సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత ఆపత్కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తమవంతు సాయం అందించడానికి తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణులకు ఉచితంగా క్యాబ్ సర్వీస్ అందిస్తామని ప్రకటించింది. కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు భయానకంగా ఉండటంతో గర్భిణులకు అవసరమయ్యే అత్యవసర సేవలు సరైన సమయంలో అందకపోతే ప్రాణాలకే ముప్పు. సాధారణంగా గర్భిణులకు ఎప్పుడు ఎలాంటి సమస్య తలెత్తుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే వాహన డ్రైవర్లు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు.. నగరంలో ఎక్కడినుంచైనా ఒక్క ఫోన్ చేస్తే సరిపోతుంది… సంబంధిత ప్రాంతంలోనే క్యాబ్ డ్రైవర్స్ అందుబాటులో ఉంటారు. నిమిషాల్లో లొకేషన్‌కు చేరుకుని ఆసుపత్రికి తరలిస్తారు. పూర్తిగా శానిటైజేషన్ చేసిన వాహనాలనే గర్భిణులకు సేవలందించేందుకు వినియోగిస్తారు. అవసరమున్న వారు ఫోన్: 9177624678 కు ఫోన్ చేయాలని వారు కోరారు.