బంజారాహిల్స్, సెప్టెంబర్ 22: సినిమాల ప్రభావంతో ఓ బాలుడు ఎనిమిదేండ్ల బాలికను ముద్దుపెట్టుకోవడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 10లో నివాసం ఉంటున్న బాలిక (8) ఒక ప్రైవేటు స్కూల్లో మూడో తరగతి చదువుతున్నది. పక్కింటి వాచ్మెన్ కొడుకు (14) మంగళవారం సాయంత్రం అపార్ట్మెంట్ వద్దకు వచ్చి అక్కడ ఆడుకుంటున్న బాలికను 6వ ఫ్లోర్లో ఎవరో పిలుస్తున్నారంటూ లిఫ్ట్‌లో తీసుకువెళ్లాడు. లిఫ్ట్‌లో వెళ్తున్న సమయంలో బాలికను ముద్దు పెట్టుకోవడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించాడు. కిందకు వచ్చిన తర్వాత బాలిక తల్లికి జరిగిన విషయం చెప్పింది. బాలిక తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేయగా, బాలుడిపై సెక్షన్ 354తోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలుడిని పీఎస్‌కు పిలిపించి విచారించగా.. తాను ఇటీవల కొన్ని సినిమాలు టీవీలో చూశానని, వాటిలో హీరోయిన్ను ముద్దు పెట్టుకొనే సీన్లు తనకు నచ్చాయని, తాను కూడా అలాగే చేయాలనే ఉద్దేశంతో అలా చేశానంటూ.. చెప్పడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.