మంగళవారం 07 జూలై 2020
Hyderabad - Jun 01, 2020 , 01:54:44

విద్యుత్‌కు అంతరాయం.. అరగంటలోపే పునరుద్ధరణ

విద్యుత్‌కు అంతరాయం.. అరగంటలోపే పునరుద్ధరణ

హైదరాబాద్  :  నగరంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి 355 ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడటం, కరెంటు స్తంభాలు నెలకూలడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వెంటనే  రంగంలోకి దిగిన టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు అర గంట వ్యవధిలోనే చెట్ల కొమ్మలను తొలిగించి, తెగిపడిన తీగల స్థానంలో కొత్తవి బిగించి సరఫరాను పునరుద్ధరించారు.

 గచ్చిబౌలి కో-ఆపరేటివ్‌నగర్‌, పాపిరెడ్డినగర్‌లో ఐదు కరెంటు స్తంభాలు పడిపోయాయి.  ఉప్పల్‌, ఏఎస్‌రావునగర్‌, కీసర, యాప్రాల్‌ తదితర ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఇవన్నీ 11 కేవీ ఫీడర్లపై పడటంతో 42 ఫీడర్లలో  సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 80 శాతం ఏరియాల్లో అరగంటలోపే సరఫరా పునరుద్ధరించామని, క్లిష్టంగా ఉన్న 20శాతం ప్రాంతాల్లో మాత్రం గంట తర్వాత యథావిధిగా సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు.


logo