మంగళవారం 11 ఆగస్టు 2020
Hyderabad - Jul 06, 2020 , 00:17:03

మహమ్మారితో మజాక్‌

మహమ్మారితో మజాక్‌

పాజిటివ్‌ కేసులు 

జీహెచ్‌ఎంసీలో 1,277

రంగారెడ్డిలో 82 

మేడ్చల్‌లో 125

కరోనా  విజృంభిస్తున్నా.. పార్టీలు, విందులు వేడుకల్లో పరిమితికి మించి జనాలు తాజాగా ఓ హోటల్‌లో రేవ్‌ పార్టీ...

కొందరి నిర్లక్ష్యం ఎందరికో శాపం... పడగ విప్పుతున్న కొవిడ్‌ కేసులు

ఓ వైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే.. మరోవైపు కొందరు విందులు, వినోదాలతో కొవిడ్‌-19 వ్యాప్తికి మరింత ఆజ్యం పోస్తున్నారు. కరోనా కట్టడికి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నా.. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. హోటళ్లలో రేవ్‌ పార్టీలు.. ఎక్కువ మంది అతిథులతో బర్త్‌ డేలు.. సంగీత్‌లు, వేడుకలు నిర్వహిస్తూ..మహమ్మారిని విస్తరింపజేస్తున్నారు.  తాజాగా ఓ హోటల్‌లో కొందరు యువతీయువకులు రేవ్‌ పార్టీ చేసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

“తా చెడ్డ కోతి వనమంతా చెరిపినట్లు” చీకటి మాటున విందులు చేసుకుని వైరస్‌ను ఆహ్వానించడమే కాకుండా సమాజంలో తమ వారికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారు. 

కరోనా పడగ విప్పుతున్నది.. కోరలు చాస్తూ.. విలయతాండవం చేస్తున్నది. కరోనాను తరిమికొట్టడానికి ప్రభుత్వ పరంగా పెద్ద యుద్ధమే జరుగుతున్నది. వైద్యులు, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది ఇలా ఎందరో ఫ్రంట్‌ లైన్‌ వారియర్లు ముందుండి కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. వారికి సహకరించడంతో పాటు ఎవరికి వారే జాగ్రత్తలు పాటించి వైరస్‌ వ్యాప్తిని అరికట్టాల్సిన మహా ఆపద సమయమిది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కరోనా మాటేసి కాటేస్తున్నది. కానీ మన సమాజంలో కొంత మంది విందులు, వినోదాలలో మునిగి తేలుతున్నారు. నిప్పుతో చెలగాటమాడినట్లు రేవ్‌ పార్టీల పేరిట చిందులు వేస్తూ కరోనా ముప్పును నెత్తిన తెచ్చి పెట్టుకుంటున్నారు. బర్త్‌డే పార్టీలు, సామూహిక విందులు, వినోదాలు మానుకోవాలని, వివాహాలకు 50మందిలోపే హాజరు కావాలని అధికారులు పదేపదే ప్రచారంచేస్తున్నా కొందరు తమ విలాసాలను మానడం లేదు. అందులో సమాజంలో  పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వివిధ వర్గాల వారు ఏమవుతుంది లే అని బరితెగించడం వల్ల కొంపలు మునుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం, వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరులాగా మారుతున్నాయి.

మొక్కుబడిగా.. : నిపుణులు

చాలా ప్రాంతాలలో కొంతమంది ఇంకా నిర్లక్ష్యం ధోరణినే అవలంభిస్తున్నారని, ముఖ్యంగా యువత, సంపన్నులు కరోనా నియమాలు పాటించడంలో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు వాపోతున్నారు. ముఖ్యంగా సామూహిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కేసులు పదుల సంఖ్యలో పెరుగుతున్నాయి. కొంత మంది ముఖానికి మాస్కులు ధరించకపోవడం, ధరించినా వాటిని మొక్కుబడిగా వినియోగించడం, భౌతిక దూరం పాటించకపోవడం, కిరాణా దుకాణాలు, మెడికల్‌ షాపులు, మార్కెట్లు, దవాఖానలు, కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష కేంద్రాల్లో భౌతికదూరం పాటించకపోవడం వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణంగా నిలుస్తున్నది. ఈ క్రమంలోనే గ్రేటర్‌లో కరోనా కేసుల సంఖ్య నాలుగంకెలకు చేరింది. గ్రేటర్‌లో ఆదివారం 1277 పాజిటివ్‌ కేసులు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 82, మేడ్చల్‌లో 125 కేసులు నమోదయ్యాయి.

