e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home హైదరాబాద్‌ ప్రైవేటు బడి అంతులేని దోపిడీ

ప్రైవేటు బడి అంతులేని దోపిడీ

ప్రైవేటు బడి అంతులేని దోపిడీ

గ్రేటర్‌లో ప్రైవేటు స్కూళ్ల దోపిడీ నిరాటంకంగా సాగుతున్నది. కరోనా వేళ కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో.46ను దర్జాగా ఉల్లంఘిస్తున్నాయి. ఇటీవల నడిచిన 40 రోజుల ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్‌లైన్‌ క్లాసులకూ పూర్తి ఫీజు చెల్లించాలని బెదిరిస్తున్నాయి. చెల్లించని వారి ఆన్‌లైన్‌ లింక్‌ను నిర్దాక్షణ్యంగా కట్‌ చేస్తున్నాయి. దీనికితోడు పైతరగతులకు ప్రమోట్‌ చేయమని, బయటకెళ్తామంటే టీసీ ఇవ్వమని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయి. కొన్ని స్కూళ్లు బరితెగించి ఫీజులు పెంచి వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆధార్‌ కార్డు ఇవ్వమని, ఆదాయ ధ్రువీకరణ పత్రం తెమ్మని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ దోపిడీకి తోడు వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఒక టర్మ్‌ ఫీజు చెల్లించాలని, ఇప్పుడే పుస్తకాలు,యూనిఫారాలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తుండడం వారి కాసుల దాహార్తికి నిదర్శనం.

