కరోనా వచ్చిన వారు మొదట ధైర్యంగా ఉండాలి. నాకు కరోనా పాజిటివ్‌గా తేలగానే కొంత ఆందోళనకు గురయ్యాను. మా కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్‌ వచ్చింది. నేచర్‌ క్యూర్‌ దవాఖానలో చేరాం. అక్కడకు వెళ్లగానే కొంత భయంగా ఉన్నా మాకు వారి స్వాగతం ధైర్యానిచ్చింది. వెళ్లిన గంట లోపే వైద్యులు వచ్చి చెకప్‌ చేశారు. ప్రతి రోజూ షెడ్యూల్‌ ప్రకారం మా వద్దకు వచ్చి చెకప్‌ చేసేవాళ్లు. వైద్యులు ఇచ్చిన మందులు.. అక్కడి వాతావరణం వారం రోజుల్లోనే సాధారణ వ్యక్తులుగా మార్చింది. 

- ఎ. రమణ కుమార్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌

అన్ని విధాలా..

కరోనా వచ్చిన వారికి అన్ని విధాలా సేవలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దవాఖానలో కూడా వైద్యులు, సిబ్బంది ఎంతో ఓపికతో చికిత్స అందిస్తున్నారు. నాకు కరోనా లక్షణాలు ఉన్నాయని తెలియడంతో తొలుత సరోజినిదేవీ కంటి దవాఖానకు తీసుకువెళ్లారు. 4 రోజుల తర్వాత గాంధీ దవాఖానలో చేర్పించారు. అక్కడ 43 రోజుల పాటు ఉన్నాను. ఇంటికి తిరిగివచ్చి నెల రోజులకు పైగా అవుతున్నది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను.

-ఎండీ రఫీవుల్లాఖాన్‌

రోజూ రెండు కోడిగుడ్లు

నాకు మే 1న కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే గాంధీ దవాఖానకు వెళ్లాను. అక్కడ డాక్టర్లు మొదట ధైర్యం చెప్పారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, గుడ్డు ఇచ్చారు. సాయంత్రం డ్రై ఫ్రూట్స్‌ బాదం, కాజు, అంజీర్‌ అందించారు. రాత్రికి భోజనంతో పాటు పండ్లు అందించారు. వైద్యులు రోజు వచ్చి చెకప్‌ చేశారు. మే 15న గాంధీ నుంచి ఆరోగ్యంగా ఇంటికి వచ్చాను. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను.

-ప్రదీప్‌, కానిస్టేబుల్‌, మేడిపల్లి

ధైర్యంతోనే జయించా

గాంధీ దవాఖానలో వైద్యులు, నర్సులు అందించిన ధైర్యంతోనే కరోనాను జయించా. 55 ఏండ్ల వయసులోనూ వ్యాధి నుంచి కోలుకున్నాను. ఉదయం, సాయంత్రం, రాత్రి మంచి పోషకాహారం అందించారు. ఇతర జబ్బులకు తోడు కరోనా రావడంతో నేను కోలుకుంటానని అనుకోలేదు. గాంధీ దవాఖానలో మంచి వైద్యం అందించడంతో పాటు మందులు ఇచ్చి పునర్జన్మనిచ్చారు.

-ఎన్‌. రాధాబాయి, దమ్మాయిగూడ 

గుండెనొప్పి అనుకున్నా.. 

గత నెల ఛాతిలో నొప్పి వస్తే గుండెనొప్పి అనుకుని పటాన్‌చెరు దవాఖానకు వెళ్లాను. కానీ దమ్ము సమస్య అని అక్కడి నుంచి ఎర్రగడ్డ ఛాతి దవాఖానకు పంపించారు.  కరోనా అనే ఏదో మాయదారి రోగం వచ్చిందంటే ఎంతో భయపడ్డాను. కానీ డాక్టర్లు, నర్సులు వైద్య సేవలు అందించి నన్ను కాపాడారు.  నేను బతికి బయటపడ్డాను అంటే సర్కారొళ్ల పుణ్యమే. కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటా.

-యండ్రాతి రత్తమ్మ, జవహర్‌నగర్‌

3 రోజుల్లోనే ఇంటికి.. 

దగ్గు, జ్వరంతో బాధపడుతున్న నాకు గత నెల 8న  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మూడు రోజుల పాటు గాంధీ దవాఖానలో చికిత్స పొందాను. వైద్యుల సూచనల మేరకు మందులు వేసుకున్నాను. అక్కడ మంచి పోషకాహారం అందించారు.  మూడు రోజుల అనంతరం దవాఖాన నుంచి ఇంటికి వచ్చాను.  20 రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటించి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాను. 

-అనంతుల అనిల్‌కుమార్‌, గోల్నాక

ఇంటికి వచ్చి మందులు ఇచ్చారు..

