e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home హైదరాబాద్‌ కష్టకాలం.. ఆదుకుంటాం

కష్టకాలం.. ఆదుకుంటాం

కష్టకాలం.. ఆదుకుంటాం
 • అవసరం ఉన్న వారికి అండగా ఉంటాం
 • సేవనందించడంలో గుణవంతులం
 • మహమ్మారి కాలంలో..సైబరాబాద్‌ కోవిడ్‌ కంట్రోల్‌ రూంలో సేవలందిస్తున్న 55 మంది వలంటీర్లు
 • 13 వేల మందికి కౌన్సెలింగ్‌,ప్లాస్మా దానంపైసందేహాల నివృత్తి
 • ఆపద వేళ చేతనైనంత సాయం చేద్దాం

అందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నవారే. సమాజానికి మాత్రం తమ వల్ల ఎంతో కొంత మేలు జరిగితే అదే తమకు ఆనందమని భావించారు. కరోనా విసిరిన పంజాకు తాము చవిచూసిన కష్టాలు మరొకరికి రావొద్దని తలిచారు. అందుకే తమ ఉద్యోగాలు చేసుకుంటూనే.. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో వలంటీర్లుగా చేరి సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాలు పంచుకున్నారు. గత ఏడాది సైబరాబాద్‌ పోలీసులు ఏర్పాటు చేసిన కొవిడ్‌ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ కేంద్రంలో సేవలు ప్రారంభించారు. వైరస్‌ సోకిన వారి క్షేమ సమాచారాలు కనుక్కోవడం, కోలుకున్న వారిని ప్లాస్మా ఇచ్చేలా ప్రోత్సహించడం, వారి సందేహాలు తీర్చడం, ప్లాస్మా అవసరమైన వారికి వెంట వెంటనే సమాచారం ఇచ్చి దాతలతో సమన్వయపరచడం వంటి పనులు చేస్తున్నారు. ఇలా ఇప్పటికి 13 వేల మంది కుటుంబాలకు తోడ్పడ్డారు. అటువంటి స్వచ్ఛంద సేవకులపై కథనం.

సాయం మంచిదే కదా..

మా ఆంటీకి బీ నెగెటివ్‌ గ్రూపు రక్తం కావాల్సి వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాం. ఆ సందర్భం నాకు పెద్ద అనుభవం. ఆ కష్టం చూసి నేను కూడా ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు 12 సార్లు ప్లేటెలెట్స్‌ను, 20 సార్లు రక్తాన్ని దానం చేశాను. ఇప్పుడు కొవిడ్‌ సెంటర్‌ ద్వారా.. రక్తం, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ అవసరమైన వారికి దాతలను సంప్రదించి సమన్వయ పరుస్తున్నాం. మనం ముందుకొస్తే.. మనలాగే ఇంకొకరు మరొకరి కోసం ముందుకొస్తారు కదా. ఎంతైనా..సాయం చేయడం చాలా మంచి పని కదా – వివేక్‌, ట్రిపుల్‌ ఐటీ ఉద్యోగి

కొవిడ్‌ మహమ్మారి కాలంలో కొంతమంది పౌరులు నిరంతర సేవలు అందిస్తున్నారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో 55 మంది వలంటీర్లు ఒక వైపు ఉద్యోగం, మరోవైపు చదువుకుంటూ.. ఇంకోవైపు కరోనా విషమ పరిస్థితుల్లో ఉన్నవారికి ప్లాస్మా అందేలా కృషి చేస్తున్నారు. అలాగే కరోనా విజేతలకు కౌన్సెలింగ్‌ ఇస్తూ.. ప్లాస్మాకు ముందుకు వచ్చేలా చేస్తున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌లో వారి సేవలు రెట్టింపు అయ్యాయి. సేవకు ఆర్థిక మద్దతు లేకపోయినా.. ఉద్యోగాలకు, చదువులకు అంతరాయం కలుగకుండా.. సమయాన్ని విభజించుకుని.. ఇప్పటివరకు దాదాపు 13 వేల మంది కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు.

సేవా ఇలా..

