మంగళవారం 04 ఆగస్టు 2020
Hyderabad - Jul 13, 2020 , 00:35:12

ప్లేట్లు.. ఫీట్లు

ప్లేట్లు.. ఫీట్లు

తప్పు.. కప్పిపుచ్చేందుకు మరో తప్పు..

నంబర్‌ ప్లేట్లపై అంకెలు కనిపించకుండా టేపులు.. బబుల్‌గమ్‌

తప్పించుకునేందుకు జిమ్మిక్కులు

50వేల మంది వాహనదారులపై  కేసులు...

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారులు.. పోలీసులకు చిక్కకుండా నానా జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు.  నంబర్‌ ప్లేట్లపై ఉన్న అంకెలు కనిపించకుండా చేస్తున్న వాహనదారుడి  సర్కస్‌ ఫీట్లు చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. చేస్తున్న పోరపాట్ల నుంచి తప్పించుకునే  క్రమంలో కొత్తగా మరో తప్పు చేస్తున్నారు. నేరాల సంఖ్యను పెంచుకుంటున్నారు. 

ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించే వారికి చెక్‌ పెట్టేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. వాహనదారుల్లో మాత్రం మార్పు రావడంలేదు. రాంగ్‌ రూట్‌లో వెళ్లడం.. హెల్మెట్‌ ధరించకుండా వాహనం నడిపించడం.. ట్రిపుల్‌ రైడింగ్‌.. పత్రాలు లేకుండా వాహనాలు నడిపించడం.. సిగ్నల్‌ జంపింగ్‌.. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపించడం, సీటుబెల్ట్‌ ధరించకపోవడం.. వంటి పొరపాట్లు చేస్తున్నారు. కూడళ్లు, రహదారులపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కంటికి చిక్కుతున్నారు. 

ఉల్లంఘనకు పాల్పడిన వాహనదారుడిని గుర్తిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు.. వారి చిరునామాకు చలాన్‌ పంపిస్తున్నారు. నిఘా పెట్టి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా కొంతమంది చేస్తున్న వింత పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చేసిన.. చేస్తున్న తప్పుల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు కొత్తగా మరిన్ని పొరపాట్లు చేస్తూ నేరాల సంఖ్యను పెంచుకుంటున్నారు.

వింత చేష్టలు..

వాహనం నంబర్‌ కనిపించకుండా పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. కొంతమంది వాహనదారులు ముందుగానే జాగ్రత్త పడుతూ సీసీ కెమెరాకు, పోలీసులకు చిక్కకుండా నంబర్‌ ప్లేట్‌పై ఉన్న అంకెలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. మరికొందరు అంకెలు కనిపించకుండా టేపులు అతికిస్తుండగా... ఇంకొందరు బబుల్‌ గమ్‌ పెడుతున్నారు. వాహనం వెనుక కూర్చుంటున్న వారు కూడా ఒక చేతితో వాహనం పట్టుకొని.. మరోచేతితో, పాదంతో నంబర్‌ ప్లేట్‌పై ఉన్న అంకెలు కనిపించకుండా చేస్తున్నారు.

రెండు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 50 వేల మంది వాహనదారులు తమ ఉల్లంఘనలను పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు పాట్లు పడుతున్నారు. ఈ విషయం సైబరాబాద్‌, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు నమోదు చేసిన కేసులతో స్పష్టమవుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై 11 వరకు  సైబరాబాద్‌ పరిధిలో  37,308, రాచకొండలో 12,797 వాహనాలపై ఈ చలాన్‌లను జారీ చేశారు. నంబర్‌ ప్లేట్ల ట్యాంపరింగ్‌ కేసుతో పాటు, మరికొన్ని సెక్షన్‌లతో కేసులు నమోదు చేస్తున్నారు.

పోలీసులు సీరియస్‌..

దాదాపు 50 వేల వాహనదారులపై చలాన్‌లను జారీ చేసిన సైబరాబాద్‌, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పుడు నంబర్‌ ప్లేట్లను దాచిపెట్టి విన్యాసాలు చేస్తున్న వారిపై క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తున్నారు. సైబరాబాద్‌ పరిధిలో 48 మందిపై క్రిమినల్‌ కేసులను నమోదు చేసి..ఆ కేసులను సంబంధిత పోలీస్‌స్టేషన్‌లకు అప్పగించారు. ఇక రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శాంతి భద్రతల పోలీసులు కూడా దాదాపు 843 వాహనదారులపై  క్రిమినల్‌ కేసులతో పాటు ఎంవీ యాక్ట్‌ కింద కేసులను నమోదు చేశారు. ఇలాంటి తప్పులు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.

నంబర్‌ ప్లేట్లు ట్యాంపరింగ్‌ చేస్తే వాట్సాప్‌ చేయండి - సీపీ అంజనీకుమార్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వాహనాల నంబర్‌ ప్లేట్లు ట్యాంపరింగ్‌ చేసే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. నంబర్‌ ప్లేట్లు ట్యాంపరింగ్‌ చేసి.. నేరాలకు పాల్పడే వారి సమాచారాన్ని పెట్రోల్‌ కార్స్‌, బ్లూకోల్ట్స్‌కు చెప్పడంతో పాటు అలాంటి వారి ఫొటోలు తీసి హైదరాబాద్‌ పోలీస్‌ వాట్సాప్‌ (9490616555)కు పంపించాలన్నారు. ఇలాంటి వారు చైన్‌, సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతుంటారని, రౌడీలు కూడా ట్యాంపరింగ్‌ చేస్తుంటారని ట్విట్టర్‌లో తెలిపారు.


logo