కార్పొ‘రేట్‌’ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కొవిడ్‌ -19 నేపథ్యంలో ఈ ఏడాది కేవలం ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని బేఖాతర్‌ చేస్తున్నాయి. జీవో 46ను తుంగలోతొక్కి తల్లిదండ్రుల ముక్కుపిండి మరీ ఆన్‌లైన్‌ క్లాసులకు పూర్తిస్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. గతేడాది కంటే ట్యూషన్‌ ఫీజును ఈ ఏడాది భారీగానే పెంచడంతో పాటు ఆ మొత్తాన్ని చెల్లించని విద్యార్థులను ఆన్‌లైన్‌ క్లాస్‌ నెట్‌వర్క్‌ నుంచి తొలగిస్తూ మానసికంగా వేధిస్తున్నాయి. పైతరగతులకు ప్రమోట్‌ చేయబోమంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయి. అక్కడితో ఆగకుండా ఈ ఏడాది విద్యాసంవత్సరం ఇంకా ముగియకముందే వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రక్రియను సైతం మొదలు పెట్టాయి. పుస్తకాలు, యూనిఫామ్‌లను తీసుకోవడంతోపాటు, ఒక టర్మ్‌ ఫీజును సైతం చెల్లించాలని ఒత్తడి చేస్తున్నాయి. దీంతో ఫీజులను చెల్లించలేక, మరోవైపు పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కార్పొరేట్‌ పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.
నగరంలోని ఓ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ “తమ కుమార్తె స్కూల్‌ ఫీజు గతేడాది రూ.31,500 ఉండగా, మొదటి టర్మ్‌లో రూ.6,600, మిగతా మొత్తాన్ని రూ.8,300 చొప్పున మూడు టర్మ్‌లలో చెల్లించాను. ఈ ఏడాది అదే తరగతి విద్యార్థి ఫీజును పాఠశాల యాజమాన్యం రూ.1500 అదనంగా పెంచింది. ప్రభుత్వ జీవో ప్రకారం ట్యూషన్‌ ఫీజు రూ.16,500 చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. పాఠశాల యాజమాన్యం మాత్రం అందుకు ససేమిరా అంటుంది” అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక కొన్ని సీబీఎస్‌ఈ స్కూళ్లు మరో అడుగుముందుకేసి యూనిఫామ్‌లు, బెల్ట్‌లు, టై, బ్యాడ్జ్‌లు కూడా తీసుకోవాలని ఒత్తిడి పెంచుతుండటం కార్పొరేట్‌ యాజమాన్యాల కాసుల దాహార్తికి నిదర్శనం.
కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది విద్యారంగం అస్తవ్యస్తంగా మారిపోయింది. జూన్‌లో ప్రారంభం కావాల్సిన విద్యాసంవత్సరం ఆలస్యంగా మొదలైంది. ఎక్కువ మేరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారానే పాఠాలను బోధించాలని నిర్ణయించింది. సుదీర్ఘ విరామం తరువాత 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ముఖాముఖిగా విద్యాబోధన ప్రారంభించినా కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తిరిగి బడులను ఇటీవల మూసివేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కేవలం ట్యూషన్‌ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో 46ను విడుదల చేసింది. దాని ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు కేవలం బోధన రుసుం మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో కార్పొరేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పాఠశాలలను తెరిచేందుకు అనుమతివ్వడాన్నే ఆసరాగా చేసుకుని స్కూల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌, స్పోర్ట్స్‌, కంప్యూటర్‌, ల్యాబ్‌ తదితర ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై ఫీ‘జులుం’ ప్రదర్శిస్తున్నాయి.
ఫీజు తగ్గించాల్సింది పోయి పెంచేశారు..!
సాధారణంగా ప్రైవేట్‌ స్కూళ్లలో ట్యూషన్‌ ఫీజుకు అదనంగా స్కూల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌, ల్యాబ్స్‌, గ్రౌండ్‌, కంప్యూటర్‌ తదితర ఫీజులను వసూలు చేస్తుంటారు. ట్యూషన్‌ ఫీజు 50శాతం ఉంటే మిగతా ఫీజులు మరో 50శాతం వరకు ఉంటాయి. ఆ మొత్తాన్ని విభజించి మూడు, నాలుగు టర్మ్‌లుగా ఫీజులను వసూలు చేసేవి. కొవిడ్‌-19 నేపథ్యంలో ఇటు తల్లిదండ్రులపై భారం పడకుండా, అటు పాఠశాలల యాజమాన్యాలు పూర్తిగా నష్టపోవద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం జీవో 46జారీ చేసింది. ఈ ఏడాది పూర్తిగా ఆన్‌లైన్‌ క్లాసులనే నిర్వహించినందున కేవలం ట్యూషన్‌ ఫీజులను మాత్రమే వసూలు చేసుకోవాలని, ఇతరత్ర ఫీజులను వసూలు చేయరాదని మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారం సగటు విద్యార్థి ఫీజు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సగానికంటే తక్కువ ఉండాల్సి ఉంది.
అప్పుడే వచ్చే విద్యాసంవత్సరానికి ఫీజు వసూళ్లు..
2020-21 విద్యాసంవత్సరం పూర్తిగా గందరగోళంలో పడిపోయింది. మే 26వ తేదీతో ఈ విద్యాసంవత్సరం ముగియాల్సి ఉంది. ఇక పదో తరగతి విద్యార్థులతో పాటు మిగతా వారికి మే17 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినా దానిపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. పాఠశాలలను తిరిగి మూసివేయడంతో పరీక్షల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ఇదిలా ఉండగా కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లు అప్పుడే 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజులను కూడా బలవంతంగా వసూలు చేయడం మొదలుపెట్టాయి. ఆ సంవత్సరానికి సంబంధించి పుస్తకాలు, ట్యూషన్‌ ఫీజులతో పాటు యూనిఫామ్స్‌ను కూడా ముందస్తుగానే తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. లేదంటే పైతరగతులకు ప్రమోట్‌ చేయబోమంటూ తల్లిదండ్రులను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాయి.
దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు..
కార్పొరేట్‌ యాజమాన్యాల తీరుతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఆదాయాలు కోల్పోయి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఫీజులు కట్టేదేలా? అని తలలు పట్టుకుంటున్నారు. చెప్పింది ఆన్‌లైన్‌ క్లాస్‌లే కదా? ప్రభుత్వం ట్యూషన్‌ ఫీజు మాత్రమే చెల్లించాలని ఆదేశించింది కదా? అని ఎవరైనా తల్లిదండ్రులు నిలదీస్తే యాజమాన్యాలు మరింత బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయని వివరిస్తున్నారు. “మీ పిల్లలను పై తరగతులకు ప్రమోట్‌ చేయం” అంటూ బెదిరిస్తున్నాయని వాపోతున్నారు. అంతేకాకుండా మొత్తం ఫీజు చెల్లిస్తేనే పదో తరగతి విద్యార్థులకు సంబంధించి పరీక్ష ఫీజు తీసుకుంటామని ఇరుకునపెడుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 8వ తరగతి వరకు టీసీ అవసరం లేకుండానే, బర్త్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా విద్యార్థిని పాఠశాలలో చేర్చుకోవచ్చు. కానీ ఇక్కడే అసలైన చిక్కు ఉంది. గత పాఠశాల తరఫున ఉన్న ఆన్‌లైన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా స్కూళ్లకు వరంగా మారింది. దీన్ని అడ్డుపెట్టుకుని మొత్తం ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని, ఎన్‌రోల్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేస్తామంటూ మెలికపెడుతుండటంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రైవేట్‌ స్కూళ్లు అడిగినంత ముట్టజెప్పలేక, పిల్లలను పంపలేక నలిగిపోతున్నారు.
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం..
కార్పొరేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నది. బొల్లారంలోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని ఇటీవల పలువురు తల్లిదండ్రులు నేరుగా హైదరాబాద్‌ డీఈవోను కలిసి వినతిపత్రం అందజేశారు. అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నగరంలోని గీతాంజలి పాఠశాల అప్పుడే వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజులు వసూలు చేయడం మొదలుపెట్టింది. స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అప్పుడే పదవ తరగతి పాఠాలను చెప్పడం షురూ చేసింది. అక్కడితో ఆగకుండా అందుకు సంబంధించిన ఫీజును కూడా ఇప్పుడే చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తుంది. ఫీజు చెల్లించకుంటే విద్యార్థులను పదవ తరగతికి ప్రమోట్‌ చేయబోమంటూ కొర్రీలు పెడుతున్నదని సదరు విద్యార్థిని తండ్రి ‘నమస్తే’తో చెప్పుకుని వాపోయాడు. ఇవే కాకుండా నగరంలోని అనేక స్కూళ్లు ఇదే రీతిన వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. చిన్న చిన్న ప్రైవేట్‌ స్కూళ్లలో ఆకస్మిక తనిఖీల పేరిట అధికారులు హడావుడి చేస్తూ.. నిబంధనలు ఉల్లంఘిస్తున్న బడా కార్పొరేట్‌ పాఠశాలల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని మండిపడుతున్నారు.
ఫీజులను నియంత్రించాలి..
కార్పొరేట్‌ స్కూళ్లు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయి. జీవో 46ని అడ్డుపెట్టుకుని అన్నింటినీ ట్యూషన్‌ ఫీజులోనే కలిపి వసూలు చేస్తున్నాయి. లేదంటే పై తరగతులకు ప్రమోట్‌ చేసేది లేదంటూ తల్లిదండ్రులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయి. ఫీజుల కోసం పిల్లలను మానసికంగా వేధిస్తున్నాయి. ఇప్పటికే రవీంద్రభారతి, చైతన్య, వీఐపీ వంటి పలు స్కూళ్లపై మేం ఫిర్యాదు చేశాం. నోటీసులిచ్చాం. ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. – సోహైల్‌, స్టేట్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ తల్లిదండ్రుల అసోసియేషన్‌
బడా కార్పొరేట్‌ స్కూళ్లలోనే..
ప్రైవేట్‌ స్కూళ్లు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని అనడం సబబు కాదు. ప్రైవేట్‌ సెక్టార్‌లో చిన్న స్కూళ్లకు, బడా కార్పొరేట్‌ స్కూళ్లకు ముడిపెట్టడం తగదు. కొన్ని బడా కార్పొరేట్‌ విద్యాసంస్థలు అక్రమంగా, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న మాట వాస్తవమే. కొవిడ్‌ మూలాన ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు కూడా ఎంతో నష్టపోయాయి. బిల్డింగ్‌ అద్దెలు, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా మేం ట్యూషన్‌ ఫీజులను మాత్రమే కట్టాలని తల్లిదండ్రులను కోరుతున్నాం.- ఉమామహేశ్వర్‌, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర గుర్తింపు పాఠశాలల యాజమాన్యాల సంఘం
ఫోన్‌ చేసినా ఎత్తడం లేదు..
కార్పొరేట్‌ స్కూళ్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. కొవిడ్‌ నిబంధనలను పాటించకుండా అప్పర్‌ ప్రైమరీ విద్యార్థులకు కూడా తరగతులను నిర్వహిస్తున్నాయి. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సమాచారం ఇచ్చేందుకు ఫోన్‌ చేసినా ఎత్తని దుస్థితి నెలకొంది. తనిఖీలను ముమ్మరం చేయాలి. నిబంధనలు పాటించని స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలి. – జావీద్‌, ఎస్‌ఎఫ్‌ఐ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రైవేటు బడి అంతులేని దోపిడీ

ట్రెండింగ్‌

Advertisement