హిమాయత్‌నగర్‌లో ఇటీవల ఒక వజ్రాల వ్యాపారి తన జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు రెండువందల మందికి పైగా విందుకు హాజరయ్యారు. అందులో విద్యావంతులు, పెద్దలు కూడా ఉన్నట్లు సమాచారం. మరుసటి రోజు నుంచి విందులో పాల్గొన్న వారిలో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 40మందికి కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. పార్టీ ఇచ్చిన వ్యాపారితో పాటు ఇద్దరు కరోనా కాటుకి బలయ్యారు.

విపత్కర వేళ బరితెగింపు

 తాజాగా పార్క్‌ హయత్‌లో కొందరు యువతీ యువకులు రేవ్‌ పార్టీ పేరిట విందు చేసుకుని చిందులు వేయడం కలకలం రేపింది. విపత్కర వేళ ఈ బరితెగింపు ఏమిటి అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అత్తాపూర్‌, మాదాపూర్‌ తదితర ప్రాంతాలలో వివాహ వేడుకలకు పెద్ద సంఖ్యలో జనం హాజరుకావడం, పార్టీలు చేసుకోవడం వల్ల అసలు కేసులు లేని చోట కరోనా పాగా వేసింది. పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు తేలాయి. వారంతా వివాహాలకు, విందులకు హాజరైన వారే కావడం విశేషం. ఇటీవల జియాగూడ నుంచి మొదలుకుని పహాడీషరీఫ్‌, మలక్‌పేట, వనస్థలిపురం, తిరుమలగిరి, షాద్‌నగర్‌ వరకు విందులు, బర్త్‌డే పార్టీలు, అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనడంతోనే కేసులు ఒక్క సారిగా వందల సంఖ్యలో పెరిగిపోయాయి. 

పార్టీలే పార్టీలు..

పార్క్‌ హయత్‌ హోటల్‌లో రేవ్‌ పార్టీ, బేగంబజార్‌లో ఒక వజ్ర వ్యాపారి ఖరీదైన బర్త్‌డే పార్టీ, మాదాపూర్‌లో వివాహం, బాలాపూర్‌, అత్తాపూర్‌లో సంగీత్‌ ఫంక్షన్‌ ఇలా మహా ప్రళయ సమయంలోనూ విచక్షణ మరిచి విందులతో చిందులు వేయడం వల్ల రోజుకు వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు భౌతికదూరం పాటించి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా సహకరించాలని, ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రభుత్వం నిరంతరం ప్రచారం చేస్తున్నది. అవసరమైన వైద్య సేవలను అందించడంతో పాటు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పిస్తున్నది. అయినా సమాజంలో కొంత మంది తమ వైఖరిని మార్చు కోవడం లేదు. పేద, సామాన్య ప్రజలు కొంత అప్రమత్తంగా ఉంటున్నా సంపన్న వర్గాలు, యువకులు, ఇతర పెద్దలు తమ బాధ్యతను విస్మరించడం వల్ల తమకు చేటు చేసుకోవడంతో పాటు ఇతరులకు నష్టం తెస్తున్నారు.

విందులు వినోదాలకు దూరంగా ఉండండి 

కరోనా వైరస్‌ వల్ల జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. పండుగలు, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ఫంక్షన్లు వాయిదా వేసుకోవడం మంచిది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ప్రభుత్వ యంత్రాంగంతో సహకరించాలి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతున్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జనంలో భయం లేకుండా పోయింది. పరీక్షలు ఎక్కువ సంఖ్యలో జరుగడం వలన కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. స్వీయ నియంత్రణ పాటించాలి. కొద్ది మందితోనే ఫంక్షన్లను నిర్వహించుకోవాలి. సీజనల్‌ వ్యాధులు పొంచి ఉండటం వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

కుత్బుల్లాపూర్‌లో 54 మందికి.. 

