శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Aug 08, 2020 , 00:28:35

పుష్కలంగా వర్షాలు సరిపడా నీళ్లు

పుష్కలంగా వర్షాలు సరిపడా నీళ్లు

తాగునీటికి చింత లేదిక

నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు చేరిక 

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎల్లంపల్లిలో ఏడాది పొడవునా నీరు 

గత ఏడాది కంటే రిజర్వాయర్లలో ఆశాజనకంగా పెరిగిన నీటి నిల్వలు 

వచ్చే వేసవిలోనూ నీటి ఎద్దడి ఉండదని అధికారుల భరోసా 

విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున గోదావరి ఉప్పొంగుతున్నది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఈ రెండు జీవనదులతో నగర దాహార్తిని తీర్చే రిజర్వాయర్లు జలకళలాడుతున్నాయి. ఇది నగర వాసులకు శుభవార్తే. దీంతో  వేసవిలో నగర వాసులకు తాగునీటి చింత ఉండదని అధికారులు తీపికబురు అందజేశారు.. గతేడాదికంటే ఈ సారి నీటినిల్వలు పెరిగినట్లు తెలిపారు. రానున్నరోజుల్లో డిమాండ్‌కు అనుగుణంగా నీటిని సరఫరా చేస్తామన్నారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజల దాహార్తిని తీర్చడంలో ముఖ్యభూమిక పోషిస్తున్న నాగార్జున సాగర్‌, ఎల్లంపల్లి జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద తో ఎల్లంపల్లి, శ్రీశైలం నుంచి దిగువనున్న నాగార్జున సాగర్‌కు కొత్త నీరు వచ్చి చేరుతున్నది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. గతేడాది కంటే రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటంతో గ్రేటర్‌కు తాగునీటికి ఎలాంటి ఢోకా లేదని జలమండలి అధికారులు తెలిపారు. 

ఈ రెండు జీవనదులే కీలకం..

 వాస్తవంగా గతేడాది ఇదే సమయానికి నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 510.600 అడుగులకు చేరి ప్రమాదకర పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ సారి అత్యవసర పంపింగ్‌ అక్కర్లేకుండానే భారీగా సాగర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం శుక్రవారం నాటికి 556.400 అడుగుల మేరకు నీటి మట్టం చేరడంతో అధికారులు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. నాగార్జున సాగర్‌లో గడిచిన కొన్ని రోజులుగా కొత్త నీరు బాగా వచ్చి చేరుతుండటం, మరిన్ని రోజుల పాటు ఇన్‌ఫ్లో కొనసాగే అవకాశం ఉండటంతో వచ్చే వేసవిలోనూ కృష్ణా జలాల తరలింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు భరోసానిస్తున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎల్లంపల్లిలో ఏడాది పొడవునా నీటి నిల్వలు ఉండటం గోదావరి జలాల తరలింపుపై శాశ్వత భరోసా లభించినట్లు అయ్యింది. మొత్తంగా నగర నీటి సరఫరాలో ఈ రెండు జీవనదులే కీలకంగా మారాయి. 

ప్రతిరోజూ నగరానికి 442 ఎంజీడీల నీరు

138 కి.మీ దూరంలో ఉన్న అక్కంపల్లి (నల్లగొండ జిల్లా) జలాశయం నుంచి నిత్యం మూడు దశల పంపింగ్‌ ద్వారా 270 మిలియన్‌ గ్యాలన్ల కృష్ణా జలాలను రాజధానికి తరలిస్తున్నారు. 186 కి.మీ దూరంలో ఉన్న కరీంనగర్‌ జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి 172 మిలియన్‌ గ్యాలన్ల గోదావరి జలాలు నగర తాగునీటి అవసరాలను తీర్చుతుంది. రోజూ 472 మిలియన్‌ గ్యాలన్ల నీటి సరఫరాలో ఈ రెండు జీవనదుల నుంచే 442 ఎంజీడీల నీరు నగరానికి చేరుతుండటం గమనార్హం.  

గోదావరి జలాల తరలింపు ఇలా..

ఎల్లంపల్లి రిజర్వాయర్‌ సమీపంలో ఉన్న ఇన్‌టెక్‌ చానల్‌ (కాల్వ) నుంచి 53 కి.మీ దూరంలో ఉన్న బొమ్మకల్‌కు 121మీటర్ల ఎత్తున లిఫ్ట్‌ ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తున్నారు.

ఇక్కడ నుంచి 48కి.మీ దూరంలో ఉన్న మల్లారం నీటి శుద్ధి కేంద్రానికి 133.5 మీటర్ల ఎత్తున ఉన్న లిప్టు ద్వారా పంపింగ్‌ చేస్తున్నారు. 

