బంజారాహిల్స్,మే 30: ‘తెలిసీతెలియక ఫ్రాంక్ వీడియోల్లో ‘గే ’పాత్రలో నటించడం.. తన జీవితాన్ని నరకంగా మార్చింది..’ వీడియోలు చూసిన వారంతా నన్ను గే అంటూ గేలిచేస్తూ నరకం చూపిస్తున్నారు.. ఎవరూ కూడా దగ్గరకు రానివ్వడం లేదు.. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదంటూ.. ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను గే అంటూ గేలిచేస్తున్న వారివల్ల ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందంటూ బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా వీర్లపాడు మండలం, నందలూరు గ్రామానికి చెందిన జూపూడి ఏసుబాబు అలియాస్ కుమార్ అనే యువకుడు బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి సినీ పరిశ్రమలో సెట్ వర్క్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా కొంతమంది స్నేహితులతో కలిసి కొన్ని ఫ్రాంక్ వీడియోల్లో ‘గే’ పాత్రలో నటిస్తున్నాడు. వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాడు. అయితే.. తాను నటించిన ఫ్రాంక్ వీడియోలను చూసిన జనం.. తాను నిజంగానే గే అనుకుంటున్నారని.. తనను గేలిచేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని, వారి వేధింపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని, తనను అంటరానివాడిగా చూస్తున్నారని, తన పక్కన నిలబడేందుకు కూడా ఎవరూ ఇష్టపడకపోవడంతో తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను వేధింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏసుబాబు ఫిర్యాదులో కోరాడు.