సోమవారం 03 ఆగస్టు 2020
Hyderabad - Jul 15, 2020 , 23:05:01

ప్లాస్మా ఇస్తానంటూ మోసం

ప్లాస్మా ఇస్తానంటూ మోసం

సైబర్‌ క్రైం పోలీసులకు బాధితుల ఫిర్యాదు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా కాలాన్ని సైబర్‌ నేరగాళ్లు సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వైరస్‌ నుంచి కోలుకున్నవారి ప్లాస్మా తీసుకొని, చికిత్స పొందుతున్న వారికి ఇవ్వడంతో త్వరగా నయమవుతోందని కొన్ని సందర్భాల్లో వైద్యులు సూచిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఓ సైబర్‌ నేరగాడు అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. కొవిడ్‌ బారిన పడిన కొంతమంది బాధితుల తరఫున వారి బంధువులు ఈ మోసంపై బుధవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. సందీప్‌రెడ్డి అనే పేరుతో ఓ వ్యక్తి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో తాను కరోనా నుంచి కోలుకున్నానని, తన ప్లాస్మాను రూ. 4వేలకు ఇస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. విషయం తెలుసుకున్న కొందరు అతడు సూచించిన ఖాతాకు నగదును పంపించారు. ఆ తరువాత నిందితుడు సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. మోసపోయామని గ్రహించిన కరోనా బాధితులు వారి బంధువుల ద్వారా సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. నలుగురు బాధితులు బుధవారం ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని, నిందితుడు చాలామందిని మోసం చేసినట్లు తెలుస్తోందని ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.


logo