ఆదివారం 29 నవంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 08:24:35

రోడ్ల మరమ్మతులకు ప్రణాళిక సిద్ధం

రోడ్ల మరమ్మతులకు ప్రణాళిక సిద్ధం

ముషీరాబాద్‌: ప్రజల పట్ల గౌరవం ఉండే ప్రభుత్వాలకు పనులపట్ల శ్రద్ధ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిరూపించు కుంటుంది. ఎవరికీ ఏ ఆపద వచ్చిన తక్షణమే స్పందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం దానికి అనుగుణంగా  కార్యరూపంలోకి దిగి పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతుంది. ఇటీవల భారీవర్షాలు, వరదల కారణంగా ముషీరాబాద్‌ నియోజకవర్గంలో జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-15 పరిధిలో 75 ప్రధాన, అంతర్గత రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లపై భారీ గుంతలు ఏర్పడడం, మరొకొన్ని చోట్ల కంకర తేలి ఇసుక మేటలు ఏర్పడ్డాయి.  ఆయా రోడ్లలో వాహనాల రాకపోకలు సాగించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముషీరాబాద్‌ నియోకవర్గంలోని రాంనగర్‌, అడిక్‌మెట్‌, ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, కవాడిగూడ, గాంధీనగర్‌ డివిజన్‌లలో పలు ప్రధాన అంతర్గత రోడ్లు వరదకు అధ్వాన్నంగా మారా యి. ముఖ్యంగా నాలాల పరివాహక ప్రాంతాలు, పల్లపు ప్రాంతాల రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఇటీవల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు డివిజన్‌లలో పర్యటించి రోడ్ల పరిస్థితిని అంచనా వేసి కొత్త రోడ్డు నిర్మాణాలు చేపట్టడానికి ప్రతిపాదనలు చేశారు. సర్కిల్‌-15 పరిధిలో మొత్తం 75 రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.  ఇందులో 15 ప్రధాన రోడ్లు, 55 అంతర్గత రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నట్లు గుర్తించిన ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు 45 రోడ్లకు రికార్పెటింగ్‌, మిగతావాటికి మర్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం రూ 8 కోట్ల వ్యయం ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్‌ ప్రక్రియ చేపట్టారు. వచ్చే నెల మొదటి వారం నాటికి టెండర్‌ ప్రక్రియ పూర్తికాగానే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి అధికారులు నిర్ణయించారు. 

వరదనీటి నాలాల్లో పూడిక తీత

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వరద నీటి నాలాలు, పైపులైన్‌లలో పూడికతీత పనులు మొదలుపెట్టారు. రూ 22 లక్షల వ్యయంతో పలు వరద నీటి పైపులైన్‌లు, నాలాల్లో పూడికను తొలగిస్తున్నారు. ఇం దులో అడిక్‌మెట్‌ డివిజన్‌ నాగమయ్యకుంట, పద్మకాలనీ, ముషీరాబాద్‌ డివిజన్‌ బాపూజీనగర్‌, గంగపుత్ర కాలనీ, భోలక్‌పూర్‌ డివిజన్‌ మహాత్మానగర్‌, పద్మశాలీ కాలనీతోపాటు హుస్సేన్‌సాగర్‌ నాలా పరివాహక బస్తీల్లో ప్రధానంగా పైపులైన్లు,  పూడిక తొలగించనున్నారు.