దుండిగల్‌ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటివరకు 356 కేసులు నమోదు కాగా ఆదివారం మరో 54 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 410కి చేరుకున్నది. కాగా కరోనాతో ఇప్పటి వరకు 11మంది మృతి చెందినట్లు మండల వైద్యాధికారి తెలిపారు. 

యూసుఫ్‌గూడలో 34 మందికి..

వెంగళరావునగర్‌: యూసుఫ్‌గూడ సర్కిల్‌ పరిధిలో 34 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఉప కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. రహ్మత్‌నగర్‌లో 11, యూసుఫ్‌గూడలో 8, వెంగళరావునగర్‌లో 7, ఎర్రగడ్డలో 5, బోరబండలో 3 కేసులు నమోదైనట్లు తెలిపారు.

కూకట్‌పల్లిలో 19 మందికి..

బాలానగర్‌ : కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో 19 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి డాక్టర్‌ చందర్‌ తెలిపారు. కేపీహెచ్‌బీకాలనీలో 5, ఆల్విన్‌కాలనీలో 5, కూకట్‌పల్లిలో 2, బాలానగర్‌లో 2, రాజుకాలనీలో 2, వీవీనగర్‌లో 1, మూసాపేటలో 1 , ఓల్డ్‌బోయిన్‌పల్లి మల్లికార్జునగర్‌లో 1 కేసు నమోదైనట్లు తెలిపారు. ఇప్పటివరకు 219 కేసులు నమోదు కాగా ఏడుగురు మృతిచెందారు.

అహ్మద్‌నగర్‌లో 15 మందికి

అహ్మద్‌నగర్‌ : శాంతినగర్‌ పీహెచ్‌సీలో ఏడుగురికి, చింతల్‌బస్తీ పీహెచ్‌సీ పరిధిలో నలుగురికి కరోనా సోకింది. అదేవిధంగా ఎంజీ నగర్‌, సయ్యద్‌నగర్‌లో, అహ్మద్‌నగర్‌లలో నలుగురికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు.. 

ముషీరాబాద్‌లో..

బషీర్‌బాగ్‌ : ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 12 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు భోలక్‌పూర్‌, ముషీరాబాద్‌ యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపారు.

హిమాయత్‌నగర్‌ : హిమాయత్‌నగర్‌ డివిజన్‌లో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యి. కింగ్‌కోఠిలో ఇద్దరికి, హైదర్‌గూడలో ఐదుగురికి, హిమాయత్‌నగర్‌లో ముగ్గురికి, నారాయణ గూడలో ఇద్దరికి, నారాయణగూడ పీఎస్‌లో పనిచేసే మహిళా హోంగార్డుకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారిణి హేమలత తెలిపారు.

రామంతాపూర్‌ : ఉప్పల్‌, హబ్సిగూడ, రామంతాపూర్‌, చిలుకానగర్‌ ప్రాంతాల్లో 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

అంబర్‌పేట : అంబర్‌పేట నియోజకవర్గంలో ఆదివారం పది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాచిగూడ సుందర్‌నగర్‌లో వ్యక్తి (48) మృతి చెందాడు. నింబోలిఅడ్డాలోని బాలికల సదన్‌లో టీచర్‌కు, అటెండర్‌కు కరోనా సోకింది.

కాప్రా : కాప్రాసర్కిల్‌ పరిధిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో సర్కిల్‌లో మొత్తం కేసుల సంఖ్య 117కు చేరుకుంది.

బోడుప్పల్‌: బోడుప్పల్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. సాయిరాంనగర్‌లో తల్లీకూతురికి, అదేకాలనీలో చిన్నారికి(8), గాయత్రీనగర్‌లో వ్యక్తికి(39), భీంరెడ్డి నగర్‌లో మహిళకు(51) వైరస్‌ సోకింది.

శామీర్‌పేట : శామీర్‌పేట గ్రామానికి చెందిన వ్యక్తికి (55)  కరోనా సోకింది.


logo