సోమవారం 13 జూలై 2020
Hyderabad - Jun 03, 2020 , 01:59:06

మూసీ నది ప్రక్షాళనకు యుద్ధప్రాతిపదికన చర్యలు

మూసీ నది ప్రక్షాళనకు యుద్ధప్రాతిపదికన చర్యలు

హైదరాబాద్  : మూసీ నది ప్రక్షాళనకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్వింద్‌కుమార్‌ మంగళవారం సంబంధిత అధికారులు, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. బాపుఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు 22 కిలోమీటర్ల పొడవునా మూసీ నది జలాల శుద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభం అయ్యేలోగా మూసీ క్లీనింగ్‌ చేయాలని, మూసీలో ఉన్న మురికి కుంటలు, డెబ్రీస్‌, చెత్తా చెదారం, ఇతర వ్యర్థాలను తీసేందుకు వీలుగా ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున యంత్రాలను వినియోగించాలన్నారు.

మూసీ వెంట దోమల వ్యాప్తి నిరోధించేందుకు ఎన్ని డోన్లు అవసరం పడతాయో సంబంధిత జోనల్‌ కమిషనర్లు అంచనా వేయాలని సూచించారు. శాశ్వత ప్రాతిపదికన డోన్ల వినియోగానికి వీలుగా ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌లకు రుణాల ద్వారా వాటిని కొనుగోలు చేసి జీహెచ్‌ఎంసీ ద్వారా వినియోగించాలన్నారు. ఈ సమావేశంలో ఔటర్‌ రింగు రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌ సంతోష్‌, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి , జోనల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.


logo