శనివారం 30 మే 2020
Hyderabad - May 20, 2020 , 23:41:35

మాస్కుతో ముక్కు, మూతి సేఫ్‌.. మరి కండ్ల సంగతి.?

మాస్కుతో ముక్కు, మూతి సేఫ్‌.. మరి కండ్ల సంగతి.?

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 మహమ్మారి ఏ రూపంలో ఎక్కడి నుంచి వచ్చిపడుతుందో తెలియదు. కరోనా బారినుంచి తప్పించుకునేందుకు జనం రకరకాల జాగ్రత్తలు పాటిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు భౌతిక దూరం, ముక్కు, మూతికి మాస్కులు ధరిస్తున్నారు. కండ్లపై ఎవరూ శ్రద్ధపెట్టడం లేదు. వైరస్‌ సోకడానికి కండ్లు కూడా ప్రధాన కారణమని కంటి వైద్యనిపుణులు, సరోజిని దేవి కంటి దవాఖాన రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ డా.రవీందర్‌గౌడ్‌ హెచ్చరిస్తున్నారు. 

కరోనా సోకే ప్రధాన మార్గాలు..

కొవిడ్‌-19 వైరస్‌ అనేది మానవ శరీరంలోకి మూడు ప్రధాన అవయవాల ద్వారా ప్రవేశిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందులో ముక్కు, నోరు, కండ్లు. వీటి ద్వారానే వైరస్‌ అనేది మనిషి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది.. ఇవి తప్పా ఇతర ఏ మార్గం ద్వారా వైరస్‌ సోకే అవకాశం లేదని వైద్యులు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా కాలంలో ముఖానికి మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. మాస్కు లేకుంటే జరిమానాలు కూడా విధిస్తున్నారు. దీని వల్ల ముక్కు, నోరు సేఫ్‌ అని చెప్పవచ్చు. కాని కంటి సంగతేంటని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది కండ్లను నిర్లక్ష్యం చేస్తున్నారని, మూతికి మాస్కు ధరించినా కండ్ల ద్వారా వైరస్‌ సోకే ప్రమాదమున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కండ్లకు అద్దాలు తప్పనిసరి

కరోనాపై ప్రజలకు అవగాహన వచ్చింది. నియమాలు పాటిస్తున్నారు. కానీ, అందరూ మాస్కులపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. కొవిడ్‌-19 వైరస్‌ అనేది ముక్కు, నోరు, కండ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే 90 శాతం  ముక్కు, నోటిపై మాత్రమే దృష్టి పెడుతూ కండ్లను మరిచిపోతున్నారు. అది చాలా ప్రమాదకరం.  మాస్కుతో పాటు కంటికి  అద్దాలు తప్పనిసరి. 

-డా.రవీందర్‌ గౌడ్‌, సరోజిని దవాఖాన రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌


logo