 • ఎస్‌సీఎస్‌సీకి చెందిన 55 మంది వలంటీర్లు.. సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూంలో షిఫ్టులవారీగా పనిచేస్తుంటారు..
 • మరికొందరు వీకెండ్‌లో కంట్రోల్‌ రూంకు వస్తారు..
 • ఈ వలంటీర్లు నగరంలో కరోనాబారిన పడి కోలుకున్న తర్వాత వారిని సంప్రదిస్తారు.
 • మీరు ప్లాస్మా దానం చేస్తే.. మరికొందరి ప్రాణాలను కాపాడినవారవుతారని వారికి కౌన్సెలింగ్‌ ఇస్తారు..
 • వారు ఒప్పుకోగానే వారి వివరాలను సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూంకు పంపిస్తారు..
 • అదే సమయంలో ఎవరైనా ప్లాస్మా కావాలని విజ్ఞప్తి రాగానే…
 • వారికి అవసరమైన గ్రూపు ప్లాస్మాదాతను బాధితుడి వద్దకు పంపిస్తారు..
 • ఈ విధంగా గత ఏడాది జూలై నుంచి ఎస్‌సీఎస్‌సీ వలంటీర్లు దాదాపు 13 వేల మంది బాధితులకు అండగా నిలిచి.. వారి ప్రాణాలను కాపాడారు.
 • కేవలం ప్లాస్మా కాకుండా ప్లేట్‌ లెట్స్‌, రక్తం కావాల్సిన వారికి కూడా దాతలను తీసుకువచ్చి సేవలు అందిస్తుంటారు.

నాసేవ.. పలువురికి ఉపయోగపడాలనే..

నేను బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నా. చిన్నప్పటి నుంచి సేవచేసి.. పలువురికి ఉపయోగపడాలనే కోరిక ఉండేది. అందుకే ఎస్‌సీఎస్‌సీలో వలంటీరుగా చేరాను. ఈ సేవ.. నా చదువుకు అడ్డంకిగాకుండా సమయాన్ని విభజించుకుని ఒక వైపు ప్లాస్మా దానం కోసం కౌన్సెలింగ్‌ చేస్తూ … అవసరం ఉన్న వారికి దాతను అందించే ప్రయత్నాలు చేస్తున్నా. ఇలా సేవను పొందినవారు.. కోలుకున్న తర్వాత వారు చెప్పే కృతజ్ఞతలు అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి మా కళాశాల యాజమాన్యం కూడా సహకరించడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా కరోనా కాలంలోనూ బాధితులకు సేవలందిస్తున్నా. – సంధ్య, విద్యార్థిని, జి.నారాయణమ్మ కళాశాల

ఇంట్లో నుంచే దాతను గుర్తిస్తా..

 • నాకు ఇతరులకు సేవ చేయాలనే కోరిక ఉంది..
 • ఇందుకు ఇంట్లో ఉదయం 9 గంటలకల్లా పనిముగించుకుని.. ఇంట్లో నుంచే ప్లాస్మా దాతలను గుర్తించి.. వారికి ఉన్న అపోహలు, అనుమానాలను తొలిగిస్తాను.
 • ఆ తర్వాత వారు ప్లాస్మాకు ఒప్పుకున్న అనంతరం.. ఆ గ్రూపు వివరాలను సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌కు అందించి… దాత వివరాలను పొందుపరుస్తాను.
 • అలాగే.. సీనియర్‌ సిటిజన్స్‌కు కావాల్సిన సహాయాన్ని అందిస్తాను.
 • ఇందులో నా కూతురు కూడా తన వంతు సహాయం చేస్తూ.. సహకరిస్తుంది. – ప్రశాంతి, గృహిణి

ఒక వైపు ఉద్యోగం.. మరో వైపు వలంటీర్‌గా

వలంటీరుగా పని చేయడం చాలా ఇష్టం. దీని కోసమే ఒకవైపు ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ.. మరో వైపు ఎస్‌సీఎస్‌సీ వలంటీరుగా గత నాలుగు ఏండ్లుగా సేవలు అందిస్తున్నా. అనేక సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నా. తాజాగా ఇప్పుడు కొవిడ్‌ సమయంలో పని చేస్తున్నా. వెబ్‌సైట్‌, ఫోన్‌ కాల్స్‌ను విశ్లేషించి… డోనర్స్‌ను అవసరం ఉన్న వారికి అందిస్తుంటాను. ప్రస్తుతం రెండో దశలో చాలా మంది భయపడుతుండటంతో డోనర్స్‌ తక్కువగా ఉంటున్నారు. అవసరం ఉన్నవారు అధికంగా నమోదవుతున్నారు. – రాజశేఖర్‌రెడ్డి, ప్రైవేటు ఉద్యోగి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కష్టకాలం.. ఆదుకుంటాం

ట్రెండింగ్‌

Advertisement