బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 24, 2020 , 01:05:07

హైకోర్టు ఆదేశాలతో ప్లాస్టిక్‌ పరిశ్రమలపై కొరడా

 హైకోర్టు ఆదేశాలతో ప్లాస్టిక్‌ పరిశ్రమలపై కొరడా

హైదరాబాద్  :  నిబంధనలు పాటించకుండా నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కాలుష్య కారక ప్లాస్టిక్‌ పరిశ్రమలపై పీసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. లైసెన్సులు పొందకుండా, పర్యావరణ చట్టాలను పాటించకుండా ఇష్టారీతిన నడుపుతున్న వాటిపై ఉక్కుపాదం మోపారు. నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టుగా ఉన్న వాటిపై చర్యలు తీసుకున్నారు. ఇలా నగరంలోని 66 పరిశ్రమలను మూసివేశారు. ఇవన్నీ కాటేదాన్‌, శాస్త్రి పురం తదితర ప్రాంతాల్లో ఉండగా, ఒకే సారి ఇంత మొత్తంలో పరిశ్రమలను మూసివేయడం సంచలనం కలిగించింది.

లైసెన్సులు పొందకుండానే..

పర్యావరణ చట్టాల ప్రకారం ఏ పరిశ్రమ అయినా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. పరిశ్రమల వ్యవస్థాపనకు కాన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, ఉత్పత్తిని ప్రారంభించేందుకు కాన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ (సీఎఫ్‌వో)లను తీసుకోవాలి. సెక్షన్‌ 25, 26 వాటర్‌ యాక్ట్‌ - 1974, సెక్షన్‌ 21 ఏయిర్‌ యాక్ట్‌ -1981 ప్రకారం పరిశ్రమల ఏర్పాటుకు కాన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీఎఫ్‌ఈ), ఉత్పత్తిని ప్రారంభించుకునేందుకు కాన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ (సీఎఫ్‌వో)లను పీసీబీ నుంచి పొంది ఉండాలి. కానీ కాటేదాన్‌, శాస్త్రిపురం ప్రాంతాల్లోని ఈ 66 పరిశ్రమలు ఎలాంటి అనుమతులు పొందకుండానే ఏండ్లుగా నడుస్తున్నాయి.

హైకోర్టు ఆదేశాలతోనే.. 

శాస్త్రిపురం, కాటేదాన్‌లతో పాటు, బహదూర్‌పురా, మూసీనదిని అనుకున్న ఉన్న ప్రాం తాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ టెక్స్‌టైల్‌, ప్రింటింగ్‌, ఇడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీస్‌, ఆయిల్‌ రిక్లేమేషన్‌ యూనిట్లు, ప్లాస్టిక్‌ స్క్రాప్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు కంపెనీలున్నాయి. వీటి నుంచి విఫరీతంగా కాలుష్యం వెలువడుతున్నది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్వహించిన అధ్యయనంలోనూ ఈ ప్రాంతం 57.73 స్కోర్‌తో పొల్యూటెడ్‌ ఏరియాగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతాల్లో వెలువడుతున్న కాలుష్యంపై గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కాలుష్య కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఆయా యూనిట్లను మూసివేయాలని ఆదేశాలిచ్చింది. అయితే దీనిపై పీసీబీ అధికారులు తాత్కారం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. గత మూడు నెలలుగా ఈ ఫైల్‌ను తొక్కిపెట్టి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పీసీబీ సభ్యకార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌ రాకతో ఫైల్‌ దుమ్ముదులిపి సంబంధిత పరిశ్రమలపై చర్యలు తీసుకున్నారు. 


logo