మల్లారం వద్ద గోదావరి రా వాటర్‌ను శుద్ధి చేసి అక్కడి నుంచి 27కి.మీ దూరంలో ఉన్న కొండపాకకు 141 మీటర్ల ఎత్తున ఉన్న లిఫ్టు ద్వారా తరలిస్తున్నారు. 

ఇక్కడ మరోసారి నీటిని శుద్ధి చేసి అక్కడి నుంచి నగర శివారులో 58 కి.మీ దూరంలో ఉన్న ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ 120 మీటర్ల ఎత్తున ఉండే లిఫ్టు ద్వారా పంపింగ్‌ చేస్తున్నారు.

అక్కడినుంచి రెండు భారీ రింగ్‌ మెయిన్‌ పైపులైన్ల ద్వారా నగరం నలుమూలలకు గోదావరి జలాలను తరలిస్తున్నారు. 

లబ్ధి పొందుతున్న ప్రాంతాలు : లింగంపల్లి, కాప్రా, అల్వాల్‌, సైనిక్‌పురి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, పటాన్‌చెరు, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ తదితర మున్సిపల్‌ సర్కిళ్లకు  సరఫరా చేస్తున్నారు. 

కృష్ణా జలాల తరలింపు ఇలా..

నాగార్జునసాగర్‌ సమీపంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి 34కి.మీ దూరంలో ఉన్న కోదండాపూర్‌కు గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలిస్తున్నారు. 

అక్కడ శుద్ధి చేసి 353మీటర్ల ఎత్తున ఉన్న లిఫ్టు ద్వారా 24 కి.మీ దూరంలోని నాసర్లపల్లికి పంపింగ్‌ చేస్తున్నారు.

ఇక్కడ నీటిని శుద్ధి చేసి 495 మీటర్ల ఎత్తున ఉన్న లిఫ్టు ద్వారా 20 కి.మీల దూరంలోని గోడకండ్ల క్లియర్‌ వాటర్‌ రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. 

అక్కడి నుంచి 618 మీటర్ల ఎత్తున లిఫ్టు చేసి 31 కి.మీ దూరంలో ఉన్న గున్‌గల్‌ మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తున్నారు. 

ఇక్కడి నుంచి 29 కి.మీ దూరంలో ఉన్న సాహేబ్‌నగర్‌ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలిస్తున్నారు. అక్కడి నుంచి రింగ్‌ మెయిన్‌ పైపులైన్ల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు నీటిని అందిస్తున్నారు.

లబ్ధి పొందుతున్న ప్రాంతాలు : పాతనగరంతో పాటు ఎల్బీనగర్‌, రాజేంద్రనగర్‌, ఉప్పల్‌, మలక్‌పేట, మహేశ్వరం, తదితర ప్రాంతాల దాహార్తిని తీర్చుతున్నారు.

గ్రేటర్‌ తాగునీటి ముఖచిత్రం 

జలమండలి పరిధిలో మొత్తం నల్లా కనెక్షన్లు దాదాపు 12 లక్షలు 

రోజువారీ సరఫరా చేస్తున్న నీరు 472 ఎంజీడీలు (మిలియన్‌ గ్యాలన్‌ ఫర్‌ డే/ అంటే 214 కోట్ల 76 లక్షల లీటర్లు)

అక్కంపల్లి కృష్ణా మూడు దశల ద్వారా 270 ఎంజీడీలు, ఎల్లంపల్లి గోదావరి ద్వారా 172 ఎంజీడీలు 

ఉస్మాన్‌సాగర్‌ నుంచి 18 ఎంజీడీలు , హిమాయత్‌ సాగర్‌ నుంచి 12 ఎంజీడీలు  

నీటి నిల్వలను పరిశీలిస్తే ..(గతేడాది కంటే ఆశాజనకం)

జలాశయం          గరిష్ఠ నీటి మట్టం             గతేడాది పస్తుతం 

       (అడుగుల్లో/మీటర్లలో)     ఇదే సమయానికి (7వ తేదీ నాటికి)

ఉస్మాన్‌సాగర్‌ 1790.000 1764.200 1753.400


హిమాయత్‌సాగర్‌ 1763.500 1741.900 1734.050


అక్కంపల్లి 245.000 242.900 243.400


నాగార్జునసాగర్‌ 590.000 510.600 556.400


ఎల్లంపల్లి 485.560 484.910 467.680

వాటర్‌ భేఫికర్‌ 

రెండు జీవనదుల ఎగువ భాగంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కాళేశ్వరం ద్వారా ఎల్లంపల్లి నుంచి నీటి తరలింపునకు ఎలాంటి సమస్య ఉండదు. నాగార్జున సాగర్‌కు కూడా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. ఈ రెండు రిజర్వాయర్లలో ప్రస్తుతం నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటంతో నీటి సరఫరాపై ప్రజల్లో ఆందోళన అక్కర్లేదు. 

-  దానకిశోర్‌, జలమండలి ఎండీ