‘మీ ఇంట్లో నిరూపయోగంగా సైకిళ్లు ఉన్నాయా? వాటిని ఉపయోగించడం లేదా? అయితే ఆ సైకిళ్లను మాకివ్వండి…మరమ్మతులు చేయించి కొత్తవిగా మారుస్తాం…అవసరమున్న నిరుపేదలకు అందిస్తాం. పెద్ద మనసుతో ముందుకురండి.’ అంటూ హ్యాపీ హైదరాబాద్ సైక్లిస్టులు పిలుపునిస్తున్నారు. కాలుష్యాన్ని నివారించి, పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ వినియోగాన్ని పెంచేలా…ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాతలు 9566170334, 9959771673 నంబర్లకు కాల్ చేస్తే చాలు… ఇంటికి వచ్చి సైకిల్ తీసుకెళ్తారు.
చాలా మందికి సైకిల్ అంటే చిన్న విషయంగా అనిపించొచ్చు. ఆ సైకిల్‌ను ఆధారం చేసుకుని నగరంలోని చాలా మంది తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే కొందరు సైకిల్ కొనే స్తోమత లేక కిలోమీటర్ల మేర కాలినడకన నడిచి ఇంటి పనులు, కూలీ పనులు తదితర వృత్తులు చేసుకుంటున్నారు. మరోవైపు పిల్లలను సైకిల్‌పై కాసేపు అలా బయటకు తీసుకెళ్లాలని నిరుపేద తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ వాటిని కొనే శక్తి వారికి ఉండదు. ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారి కోసం నగరవాసులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి..తమ పాతసైకిళ్లను అందిస్తే పేదవారి ముఖాల్లో సంతోషం చూడొచ్చని హ్యాపీ హైదరాబాద్ సంకల్పించింది. ప్రాజెక్టు దియా పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం నిరుపేదలకు బాగా ఉపయోగపడనున్నది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సందేశాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇప్పుటివరకు 40 మంది తమ పాత సైకిళ్లను అందించేందుకు ముందుకు రావడం విశేషం.
చాలా ఇండ్లలో పాత సైకిళ్లు ఉంటాయి. వాటిని వాడకుండా స్టోర్ రూంలో ఉంచేస్తారు. అలా ఉపయోగంలో లేని సైకిళ్లను మాకు అందిస్తే..వాటిని అవసరమున్న వారికి అందజేస్తాం. ప్రాజెక్టు దియాకు మంచి స్పందన వస్తున్నది. ఎవరికైనా సైకిల్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మేం అన్ని వివరాలు పరిశీలించి.. అందిస్తాం. మనం చేసే మంచి పనితో ఎదుటి వారు సంతోషంగా ఉండాలన్నదే మా లక్ష్యం. సైకిల్ తొక్కడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు కొందరు జీవనోపాధికి ఉపయోగపడుతున్నది. కొందరు చిరు వ్యాపారులు సైకిళ్లపై ఆహార పదార్థాలను విక్రయిస్తుంటారు. అలాంటి వారికి సైకిల్ అందిస్తే..వారి జీవనోపాధికి దోహదపడినట్లు అవుతుంది. -సాంతన సెల్వన్, హ్యాపీ హైదరాబాద్
కొవిడ్ ఆపత్కాలంలో చాలా మంది తమ జీవనోపాధి కోసం కాలినడకన వెళ్లే వారు ఉన్నారు. వారికి సైకిల్ అందిస్తే కొంత భరోసా దొరుకుతుంది. చిన్న పిల్లలతో పాటు పెద్దల సైకిళ్లు ఏవైనా సరే మేం తీసుకొని బాగు చేయించి అవసరమున్న వారికి అందజేస్తాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. సైకిల్ కూడా వినియోగించే ఆర్థిక స్తోమత లేని వాళ్లు మన చుట్టూనే ఉన్నారు. ఇండ్లలో పనిచేసే వారు రోజు నాలుగైదు గృహాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వారికి సైకిల్ అందిస్తే వారి శ్రమను కొంత తగ్గించినవాళ్లమవుతాం. ఇలా అనేకరకాల వారికి సైకిల్ అసవరం ఉంటుంది. అందుకే మేం ప్రాజెక్టు దియాను చేపట్టాం. ఇప్పటికే మాకు దాతలు కాల్ చేస్తున్నారు. – దినేశ్, హ్యాపీ హైదరాబాద్ సభ్యుడు