మా నాన్నకు  కరోనా పాజిటివ్‌ అని తెలియగానే గాంధీ దవాఖానలో  చేర్చించాము. రెండు రోజుల తర్వాత నాకు కూడా పాజిటివ్‌ అని తెలిసినా.. లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, గాంధీ దవాఖాన ఆరోగ్య కేంద్రం సిబ్బంది, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు మాకు చాలా ధైర్యం అందించారు. ఇంట్లో నేను, మా అమ్మ వేర్వేరు గదుల్లో ఉన్నాం. ప్రతి రోజు వైద్యుడు, సిబ్బంది మా ఇంటికి వచ్చి మా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకునే వారు. 20 రోజుల అనంతరం నాకు నెగెటివ్‌గా తేలింది. మందులు, చికిత్స ఉచితంగానే అందించారు. మేము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఇంట్లో అందరం ఆరోగ్యంగా ఉన్నాం. 

-ఆశీశ్‌ అక్సల్‌, ప్రైవేట్‌ ఉద్యోగి

72 ఏండ్ల వయసులో..

కరోనా రావడంతో ఎంతో భయాందోళనకు గురయ్యా. 72 ఏండ్ల వయసులో ఇలాంటి రోగం రావడం మా కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది. మే 21న గాంధీ దవాఖానలో చేరాను. అక్కడ మంచి ఆహారం, వైద్య సేవలతో పది రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. జూన్‌ 1న డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చాను. వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి. కరోనా వచ్చిందనగానే కుంగిపోకుండా ఆత్మైస్థెర్యంతో ఉండాలి. ఇప్పుడు పూర్తిగా తగ్గి ఆరోగ్యంగా ఉన్నా.         -కణతాల సుజాత, ఎన్జీవోస్‌ కాలనీ, వనస్థలిపురం

4 రోజుల్లోనే ఉపశమనం

నాకు కరోనా లక్షణాలు కనిపించడంతో  జూన్‌ 14న కింగ్‌కోఠి ప్రభుత్వ దవాఖానకు వెళ్లాను. అక్కడి వైద్యులు అడ్మిట్‌ చేసుకుని నాకు  బెడ్‌ కేటాయించారు. వైద్యశాలలో చేరిన సమయంలో నాకు తీవ్రమైన జ్వరం, దగ్గు, దమ్ము ఉన్నాయి. నాలుగు రోజుల తర్వాత కొంత ఉపశమనం కలిగింది. ప్రతి రోజూ మందులు, పోషకాహారం అందించారు. రాత్రి ఒంటి గంటకు కూడా వైద్యులు వచ్చి చెకప్‌ చేసేవాళ్లు. అవసరమైన వారికి మందులు కూడా అందించారు. 14వ రోజు తిరిగి పరీక్ష చేస్తే కరోనా నెగెటివ్‌ వచ్చింది. ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నాను.

-వెంకటేశ్‌, బేగంపేట

వాట్సాప్‌లో సూచనలు..

వ్యాధి లక్షణాలు ఎక్కువగా లేకపోవడంతో ఇంట్లోనే ఓ గదిలో ఉన్నాను. జీహెచ్‌ఎంసీ, వైద్యాధికారులు వచ్చి నాకు  కరోనా కిట్‌ ఇచ్చారు.  అందులో మందులు, మాస్కులు, గ్లౌజ్‌లు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, వైద్య సిబ్బందితో పాటు మరో ముగ్గురు కరోనా బారిన పడ్డవారి నంబర్లతో వాట్సాప్‌ గ్రూప్‌ తయారు చేశారు. రోజూ మాకు ఫోన్‌ చేయడంతో పాటు ఏమైనా ఇబ్బందులుంటే అందులో పోస్టు చేస్తే వెంటనే వస్తామని వైద్యులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సూచించారు. 

 -శ్రీనివాస్‌, ఎస్సై, బంజారాహిల్స్‌

ఎలాంటి లక్షణాలు లేకుండానే..

ఎలాంటి లక్షణాలు లేకుండానే నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. చికిత్స కోసం నేచర్‌ క్యూర్‌ సెంటర్‌కు వెళ్లాను. అక్కడ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వైద్యులు చెకప్‌ చేశారు. మందులతో పాటు పోషకాహారం అందించారు.  అత్యవసరమైతే వెంటనే తమకు ఫోన్‌ చేయాలని  వైద్యులు సూచించారు.  10 రోజుల్లోనే నేను కోలుకుని, తిరిగి విధుల్లో చేరాను. కరోనా వచ్చిందని ఎవరూ బయపడొద్దు. ధైర్యంగా ఉండాలి.

-  గోకారి, ఎస్సై, ఎస్‌ఆర్‌నగర్‌ logo